35సీయోను నివాసులు ఇలా అంటారు. “నాకూ నా కుటుంబానికీ వ్యతిరేకంగా జరిగిన హింస నా ఉసురు తగిలి బబులోనుకు జరుగుతుంది గాక!” యెరూషలేము ఇలా అంటుంది. “నా రక్తం ఒలికించిన పాపం కల్దీయులకు తగులుతుంది గాక!”
36కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నేను నీ పక్షంగా వాదించ బోతున్నాను. నీ తరపున ప్రతీకారం చేస్తాను. బబులోనులో నీళ్ళు లేకుండా చేస్తాను. దాని ఊటలు ఇంకిపోయేలా చేస్తాను.
37బబులోను ఒక పెద్ద చెత్త కుప్పలా ఉంటుంది. నక్కల నిలయంగా మారుతుంది. భయానికీ, ఎగతాళికీ కారణంగా ఉంటుంది. ఎవరూ అక్కడ నివాసం ఉండరు.
38బబులోను వాళ్ళంతా కలసి సింహాల్లా గర్జిస్తారు. సింహం కూనల్లాగా కూత పెడతారు.
39వాళ్ళు దురాశతో ఉద్రేకం చూపినప్పుడు వాళ్ళ కోసం ఒక విందు ఏర్పాటు చేస్తాను. వాళ్ళు బాగా సంతోషపడేలా వాళ్ళతో మద్యం తాగిస్తాను. అప్పుడు వాళ్ళు శాశ్వత నిద్రలోకి వెళ్తారు. ఇక మేల్కొనరు. ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
40గొర్రెలు వధకు వెళ్ళినట్టుగా వాళ్ళని వధ్యశాలకు పంపుతాను. గొర్రెపిల్లలూ, మేకలూ వధకు వెళ్ళినట్టుగా వాళ్ళను పంపుతాను.
41బబులోనును ఎలా పట్టుకున్నారు? భూమిపై అందరూ పొగిడే పట్టణం లొంగిపోయింది. రాజ్యాలన్నిటిలో బబులోను ఎలా శిథిల దేశంగా మారింది?
42సముద్రం బబులోను పైకి వచ్చింది. భీకర హోరుతో అలలు దాన్ని ముంచెత్తాయి.
43దాని పట్టణాలు నిర్జనంగానూ, ఎండిన భూమిగానూ, అడవిగానూ మారిపోయాయి. ఎవ్వరూ నివాసముండని, ఎవరూ దాని మీదుగా ప్రయాణం చేయని ప్రాంతంలాగా మారిపోయాయి.
44కాబట్టి బబులోనులో ఉన్న బేలు దేవుణ్ణి శిక్షిస్తాను. వాడు మింగినదంతా వాడితో కక్కిస్తాను. ఇకపైన ప్రజలు గుంపులుగా వాడికి అర్పణలు చెల్లించడానికి రారు. బబులోను గోడలు కూలిపోతాయి.
45నా ప్రజలారా! మీరు దానిలో నుండి బయటకు వెళ్ళండి. మీలో ప్రతి ఒక్కడూ నా క్రోధం నుండి తన ప్రాణాన్ని రక్షించుకోవాలి.
46దేశంలో వినిపించే వార్తలకు మీ హృదయాలను భయపడనివ్వకండి. ఈ వార్తలు ఈ సంవత్సరం వినిపిస్తాయి. ఇది అయ్యాక తర్వాత సంవత్సరం మళ్ళీ వార్తలు వినిపిస్తాయి. దేశంలో హింస జరుగుతుంది. ఒక రాజ్యాధిపతికి విరోధంగా మరో రాజ్యాధిపతి ఉంటాడు.
47కాబట్టి చూడండి, బబులోను లోని చెక్కిన విగ్రహాలను నేను శిక్షించే రోజులు రాబోతున్నాయి. ఆమె దేశం అంతా సిగ్గుపాలు అవుతుంది. వధకు గురైన ఆమె ప్రజలు దేశంలోనే పడిపోతారు.
48వినాశకులు ఉత్తరం వైపు నుండి ఆమె కోసం వస్తున్నారు” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. అప్పుడు ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్నదంతా బబులోనుకు పట్టిన దుర్గతి చూసి సంతోషిస్తుంది.
