Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యెహెజ్కేలు

యెహెజ్కేలు 2

Help us?
Click on verse(s) to share them!
1ఆ స్వరం నాతో ఇలా చెప్పింది. “నరపుత్రుడా, నీవు లేచి నీ కాళ్ళపై నిలబడు. నేను నీతో మాట్లాడుతాను.”
2ఆయన నాతో మాట్లాడుతూ ఉండగా దేవుని ఆత్మ నన్ను పట్టుకుని నా కాళ్ళపై నిలువబెట్టాడు. అప్పుడు ఆయన స్వరం నేను విన్నాను.
3ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనాల దగ్గరకీ, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకీ నిన్ను పంపిస్తున్నాను. వాళ్ళ పితరులూ, వాళ్ళూ ఈ రోజు వరకూ నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు.
4వాళ్ళ వారసులు ఒట్టి మూర్ఖులు. వాళ్ళ హృదయాలు కఠినం. వాళ్ళ దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. నువ్వు ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని వాళ్ళకి చెప్పాలి.
5వాళ్ళు తిరగబడే జనం. అలా ప్రకటిస్తే వాళ్ళు విన్నా, వినకున్నా కనీసం వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకుంటారు.
6నరపుత్రుడా, నువ్వు వాళ్ళ మాటలకి గానీ, వాళ్లకి గానీ భయపడకు. నీ చుట్టూ ముళ్ళ చెట్లూ, బ్రహ్మజెముడు పొదలూ ఉన్నా, నువ్వు తేళ్ళ మధ్య నివాసం చేస్తున్నా భయపడకు. వాళ్ళు తిరుగుబాటు చేసే జాతి. అయినా వాళ్ళ మాటలకు భయపడకు. వాళ్ళ ముఖాలు చూసి వ్యాకుల పడకు.
7వాళ్ళు ఎంతో తిరగబడే జనం. అయితే వాళ్ళు విన్నా, వినకున్నా నా మాటలు వాళ్లకి చెప్పు.
8నరపుత్రుడా, నువ్వు అయితే నేను చెప్తున్నది విను. ఆ తిరగబడే జాతిలా నువ్వూ తిరుగుబాటు చేయకు. నేను నీకు ఇవ్వబోతున్న దాన్ని నోరు తెరచి తిను.”
9అప్పుడు నేను ఒక హస్తం నా దగ్గరికి రావడం చూశాను. ఆ చేతిలో చుట్టి ఉన్న ఒక పత్రం ఉంది.
10ఆయన ఆ చుట్ట నా ఎదుట విప్పి పరిచాడు. దానికి రెండు వైపులా రాసి ఉంది. దాని పైన గొప్ప విలాపం, రోదన, వ్యాకులంతో నిండిన మాటలు రాసి ఉన్నాయి.