Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - 1 సమూ

1 సమూ 26

Help us?
Click on verse(s) to share them!
1గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి జీఫు నివాసులు వచ్చి, దావీదు యెషీమోను ఎదుట హకీలా కొండలో దాక్కున్నాడని తెలియజేశారు.
2సౌలు లేచి ఇశ్రాయేలీయుల్లో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకు దావీదును వెదకడానికి జీఫుకు బయలుదేరాడు.
3సౌలు యెషీమోను ఎదుట ఉన్న హకీలా కొండలో దారి పక్కన దిగినప్పుడు, ఎడారిలో ఉంటున్న దావీదు తనను పట్టుకోవాలని సౌలు వచ్చాడని విని,
4గూఢచారులను పంపి “సౌలు కచ్చితంగా వచ్చాడు” అని తెలుసుకున్నాడు.
5తరువాత దావీదు లేచి సౌలు సైన్యం మకాం వేసిన స్థలానికి వచ్చి, సౌలు, సౌలు సైన్యాధిపతి, నేరు కొడుకు అబ్నేరు నిద్రపోతున్న స్థలం చూశాడు. సౌలు శిబిరం మధ్యలో నిద్ర పోతున్నప్పుడు సైనికులు అతని చుట్టూ పడుకున్నారు.
6అప్పుడు దావీదు “శిబిరంలో ఉన్న సౌలు దగ్గరికి నాతో కలసి ఎవరు వస్తారు” అని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కొడుకు, యోవాబు సోదరుడైన అబీషైని అడిగాడు. “నీతో నేను వస్తాను” అని అబీషై అన్నాడు.
7దావీదు, అబీషైలు రాత్రి సమయంలో ఆ శిబిరం దగ్గరికి వెళితే సౌలు శిబిరం మధ్యలో పండుకుని నిద్రపోతున్నాడు. అతని ఈటె అతని దిండు పక్క నేలకు గుచ్చి ఉంది. అబ్నేరు, ఇతరులు సౌలు చుట్టూ పండుకుని నిద్రపోతున్నారు.
8అప్పుడు అబీషై దావీదును చూసి “దేవుడు ఈ రోజున నీ శత్రువుని నీకు అప్పగించాడు. నీకు ఇష్టమైతే అతడు భూమిలో దిగిపోయేలా ఆ ఈటెతో ఒక్కపోటు పొడుస్తాను. ఒక దెబ్బతో పరిష్కారం చేస్తాను” అన్నాడు.
9అప్పుడు దావీదు “నువ్వు అతణ్ణి చంపకూడదు, యెహోవా చేత అభిషేకం పొందినవాణ్ణి చంపి దోషి కాకుండా ఉండడం ఎవరివల్లా కాదు.
10యెహోవా మీద ఒట్టు, యెహోవాయే అతణ్ణి శిక్షిస్తాడు, అతడు ప్రమాదం వల్ల చస్తాడు, లేకపోతే యుద్ధంలో నశిస్తాడు.
11యెహోవా వలన అభిషేకం పొందినవాణ్ణి నేను చంపను. అలా చేయకుండా యెహోవా నన్ను ఆపుతాడు గాక. అయితే అతని దిండు దగ్గర ఉన్న ఈటె, నీళ్లబుడ్డి తీసుకు మనం వెళ్ళిపోదాం పద” అని అబీషైతో చెప్పాడు.
12సౌలు దిండు దగ్గర ఉన్న ఈటెను నీళ్లబుడ్డిని తీసుకు ఇద్దరూ వెళ్ళిపోయారు. యెహోవా వల్ల అక్కడు ఉన్న వారందరికీ గాఢనిద్ర కలిగింది. వారిలో ఎవ్వరూ నిద్ర నుండి లేవలేదు. ఎవ్వరూ వచ్చిన వాళ్ళను చూడలేదు, ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు.
13తరువాత దావీదు దూరంగా వెళ్ళి అక్కడ ఉన్న కొండపై నిలబడ్డాడు. వీరిద్దరి మధ్యా చాలా ఎడం ఉంది.
14అప్పుడు ప్రజలు, నేరు కొడుకు అబ్నేరు వినేలా “అబ్నేరూ, నువ్వు మాట్లాడతావా?” అని గట్టిగా కేకవేస్తే, అబ్నేరు కేకలు వేస్తూ “రాజుకు నిద్రాభంగం చేస్తున్న నువ్వు ఎవరివి?” అని అడిగాడు.
15అప్పుడు దావీదు “నీకు ధైర్యం లేదా? ఇశ్రాయేలీయుల్లో నీలాంటి వాడు ఎవరు? నీకు యజమాని అయిన రాజుకు నువ్వెందుకు కాపలా కాయలేకపోయావు? నీకు యజమాని అయిన రాజును చంపడానికి ఒకడు దగ్గరగా వచ్చాడే.
16నువ్వు చేసిన పని సరి కాదు, నువ్వు శిక్షకు పాత్రుడివే. యెహోవా వలన అభిషేకం పొందిన నీ యజమానికి నువ్వు రక్షణగా ఉండలేదు. యెహోవా మీద ఒట్టు, నువ్వు మరణశిక్ష పొందాల్సిందే. రాజు ఈటె ఎక్కడ ఉందో చూడు, అతని దిండు దగ్గర ఉన్న నీళ్లబుడ్డి ఎక్కడ ఉందో చూడు” అన్నాడు.
17సౌలు దావీదు గొంతు గుర్తుపట్టి “దావీదూ, నాయనా, ఇది నీ గొంతే కదా” అని పిలిచాడు. అందుకు దావీదు “నా యజమానీ, నా రాజా, ఇది నా స్వరమే.
18నా యజమాని దాసుడనైన నన్ను ఈ విధంగా అతడు ఎందుకు తరుముతున్నాడు? నేనేం చేశాను? నా నుండి నీకు ఏ కీడు సంభవిస్తుంది?

