Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యెహెజ్కేలు

యెహెజ్కేలు 23

Help us?
Click on verse(s) to share them!
1యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా అన్నాడు,
2“నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.
3వీళ్ళు ఐగుప్తు దేశంలో వేశ్యల్లా ప్రవర్తించారు. యవ్వనంలోనే వాళ్ళు వేశ్యల్లా ప్రవర్తించారు. అక్కడ వాళ్ళ రొమ్ములు వత్తడం, వాళ్ళ లేత చనుమొనలు నలపడం జరిగాయి.
4వాళ్ళల్లో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె చెల్లి పేరు ఒహొలీబా. వీళ్ళను నేను పెళ్లి చేసుకున్నప్పుడు, నాకు కొడుకులనూ, కూతుళ్ళనూ కన్నారు. ఒహొలా అనే పేరుకు షోమ్రోను, ఒహొలీబా అనే పేరుకు యెరూషలేము అని అర్థం.
5ఒహొలా నాది అయినప్పటికీ, వ్యభిచారం చేసి
6తన విటుల మీద మొహం పెంచుకుంది. ఆమె అష్షూరుకు చెందిన ఊదారంగు వస్త్రాలు ధరించుకున్న సైన్యాధిపతులనూ, అధికారులనూ, అందంగా ఉన్న యువకులనూ, గుర్రాల మీద స్వారీ చేసే వాళ్ళనూ మోహించింది.
7అష్షూరు వాళ్ళల్లో ముఖ్యులైన వాళ్ళందరి ఎదుట ఒక వేశ్యలా తిరుగుతూ, వాళ్ళందరితో వ్యభిచారం చేస్తూ, వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలన్నిటినీ ఆశించి తనను అపవిత్రం చేసుకుంది.
8ఐగుప్తులో దాని యౌవ్వనంలోనే వాళ్ళు దాని చను మొనలు నలిపి, దానితో పండుకుని, వాళ్ళ కామం దాని మీద ఒలకబోసినప్పుడు అది నేర్చుకున్న వేశ్య ప్రవర్తన విడిచిపెట్టలేదు.
9కాబట్టి దాని విటులకు నేను దాన్ని అప్పగించాను. అది మోహించిన అష్షూరు వాళ్లకు దాన్ని అప్పగించాను.
10వాళ్ళు దాని వస్త్రాలు తీసేసి నగ్నంగా చేశారు. దాని కొడుకులను, కూతుళ్ళను పట్టుకుని, దాన్ని కత్తితో చంపారు. ఆ విధంగా ఆమె ఇతర స్త్రీలకు అవమానంగా అయ్యింది. కాబట్టి ఇతర స్త్రీలు దాని మీద వాళ్ళ తీర్పు చెప్పారు.
11దాని చెల్లెలైన ఒహొలీబా దాన్ని చూసి, కామంలో దాన్ని మించిపోయి, అక్క చేసిన వ్యభిచారం కంటే ఇంకా అధికంగా పోకిరీతనం జరిగించింది.
12అష్షూరు వాళ్ళల్లో ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న సైన్యాధిపతులనూ, అధికారులనూ, అందంగా ఉన్న యువకులనూ, గుర్రాల మీద స్వారీ చేసే వాళ్ళనూ మోహించింది.
13అది తనను అశుద్ధం చేసుకుందని నేను గమనించాను. ఇద్దరు అక్కాచెల్లెళ్ళూ ఆ విధంగానే చేశారు.
14అప్పుడు అది తన వ్యభిచార క్రియలు ఇంకా అధికం చేసింది. ఎర్రని రంగుతో గోడ మీద చెక్కిన కల్దీయ పురుషుల ఆకారాలు చూసింది.
15మొలలకు నడికట్లు, తలల మీద విచిత్రమైన తలపాగాలు పెట్టుకుని, తమ జన్మదేశమైన బబులోను రథాలపై కూర్చున్న అధిపతుల స్వరూపాలు చూసి మోహించింది.
16అది వాళ్ళను చూసిన వెంటనే మోహించి, కల్దీయ దేశానికి వాళ్ళ దగ్గరికి వార్తాహరులను పంపి వాళ్ళను పిలిపించుకుంది.
17బబులోనువాళ్ళు పడుపు కోసం కోరి వచ్చి వ్యభిచారంతో దాన్ని అపవిత్రం చేశారు. వాళ్ళ చేత అది అపవిత్రం అయిన తరువాత, దాని మనస్సు వాళ్ళ మీద నుంచి తిరిగి పోయింది.
18ఈ విధంగా అది వ్యభిచారం అధికంగా చేసి, తన నగ్నత బహిర్గతం చేసి, దాన్ని పోగొట్టుకుంది గనుక తన అక్క విషయంలో నా మనస్సు తిరిగి పోయినట్టు దాని విషయంలో కూడా నా మనస్సు తిరిగిపోయింది.

