Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యోహాను

యోహాను 10

Help us?
Click on verse(s) to share them!
1మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే.
2ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి.
3అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు.
4తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి.
5వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా పారిపోతాయి.
6యేసు ఈ ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్థం కాలేదు.
7అందుకు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే.
8నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వారి మాట వినలేదు.
9నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు.
10దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.
11నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు.
12జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది.
13జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెలను పట్టించుకోకుండా పారిపోతాడు.
14నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు.
15నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను.
16ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి.
17నా ప్రాణం మళ్ళీ పొందడానికి దాన్ని పెడుతున్నాను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు.
18నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. నేను స్వయంగా నా ప్రాణం పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను.”

19ఈ మాటలవల్ల యూదుల్లో మళ్ళీ విభేదాలు వచ్చాయి.
20వారిలో చాలా మంది, “ఇతనికి దయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు మీరు ఎందుకు వింటున్నారు?” అన్నారు.
21ఇంకొంతమంది, “ఇవి దయ్యం పట్టినవాడి మాటలు కాదు. దయ్యం గుడ్డివారి కళ్ళు తెరవగలదా?” అన్నారు.
22ఆ తరువాత యెరూషలేములో ప్రతిష్ట పండగ వచ్చింది. అది చలికాలం.
23అప్పుడు యేసు దేవాలయ ప్రాంగణంలో ఉన్న సొలొమోను మంటపంలో నడుస్తూ ఉండగా
24యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో. “ఎంతకాలం మమ్మల్ని ఇలా సందేహంలో ఉంచుతావు? నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు” అన్నారు.
25అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “నేను మీకు చెప్పాను గాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
26అయినా, మీరు నా గొర్రెలు కానందువల్ల మీరు నమ్మడం లేదు.
27నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి.
28నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను కాబట్టి అవి ఎప్పటికీ నశించిపోవు. వాటిని ఎవరూ నా చేతిలోనుంచి లాగేసుకోలేరు.
29వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు కాబట్టి నా తండ్రి చేతిలోనుంచి ఎవరూ వాటిని లాగేసుకోలేరు.
30నేను, నా తండ్రి, ఒకటే!”
31అప్పుడు యూదులు ఆయనను కొట్టడానికి రాళ్ళు పట్టుకున్నారు.
32యేసు వారితో, “తండ్రి నుంచి ఎన్నో మంచి పనులు మీకు చూపించాను. వాటిలో ఏ మంచి పనినిబట్టి నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారు?” అన్నాడు.
33అందుకు యూదులు, “నువ్వు మనిషివై ఉండి నిన్ను నీవు దేవుడుగా చేసుకుంటున్నావు. దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నాం. మంచి పనులు చేసినందుకు కాదు” అని ఆయనతో అన్నారు.
34యేసు వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు, “‘మీరు దేవుళ్ళని నేనన్నాను’ అని మీ ధర్మశాస్త్రంలో రాసి లేదా?
35లేఖనం వ్యర్థం కాదు. దేవుని వాక్కు ఎవరికి వచ్చిందో, వారిని ఆయన దేవుళ్ళని పిలిస్తే,
36తండ్రి పవిత్రంగా ఈ లోకంలోకి పంపినవాడు ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అంటే ‘నువ్వు దేవదూషణ చేస్తున్నావు’ అని మీరు అంటారా?

37నేను నా తండ్రి పనులు చెయ్యకపోతే నన్ను నమ్మకండి.
38అయితే, నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలుసుకుని అర్థం చేసుకునేందుకు ఆ పనులను నమ్మండి.”
39వారు మళ్ళీ ఆయనను పట్టుకోవాలనుకున్నారు గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకున్నాడు.
40యేసు మళ్ళీ యొర్దాను నది అవతలికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. యోహాను మొదట బాప్తిసం ఇస్తూ ఉన్న స్థలం ఇదే.
41చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. వారు, “యోహాను ఏ సూచక క్రియలూ చేయలేదు గాని ఈయన గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ నిజమే” అన్నారు.
42అక్కడ చాలా మంది యేసుని నమ్మారు.