19రాజా, నా యజమానీ, దాసుడనైన నా మాటలు విను. నా మీద పగ సాధించాలని యెహోవా నిన్ను ప్రేరేపిస్తే ఆయన అర్పణ స్వీకరించి ఆయన్ను శాంతిపరచవచ్చు. మనుషులెవరైనా నిన్ను ప్రేరేపించినట్టైతే వారు తప్పక యెహోవా దృష్టిలో శాపానికి గురి అవుతారు. ఎందుకంటే వారు, ‘నువ్వు దేశం విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను పూజించు’ అని నాకు చెప్పి, యెహోవా సన్నిధానం నుండి నన్ను దూరం చేస్తున్నారు.
20నా దేశానికి, యెహోవా సన్నిధానానికి దూరంగా నా రక్తం ఒలక నియ్యవద్దు. ఒకడు బయలుదేరి కొండలపై కౌజుపిట్టను వేటాడినట్టుగా ఇశ్రాయేలు రాజవైన నువ్వు పురుగులాంటి నన్ను వెదకడానికి బయలుదేరి వచ్చావు.”
21అప్పుడు సౌలు “నేను పాపం చేశాను, ఈ రోజు నా ప్రాణం నీ దృష్టిలో విలువైనదిగా ఉన్నదాన్నిబట్టి నేను నీకు ఇక ఎన్నడూ హాని తలపెట్టను. దావీదూ, నా కొడుకా, నా దగ్గరికి తిరిగి వచ్చేయి. పిచ్చి వాడిలాగా ప్రవర్తించి నేను ఎన్నో తప్పులు చేశాను” అని పలికాడు.
22దావీదు “రాజా, ఇదిగో నీ ఈటె నా దగ్గర ఉంది. పనివాళ్ళలో ఒకడు వచ్చి దీన్ని తీసుకోవచ్చు” అన్నాడు.
23“యెహోవా ఈ రోజున నిన్ను నాకు అప్పగించినప్పటికీ, నేను యెహోవా వలన అభిషేకించబడిన వాణ్ణి చంపకుండా వదిలినందువల్ల ఆయన నా నీతి, విశ్వాస్యతను బట్టి నాకు తగిన బహుమానం ఇస్తాడు.
24విను, ఈ రోజు నీ ప్రాణం నా దృష్టిలో విలువైనది అయినట్టే, యెహోవా నా ప్రాణాన్ని తన దృష్టికి మిన్నగా ఎంచి బాధలన్నిటిలోనుండి నన్ను రక్షిస్తాడు గాక” అని చెప్పాడు.
25అప్పుడు సౌలు “దావీదూ, బిడ్డా, నీకు ఆశీర్వాదం కలుగు గాక. నీవు గొప్ప పనులు మొదలుపెట్టి విజయం సాధిస్తావు గాక” అని దావీదుతో చెప్పాడు. అప్పుడు దావీదు తన దారిన వెళ్లిపోయాడు. సౌలు కూడా తన స్థలానికి తిరిగి వచ్చాడు.