19తన యవ్వనంలో ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచారం మనస్సుకు తెచ్చుకుని, ఆ తరువాత అది ఇంకా ఎన్నో వ్యభిచార క్రియలు జరిగించింది.
20గాడిద పురుషాంగం వంటి, గుర్రాల అంగాల వంటి అంగాలు కలిగిన తన విటులను మోహించింది.
21యవ్వనంలో నువ్వు ఐగుప్తీయుల చేత నీ లేత చనుమొనలను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని, అప్పటి సిగ్గుమాలిన ప్రవర్తన మళ్ళీ జరిగించింది.
22కాబట్టి ఒహొలీబా, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే. నీ మనస్సుకు దూరమైన నీ విటులను రేపి, నాలుగు వైపుల నుంచి వాళ్ళను నీ మీదకి రప్పిస్తాను.
23గుర్రాలు స్వారీ చేసే బబులోను వాళ్ళను, కల్దీయులను. అధిపతులను, ప్రధానాధికారులనందరిని, అష్షూరీయులను. అందంగా ఉండే శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను, అందరినీ నీ మీదకి నేను రప్పిస్తున్నాను.
24ఆయుధాలు పట్టుకుని, బళ్ళు కట్టిన రథాలతో, పెద్ద సైన్యంతో వాళ్ళు నీ మీదకి వచ్చి. పెద్ద డాళ్ళు, చిన్న డాళ్ళు పట్టుకుని, ఇనుప టోపీలు పెట్టుకుని వాళ్ళు నీ మీదకి వచ్చి. నిన్ను ముట్టడిస్తారు. వాళ్ళు తమ చేతలతో నిన్ను శిక్షించేలా నేను వాళ్లకు అవకాశం ఇస్తాను.
25ఉగ్రతతో వాళ్ళు నిన్ను శిక్షించేలా నా కోపం నీకు చూపిస్తాను. వాళ్ళు నీ ముక్కూ, చెవులూ కోస్తారు. నీలో మిగిలిన వాళ్ళు కత్తివాత పడి చస్తారు. నీ సంతానం అగ్నికి ఆహుతి అయ్యేలా, నీ కొడుకులనూ, నీ కూతుళ్ళనూ వాళ్ళు బందీలుగా పట్టుకుంటారు.
26నీ బట్టలు లాగేసి, నీ ఆభరణాలన్నీ తీసేస్తారు.
27ఐగుప్తు దేశంలో నీ సిగ్గుమాలిన ప్రవర్తన, నీ వ్యభిచార క్రియలు నీనుంచి తొలగిస్తాను. నువ్వు ఇంక నీ కళ్ళెత్తి ఐగుప్తు వైపు ఆశగా చూడవు. దాని గురించి ఇంక ఆలోచించవు.
28ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, చూడు! నువ్వు ద్వేషించిన వాళ్ళకూ, నీ మనస్సు దూరమైన వాళ్ళకూ నిన్ను అప్పగిస్తున్నాను.
29ద్వేషంతో వాళ్ళు నిన్ను బాధిస్తారు. నీ కష్టార్జితమంతా చెరబట్టి నిన్ను వస్త్రహీనంగా, నగ్నంగా విడిచిపెడతారు. అప్పుడు వ్యభిచారం వల్ల నీకు కలిగిన అవమానం వెల్లడి ఔతుంది. నీ వేశ్యక్రియలు, నీ దుష్ప్రవర్తన వెల్లడి ఔతుంది.
30నువ్వు అన్యప్రజలతో చేసిన వ్యభిచారం కారణంగా, నువ్వు వాళ్ళ విగ్రహాలు పూజించి అపవిత్రం అయిన కారణంగా నీకు ఇవి జరుగుతాయి. నీ అక్క ప్రవర్తించినట్టు నువ్వు కూడా ప్రవర్తించావు గనుక ఆమె తగిన శిక్షాపాత్ర నీ చేతికిస్తాను.
31ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే నీ అక్క తాగిన, లోతైన వెడల్పైన పాత్రలోనిది నీవు కూడా తాగాలి.
32ఆ గిన్నె చాలా పెద్దది, చాలా లోతైనది, గనుక నువ్వు ఒక ఎగతాళిగానూ, పరిహాసంగానూ ఔతావు.
33ఇది నీ అక్క షోమ్రోను గిన్నె! ఇది భయంతోనూ, వినాశనంతోనూ నిండినది. నువ్వు ఇది తాగి కైపెక్కి దుఃఖంతో నిండి ఉంటావు.
