Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యిర్మీయా

యిర్మీయా 13

Help us?
Click on verse(s) to share them!
1యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నువ్వు వెళ్లి అవిసెనార నడికట్టు కొనుక్కుని నీటితో తడపకుండానే నీ నడుముకు కట్టుకో.”
2కాబట్టి యెహోవా మాట ప్రకారం నేను నడికట్టు ఒకటి కొనుక్కుని నడుముకు కట్టుకున్నాను.
3యెహోవా వాక్కు నాకు రెండోసారి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
4“నువ్వు కొని నడుముకు కట్టుకున్న నడికట్టును తీసి, యూఫ్రటీసు నది దగ్గరికి పోయి అక్కడ ఉన్న బండ సందులో దాన్ని దాచిపెట్టు.”
5యెహోవా ఆజ్ఞాపించినట్టే నేను వెళ్ళి యూఫ్రటీసు దగ్గర దాన్ని దాచిపెట్టాను.
6చాలా రోజుల తరవాత యెహోవా “నువ్వు యూఫ్రటీసు దగ్గరికి వెళ్ళి, అక్కడ దాచిపెట్టిన నడికట్టు తీసుకో” అని నాతో చెప్పాడు.
7నేను యూఫ్రటీసు దగ్గరికి పోయి తవ్వి దాచిపెట్టిన నడికట్టును తీసుకున్నాను. అయితే ఆ నడికట్టు చెడిపోయి ఉంది. అది దేనికీ పనికిరాకుండా ఉంది.
8అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
9“యెహోవా చెప్పేదేమంటే, ఇదే విధంగా యూదా ప్రజల గర్వాన్ని, యెరూషలేము ప్రజల మహా గర్వాన్ని నేను అణచివేస్తాను.
10ఈ ప్రజలు అన్య దేవుళ్ళను పూజిస్తూ, వాటికే నమస్కారం చేస్తున్నారు. వాటినే అనుసరిస్తూ, నా మాటలు వినకుండా తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుస్తున్నారు. వారు ఎందుకూ పనికిరాని ఈ నడికట్టులాగా అవుతారు.
11వారిని నా ప్రజలుగా చేసుకుని వారి ద్వారా నాకు కీర్తి ప్రతిష్టలు, మహిమ కలగాలని నేను ఆశించాను. ఒకడు నడికట్టు కట్టుకున్నట్టుగా నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలందరినీ నా నడుము చుట్టూ కట్టుకున్నాను గానీ, వారు నా మాటలు వినలేదు.”
12కాబట్టి నువ్వు వారితో ఇలా చెప్పు. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ప్రతి ద్రాక్ష తిత్తీ రసంతో నిండి ఉండాలి.” “ద్రాక్ష తిత్తులు రసంతో నిండి ఉండాలి అని మాకు తెలియదా” అని వారు నీతో అంటే, వారితో ఈ మాటలు చెప్పు.
13“యెహోవా చెప్పేదేమంటే, ఈ దేశ ప్రజలందరినీ, అంటే, దావీదు సింహాసనం మీద కూర్చునే రాజులను, యాజకులను, ప్రవక్తలను, యెరూషలేము ప్రజలను, అందరినీ నేను మత్తులో మునిగేలా చేయబోతున్నాను.
14అప్పుడు నేను తండ్రులూ కొడుకులూ అందరూ కూలిపోయి ఒకడి మీద ఒకడు పడేలా చేస్తాను. వారి మీద జాలీ, కనికరమూ చూపకుండా వారిని నాశనం చేస్తాను.”
15జాగ్రత్తగా వినండి. యెహోవా మాట్లాడుతున్నాడు, అహంకారం వద్దు.
16మీ దేవుడైన యెహోవా చీకటి కమ్మజేయక ముందే, చీకటిలో మీ కాళ్లు కొండలపై తొట్రుపడక ముందే, ఆయనను ఘనపరచి కొనియాడండి. ఎందుకంటే మీరు వెలుగు కోసం చూస్తుండగా ఆయన దాన్ని గాఢాంధకారంగా మారుస్తాడు.
17ఇప్పుడు మీరు ఆ మాట వినకపోతే మీ గర్వం విషయంలో నేను రహస్యంగా విలపిస్తాను. యెహోవా మందను చెరగా పట్టుకున్నందుకు నేను కన్నీరు మున్నీరుగా విలపిస్తాను.
18రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు. “మిమ్మల్ని మీరు తగ్గించుకుని, నేల మీద కూర్చోండి. మీ తలపై కిరీటాలు, మీ అహంకారం, మీ మహిమ అన్నీ పడిపోయాయి.”

19దక్షిణదేశ పట్టణాలు మూతబడి ఉన్నాయి. వాటిని తెరిచేవాడు ఉండడు. యూదా ప్రజలంతా చెరలోకి వెళ్ళిపోయారు.
20మీ కళ్ళెత్తి ఉత్తరం నుండి వస్తున్న వారిని చూడండి. నీకిచ్చిన సుందరమైన మంద ఎక్కడ ఉంది?
21వారిని నీకై నువ్వు స్నేహితులుగా చేసికొన్నావు. ఇప్పుడు వారినే ఆయన నీ మీద అధిపతులుగా నియమిస్తే నీవేం చేస్తావు? ప్రసవించే స్త్రీ పడే వేదన నీకు కలుగుతుంది కదా?
22“ఇవన్నీ నాకెందుకు జరుగుతున్నాయి?” అని నీ మనస్సులో అనుకోవచ్చు. నువ్వు చేసిన విస్తారమైన దోషాలే దానికి కారణం. అందుకే నీ వస్త్రాలు తీసివేయడం, నీపై అత్యాచారం చేయడం జరుగుతుంది.
23కూషు దేశ ప్రజలు తమ చర్మపు రంగు మాపుకోగలరా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? అదే గనుక సాధ్యమైతే చెడు చేయడానికి అలవాటు పడిన మీకు మంచి చేయడం సాధ్యమౌతుంది.
24కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగిరిపోయినట్టు నేను వారిని చెదరగొడతాను.
25మీరు నన్ను మరచిపోయి మోసాన్ని నమ్ముకున్నారు కాబట్టి అదే మీ వంతుగా నేను కొలిచి ఇచ్చాను, అని యెహోవా చెబుతున్నాడు.
26కాబట్టి మీకు సిగ్గు కలిగేలా నేను మీ బట్టల అంచులను లేపి మీ ముఖం మీద పడేలా చేస్తాను.
27నీ వ్యభిచారం, కామంతో కూడిన నీ సకిలింపులు నీ జార కార్యాలు నాకు తెలుసు. పొలాల్లోని ఉన్నత స్థలాల్లో నీవు చేసిన అసహ్యమైన కార్యాలు నాకు కనబడుతున్నాయి. యెరూషలేమా, నీకు శ్రమ. నిన్ను నువ్వు పవిత్ర పరచుకోవడం లేదు. ఇలా ఎంత కాలం కొనసాగుతుంది?