49ఇశ్రాయేలులో వధకు గురైన వాళ్ళను బబులోను కూల్చినట్టుగానే బబులోనులో వధకు గురైన వాళ్ళు అక్కడే కూలిపోతారు.
50కత్తిని తప్పించుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళి పొండి. అక్కడే ఉండకండి. దూరం నుండి మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేమును మీ జ్ఞాపకాల్లోకి రానివ్వండి.
51మమ్మల్ని అవమానపరిచే మాటలు విన్నాం. దానికి సిగ్గు పడుతున్నాం. మాపై పడ్డ నింద మా ముఖాలను కప్పి వేసింది. ఎందుకంటే యెహోవా పేరును కలిగి ఉన్న పరిశుద్ధ స్థలాల్లోకి విదేశీయులు ప్రవేశించారు.
52కాబట్టి, వినండి, ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “నేను ఆమె వద్ద ఉన్న చెక్కిన విగ్రహాలను శిక్షించే రోజులు రాబోతున్నాయి. ఆమె దేశమంతా గాయపడిన వాళ్ళు మూలుగుతూ ఉంటారు.
53బబులోను తన ఎత్తయిన కోటలను ఎంత బలోపేతం చేసినా, వాళ్ళ కోటలు ఆకాశంలోకి కట్టుకున్నా వినాశకులు నానుండి ఆమె దగ్గరికి వస్తారు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
54“బబులోనులో నుండి ఏడుపు వినిపిస్తుంది. కల్దీయుల దేశం కూలిపోతున్న మహా నాశన ధ్వని వినిపిస్తుంది.
55యెహోవా బబులోనును నాశనం చేస్తున్నాడు. దాని మహా ఘోషను అణచివేస్తున్నాడు. వాళ్ళ శత్రువులు అనేక ప్రవాహ జలాల్లా గర్జిస్తున్నారు. వాళ్ళు చేసే శబ్దం బలంగా వినిపిస్తున్నది.
56ఆమెకు వ్యతిరేకంగా, బబులోనుకు వ్యతిరేకంగా వినాశకులు వచ్చేశారు. ఆమె యోధులను పట్టుకున్నారు. వాళ్ళ ధనుస్సులను విరగ్గొట్టేశారు. యెహోవా ప్రతీకారం చేసే దేవుడు. ఆయన తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు.
57బబులోను అధిపతులూ, ఆమె జ్ఞానులూ, ఆమె అధికారులూ, ఆమె సైనికులూ మద్యం తాగి మత్తెక్కేలా చేస్తాను. వాళ్ళు శాశ్వత నిద్రలోకి జారుకుంటారు. ఇక లేవరు.” ఇది రాజు చేస్తున్న ప్రకటన. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా.
58సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “బబులోను భారీ ప్రాకారాలను సంపూర్ణంగా కూల్చి వేస్తారు. దాని ఎత్తయిన ద్వారాలను అగ్నితో కాల్చివేస్తారు. ఆమెకు సహాయం చేయడానికి వచ్చే వాళ్ళ ప్రయాస వృథాయే. ఆమె కోసం జనాలు చేసే ప్రయత్నాలన్నీ అగ్నికి ఆహుతి అవుతాయి.”
59ఇది మహసేయా మనవడూ, నేరీయా కొడుకూ అయిన సెరాయాకు యిర్మీయా ప్రవక్త ఆజ్ఞాపించిన వాక్కు. ఈ శెరాయా రాజు దగ్గర ప్రధాన అధికారి గనక సిద్కియా పరిపాలన నాలుగో సంత్సరంలో, రాజైన సిద్కియాతో కలిసి సెరాయా యూదా దేశం నుండి బబులోనుకు వెళ్ళినప్పుడు,
60బబులోను పైకి రాబోతున్న విపత్తులన్నిటి గూర్చీ యిర్మీయా ఒక పుస్తకంలో రాశాడు. ఈ మాటలన్నీ బబులోను గూర్చి రాశాడు.
61యిర్మీయా శెరాయాతో ఇలా చెప్పాడు. “నువ్వు బబులోనుకు వెళ్ళినప్పుడు ఈ మాటలన్నీ తప్పనిసరిగా చదివి వినిపించు.