Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - సామెత

సామెత 20

Help us?
Click on verse(s) to share them!
1ద్రాక్ష మద్యం ఎగతాళి పాలు చేస్తుంది. సారాయి మనిషిని గిల్లికజ్జాలు పెట్టుకునేలా చేస్తుంది. తప్ప తాగి దారి తప్పేవాడు బుద్ధి లేని వాడు.
2రాజు వల్ల కలిగే భయం సింహగర్జన వంటిది. రాజుకు కోపం రేపే వాడు తన ప్రాణానికే ముప్పు తెచ్చిపెట్టుకుంటాడు.
3కలహానికి దూరంగా ఉండడం మనిషికి గౌరవం. మూర్ఖుడు కావాలని వాదం పెట్టుకుంటాడు.
4నాట్లు వేసే కాలంలో సోమరిపోతు నాగలి పట్టడు. కోతకాలంలో పంటకోసం వస్తే వాడికి ఏమీ దొరకదు.
5మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది. వివేకం గలవాడు దాన్ని చేదుకుంటాడు.
6నేను నమ్మదగిన వాణ్ణి అని చాలామంది చెప్పుకుంటారు. అయితే నమ్మదగిన వాడు ఎవరికి కనిపిస్తాడు?
7యథార్థవర్తనుడు తన నీతిలో నడుచుకుంటాడు. అతని తదనంతరం అతని పిల్లలు ధన్యులౌతారు.
8న్యాయపీఠంపై కూర్చున్న రాజు తన కళ్ళతో చెడుతనాన్ని చెదరగొడతాడు.
9నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను. పాపమంతా వదిలించుకున్నాను అని ఎవరు అనగలరు?
10వేరువేరు తూకం రాళ్లు వేరువేరు కొలత గిన్నెలు, ఈ రెంటినీ యెహోవా అసహ్యించుకుంటాడు.
11చిన్నవాళ్ళను సైతం వారి చర్యలను బట్టి, వారి ప్రవర్తన శుద్ధమైనదా, యథార్థమైనదా అనే దాన్ని బట్టి వాళ్ళు ఎలాటి వాళ్ళో చెప్పవచ్చు.
12వినగల చెవి చూడగల కన్ను ఈ రెంటిని యెహోవాయే చేశాడు.
13అతిగా నిద్ర పోవద్దు. లేకపోతే దరిద్రం ముంచుకు వస్తుంది. మేలుకుని ఉంటే కడుపు నిండా ఆహారం ఉంటుంది.
14కొనేవాడు నాసిరకం అంటాడు. అవతలికి వెళ్లి దాన్నే మెచ్చుకుంటాడు.
15బంగారం, విస్తారంగా రత్నాలు ఉన్నాయి. కానీ వివేకంగా మాట్లాడే పెదాలు అమూల్యమైన ఆభరణాలు.
16పరాయివాడికి హామీగా ఉన్నవాడి బట్టలు తీసుకో. వ్యభిచారిణి కోసం పూచీ తీసుకున్న వాణ్ణి బాధ్యుడుగా ఎంచు.
17మోసం చేసి తెచ్చిన ఆహారం మనుషులకు మధురంగా ఉంటుంది. కానీ తరువాత నోరంతా మట్టిగొట్టుకు పోతుంది.
18ఉద్దేశాలు ఆలోచనచేత స్థిరం అవుతాయి. వివేక పూరితమైన నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే యుద్ధం చెయ్యి.

19కొండేలు చెప్తూ తిరిగేవాడు ఇతరుల గుట్టు బయట పెడతాడు. కాబట్టి వాగుడు కాయల జోలికి పోవద్దు.
20తన తండ్రిని గానీ తల్లిని గానీ దూషించేవాడి దీపం కారుచీకట్లో ఆరిపోతుంది.
21నడమంత్రపు సిరి వల్ల చివరకూ దీవెనలు రావు.
22కీడుకు ప్రతికీడు తలపెట్టవద్దు. యెహోవా కోసం కనిపెట్టుకో. ఆయన నిన్ను కాపాడుతాడు.
23అన్యాయమైన తూకం రాళ్లు యెహోవాకు అసహ్యం. దొంగ త్రాసును ఆయన ఒప్పుకోడు.
24మనిషి ప్రవర్తన యెహోవా వశంలో ఉంటుంది. తనకు జరగబోయేది అతనికి ఎలా తెలుస్తుంది?
25తొందరపడి, ఇది దేవునికి ఇచ్చేస్తున్నానని చెప్పడం, మొక్కుబడి చేసిన తరువాత దాన్ని గూర్చి విచారించడం ప్రమాద హేతువు.
26జ్ఞానంగల రాజు భక్తిహీనులను చెల్లా చెదరు చేసేస్తాడు. అలాటి వాళ్ళ మీద బరువైన చక్రం దొర్లిస్తాడు.
27మనిషి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది అంతరంగాలన్నిటినీ శోధిస్తుంది.
28కృప, సత్యం రాజుకు రక్ష. కృప మూలంగా అతడు తన సింహాసనాన్ని పదిలం చేసుకుంటాడు.
29యువకుల బలం వారికి శోభ. నెరిసిన తల వృద్ధులకు సౌందర్యం.
30గాయాలు చేసే దెబ్బలు మనసు లోతుల్లోకి దూరి చెడుతనాన్ని పరిహరిస్తాయి.