Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - లూకా - లూకా 8

లూకా 8:9-32

Help us?
Click on verse(s) to share them!
9ఆయన శిష్యులు, “ఈ ఉపమానం అర్థం ఏమిటి?” అని అడిగారు
10ఆయన, “దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే ఆధిక్యత మీరు పొందారు. ఇతరులైతే చూస్తూ ఉన్నా నిజంగా చూడకుండా, వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉంటారు గనక వారికి ఉపమానాల్లోనే బోధిస్తున్నాను.
11ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం.
12దారి పక్కన పడిన విత్తనాలు ఎవరంటే వీరు వాక్కును వింటారు గానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని తీసివేస్తాడు.
13రాతి నేలపై పడిన విత్తనాలు ఎవరంటే వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే వారు. కానీ వారిలో వేరు లేదు కాబట్టి కొంతకాలం నమ్మి తరువాత విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు.
14ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు.
15మంచి నేలపై పడే విత్తనాలు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్కును విని, భద్రంగా చేపట్టి ఓపికతో ఫలించేవారు.
16“ఎవరూ దీపాన్ని వెలిగించి బుట్టతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు. ఇంట్లోకి వచ్చే వారికి వెలుగు కనిపించేలా దీపస్తంభంపై ఉంచుతాడు.
17తేటతెల్లం కాని రహస్యమేదీ లేదు. తెలియకుండా, బయట పడకుండా, దాగి ఉండిపోయేది ఏదీ లేదు.
18కలిగిన వ్యక్తికే ఇస్తారు, లేని వ్యక్తి నుండి తనకు ఉంది అనుకున్నది కూడా తీసివేస్తారు. కాబట్టి మీరు ఎలా వింటున్నారో చూసుకోండి” అన్నాడు.
19ఆయన తల్లీ సోదరులూ అక్కడికి వచ్చారు గానీ అంతా గుంపుగా ఉండడం వల్ల ఆయనకు దగ్గరగా రాలేకపోయారు.
20అప్పుడు, “నిన్ను చూడ్డానికి నీ తల్లీ నీ సోదరులూ వచ్చి బయట నిలుచున్నారు” అని ఎవరో ఆయనతో అన్నారు.
21అందుకు ఆయన, “దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జరిగించే వారే నా తల్లీ నా తమ్ముళ్ళూ” అన్నాడు.
22మరొక రోజు ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి, “సరస్సు అవతలి వైపుకు వెళ్దాం” అన్నాడు. వారు ఆ పడవను నీటిలోకి తోసి బయలుదేరారు.
23వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు. ఈలోగా సరస్సు మీద బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది.
24కాబట్టి వారు ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ! ప్రభూ! నశించిపోతున్నాం” అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలినీ, ఉవ్వెత్తున లేచే కెరటాలనూ గద్దించాడు. అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది.
25అప్పుడు ఆయన, “మీ విశ్వాసం ఎక్కడ?” అన్నాడు. వారు భయపడి, “ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు.
26వారు గలిలయకి ఎదురుగా ఉండే గెరాసేను ప్రాంతానికి వచ్చారు.
27ఆయన ఒడ్డున దిగగానే ఆ ఊరి వాడు ఒకడు ఆయనను ఎదుర్కోడానికి వచ్చాడు. వాడికి దయ్యాలు పట్టి చాలా కాలం నుండి బట్టలు కట్టుకోకుండా తిరుగుతున్నాడు. సమాధులే వాడి నివాసం. ఇంట్లో ఉండేవాడు కాదు.
28వాడు యేసును చూసి, కేకలు వేశాడు. వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. అతడు “సర్వోన్నత దేవుని కుమారా, యేసూ, నా జోలి నీకెందుకు? నన్ను బాధించకు. నిన్ను బతిమాలుకుంటున్నాను” అంటూ కేకలు పెట్టాడు.
29ఎందుకంటే ఆయన, “ఈ వ్యక్తిని వదిలి బయటకు రా” అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు. అది చాలాసార్లు వాణ్ణి పట్టి పీడిస్తుంది. వాణ్ణి గొలుసులతోనూ, కాలి సంకెళ్ళతోనూ బంధించి వాడికి కాపలా పెట్టారు గానీ వాడు ఆ బంధకాలన్నిటినీ తెంచుకునేవాడు. దయ్యాలు వాణ్ణి చవిటి భూముల్లోకి తీసుకుపోయేవి.
30యేసు, “నీ పేరు ఏమిటి?” అని వాడిని అడిగాడు. చాలా దయ్యాలు వాడిలో చొరబడి ఉన్నాయి. కాబట్టి వాడు, “నా పేరు సైన్యం” అన్నాడు.
31పాతాళంలోకి వెళ్ళమని తనకు ఆజ్ఞ ఇవ్వవద్దని అవి ఆయనను ఎంతో బతిమాలాయి.
32అక్కడ పెద్ద పందుల మంద ఒకటి కొండ మీద మేస్తూ ఉంది. వాటిలో చొరబడడానికి అనుమతినిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు.

Read లూకా 8లూకా 8
Compare లూకా 8:9-32లూకా 8:9-32