Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యెహెజ్కేలు

యెహెజ్కేలు 27

Help us?
Click on verse(s) to share them!
1యెహోవా నాకు ఈ విషయం మళ్ళీ తెలియజేశాడు.
2నరపుత్రుడా, తూరు పట్టణం గురించి శోకగీతం మొదలు పెట్టి దానికిలా చెప్పు.
3సముద్రపు రేవుల మధ్య నువ్వు నివసిస్తున్నావు. అనేక తీరప్రాంతాల ప్రజలతో నువ్వు వ్యాపారం చేస్తున్నావు. యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, తూరూ “నేను అతిలోక సుందరిని” అని నువ్వనుకుంటున్నావు.
4నీ సరిహద్దులు సముద్రంలో ఉన్నాయి. నీ భవన నిర్మాతలు నీ అందాన్ని లోపరహితంగా చేశారు.
5నీ ఓడలను హెర్మోను పర్వత సరళ వృక్షం కలపతో కట్టారు. లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ దూలం చేశారు.
6బాషాను సింధూర చెక్కతో నీ తెడ్లు చేశారు. కుప్ర ద్వీపం నుంచి వచ్చిన కలపతో దంతపు పని పొదిగిన నీ ఓడ పైభాగం చేశారు.
7నీకు జెండాలుగా ఉండడానికి నీ తెరచాపలు ఐగుప్తులో తయారై బుట్టా వేసిన శ్రేష్ఠమైన నారతో చేశారు!
8సీదోను నివాసులు, అర్వదు నివాసులు నీ తెడ్లు వేసేవాళ్ళు. నీ పౌరుల్లో ఆరితేరినవాళ్ళు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు.
9బిబ్లోసుకు చెందిన నిపుణులు నీ ఓడలను బాగుచేసేవాళ్ళు. సముద్రంలో నీ సరకులు కొనడానికి సముద్ర ప్రయాణం చేసే నావికుల ఓడలన్నీ నీ రేవుల్లో ఉన్నాయి.
10పారసీక దేశస్థులు, లూదు వాళ్ళు, పూతు వాళ్ళు నీ సైన్యంలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. వాళ్ళు నీ డాళ్లనూ శిరస్త్రాణాలనూ నీలో వేలాడదీశారు. వాళ్ళు నీకు శోభ తెచ్చారు.
11అర్వదు వాళ్ళు, హెలెక్ వాళ్ళు, నీ సైన్యంలో చేరి అన్ని వైపులా నీ గోడల మీద ఉన్నారు. గమ్మాదు వాళ్ళు నీ ప్రాకారాల్లో ఉన్నారు. వీరంతా తమ డాళ్లు నీ గోడల మీద, చుట్టూ తగిలించారు. నీ సౌందర్యాన్ని లోపం లేనిదిగా చేశారు.
12రకరకాల సరకులు నీ దగ్గర చాలా ఎక్కువగా ఉండడం వలన తర్షీషు వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి నీ సరకులు కొన్నారు.
13యావాను, తుబాలు, మెషెకు ప్రాంతాలవాళ్ళు నీతో వ్యాపారం చేశారు. బానిసలనూ ఇత్తడి వస్తువులనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.
14బేత్ తోగర్మా వాళ్ళు గుర్రాలను యుద్ధాశ్వాలనూ కంచరగాడిదలనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.
15దదాను వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. అనేక సముద్ర తీరాల ప్రజలు నీ సరుకులు కొన్నారు. వాళ్ళు దంతం, నల్లచేవ మాను తెచ్చి ఇచ్చారు.
16నువ్వు చేసిన వివిధ వస్తువులను కొనుక్కోడానికి సిరియనులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు పచ్చలు, ఊదా రంగు, అద్దకం వేసిన బట్ట, నునుపైన బట్ట, ముత్యాలు, రత్నాలు ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
17యూదావారూ ఇశ్రాయేలు వారూ నీతో వ్యాపారం చేశారు. మిన్నీతు నుంచి గోదుమలు, చిరు ధాన్యాలు, తేనె, నూనె, గుగ్గిలం తెచ్చి నీ సరుకులు కొన్నారు.
18దమస్కు వాళ్ళు హెల్బోను ద్రాక్షారసం, జహారు ప్రాంతం ఉన్ని తెచ్చి నీతో వ్యాపారం చేశారు.