34అడుగు వరకూ దాని తాగి, ఆ గిన్నె చెక్కలు చేసి, వాటితో నీ స్తనాలు పెరికేసుకుంటావు. ఇది నేనే ప్రకటించాను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
35ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు, నువ్వు నన్ను మరిచిపోయి నన్ను వెనక్కి తోసేశావు గనుక నీ సిగ్గుమాలిన ప్రవర్తనకూ, నీ వ్యభిచార క్రియలకూ రావలసిన శిక్ష నువ్వు భరిస్తావు.”
36యెహోవా నాతో ఇలా అన్నాడు. “నరపుత్రుడా, ఒహొలాకునూ, ఒహొలీబాకునూ నువ్వు తీర్పు తీరుస్తావా? అలా ఐతే వాళ్ళ అసహ్యమైన పనులు వాళ్లకు తెలియజేయి.

37వాళ్ళు వ్యభిచారం చేశారు. వాళ్ళ చేతులకు రక్తం అంటింది. వాళ్ళు విగ్రహాలతో వ్యభిచారం చేశారు. నాకు కన్న కొడుకులను వాళ్ళ విగ్రహాలు మింగేలా వాటికి దహన బలి అర్పించారు.
38ఇంకా వాళ్ళు ఇలాగే నా పట్ల జరిగిస్తున్నారు. ఇంతే కాక, వాళ్ళు నా పవిత్ర ప్రాంగణాన్ని అపవిత్రం చేసిన రోజే, నేను నియమించిన విశ్రాంతి దినాలను కూడా అపవిత్రం చేశారు.
39తాము పెట్టుకున్న విగ్రహాల పేరట తమ పిల్లలను చంపిన రోజే, వాళ్ళు నా పవిత్ర ప్రాంగణంలోకి వచ్చి దాన్ని అపవిత్రం చేసి, నా మందిరంలోనే వాళ్ళు ఈ విధంగా చేశారు.
40దూరంగా ఉన్నవాళ్ళను పిలిపించుకోడానికి వాళ్ళు వర్తమానికులను పంపారు. వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ కోసం నువ్వు స్నానం చేసి, కళ్ళకు రంగు వేసుకుని, నగలు ధరించి,
41ఒక అందమైన మంచం మీద కూర్చుని, ఒక బల్ల సిద్ధం చేసి, దాని మీద నా పరిమళ ధూపద్రవ్యం, నా నూనె పెట్టావు.
42అప్పుడు అక్కడ ఆమెతో నిర్లక్ష్యంగా ఉన్న ఒక గుంపు సందడి వినిపించింది. ఆ గుంపులో చేరిన తాగుబోతులు ఎడారి మార్గం నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఈ వేశ్యల చేతులకు కడియాలు తొడిగి, వాళ్ళ తలలకు పూదండలు చుట్టారు.
43వ్యభిచారం చెయ్యడం వల్ల బలహీనురాలైన దానితో నేను ఇలా అన్నాను, ‘ఇప్పుడు వాళ్ళు దానితో, అది వాళ్ళతో వ్యభిచారం చేస్తారు.’
44వేశ్యతో చేసినట్టు వాళ్ళు దానితో చేశారు. అలాగే వాళ్ళు వేశ్యలైన ఒహొలాతోనూ, ఒహొలీబాతోనూ చేశారు.
45కాని, నీతిగల పురుషులు వ్యభిచారిణులకూ, రక్తపాతం జరిగించిన వారికీ రావలసిన శిక్షను విధిస్తారు. ఎందుకంటే, వాళ్ళు వ్యభిచారం చేశారు. వాళ్ళ చేతులకు రక్తం అంటింది.”
46కాబట్టి, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, వాళ్ళ మీదకి నేను సైన్యాన్ని రప్పిస్తాను. భయభీతులుగా చెయ్యడానికీ, కొల్లగొట్టుకుపోడానికీ వాళ్ళను శత్రువులకు అప్పగిస్తాను.
47ఆ సైనికులు రాళ్లు రువ్వి వాళ్ళను చంపుతారు. కత్తితో హతం చేస్తారు. వాళ్ళ కొడుకులనూ, కూతుళ్ళనూ చంపుతారు. వాళ్ళ ఇళ్ళను అగ్నితో కాల్చేస్తారు.
48స్త్రీలందరూ మీ వేశ్యాప్రవర్తన ప్రకారం చెయ్యకూడదనే సంగతి నేర్చుకునేలా మీ సిగ్గుమాలిన ప్రవర్తనను దేశంలో ఉండకుండాా తొలగిస్తాను.
49నేనే యెహోవానని మీరు తెలుసుకునేలా మీ సిగ్గుమాలిన ప్రవర్తనకు శిక్ష వస్తుంది. విగ్రహాలను పూజించిన పాపం మీరు భరిస్తారు.