19ఉజ్జాలు నుంచి దాను, యావాను వాళ్ళు ఇనప పనిముట్లు, దాల్చిన చెక్క, వాము తెచ్చి నీ సరుకులు కొన్నారు.
20దెదాను వాళ్ళు గుర్రపు జీనుల కోసం వాడే బట్టలు తెచ్చి నీ సరుకులు కొన్నారు.
21అరేబియా వాళ్ళు, కేదారు నాయకులంతా నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, మేకలను తెచ్చి నీ సరుకులు కొన్నారు.
22షేబ వ్యాపారులు రమా వ్యాపారులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు అతి ప్రశస్తమైన గంధవర్గాలనూ విలువగల నానా విధమైన రత్నాలనూ బంగారాన్నీ ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు.
23హారాను వాళ్ళు, కన్నే వాళ్ళు, ఏదెను వాళ్ళు, షేబ వ్యాపారులు, అష్షూరు వ్యాపారులు, కిల్మదు వ్యాపారులు నీతో వ్యాపారం చేశారు.
24వీళ్ళు నీ బజారుల్లో అందమైన దుస్తులూ ఊదారంగు కుట్టుపనితో చేసిన బట్టలూ రంగు రంగుల తివాచీలు, గట్టిగా పేనిన తాళ్ళు తెచ్చి నీ సరుకులు కొన్నారు.
25తర్షీషు ఓడలు నీ సరుకులను వేర్వేరు స్థలాలకు తీసుకుపోయేవి. నువ్వు విస్తారమైన నీ సరుకులతో సముద్రం మధ్యలో కూర్చున్నావు.
26తెడ్లతో ఓడ నడిపేవాళ్ళు నిన్ను మహాసముద్రం లోకి తీసుకుపోయారు. అయితే తూర్పు గాలి సముద్ర మధ్యలో నీ మీద విరుచుకు పడింది.
27నువ్వు పతనమయ్యే రోజున నీ సంపద, నీ సరుకులు, నువ్వు మార్పిడి చేసుకునే వస్తువులు, నీ నావికులు, నీ ఓడ నాయకులు, నీ ఓడలు బాగు చేసే వాళ్ళు, నీతో వ్యాపారం చేసే వాళ్ళు, నీ సిపాయిలంతా, నీలో ఉన్న వాళ్ళంతా సముద్రం మధ్యలో మునిగిపోతారు.
28నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన సముద్ర తీర పట్టణాలు కంపిస్తాయి.
29తెడ్లు పట్టుకునే వాళ్ళంతా తమ ఓడలనుంచి దిగిపోతారు. నావికులూ ఓడనాయకులూ ఒడ్డున నిలబడతారు.
30తమ స్వరం మీరు వినేలా చేసి, వెక్కి వెక్కి ఏడుస్తారు. తమ తలల మీద దుమ్ము పోసుకుని బూడిదలో పొర్లుతారు.
31నీకోసం తమ తలలు బోడి చేసుకుని మొలకు గోనె పట్టా కట్టుకుని మనో వేదనతో నీ కోసం ఎంతో దుఖిస్తారు.
32వాళ్ళు నీ గురించి శోకగీతం మొదలుపెట్టి నీమీద మృత్యు గీతాలు ఇలా ఆలపిస్తారు, తూరు లాంటి పట్టణం ఎక్కడుంది? ఇప్పుడు సముద్రంలో మునిగిపోయి మౌనంగా ఉండిపోయింది.
33సముద్రం మీద నీ సరుకులు తీసుకు పోతూ అది అనేకమందికి తృప్తినిచ్చింది. నీ గొప్ప సంపద, వ్యాపారంతో భూరాజులు ధనికులయ్యారు.
34అయితే నువ్వు అగాధజలాల్లో మునిగి సముద్ర బలంతో బద్దలయ్యావు. నీ వ్యాపారం, నీ బలగమంతా మునిగిపోయింది.
35నిన్ను బట్టి సముద్ర తీరప్రాంత ప్రజలంతా నిర్ఘాంతపోయారు. వాళ్ళ రాజులు భయాందోళనతో వణికారు. వాళ్ళ ముఖాలు చిన్నబోయాయి.
36ప్రజల్లోని వ్యాపారులు నిన్నుహేళన చేస్తారు. నువ్వు భయభ్రాంతులు చెందావు. నీవిక ఎంత మాత్రం ఉనికిలో ఉండవు.