1ఇది అయిన తరువాత యూదుల పండగ ఒకటి వచ్చింది. యేసు దానికోసం యెరూషలేముకు వెళ్ళాడు.
2యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి ఐదు మంటపాలున్నాయి.
3(కొన్ని సమయాల్లో ప్రభువు దూత నీటిలోకి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉండేవాడు. అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది). రకరకాల రోగాలున్నవారూ, గుడ్డివారూ, కుంటివారూ చచ్చుబడిన కాళ్ళూ చేతులున్నవారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు.
5అక్కడ ముప్ఫై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అంగ వైకల్యంతో పడి ఉన్నాడు.
6యేసు అతనిని చూసి అతడు అక్కడ చాలా కాలం నుండి పడి ఉన్నాడని గ్రహించాడు. అతనిని చూసి, “బాగవ్వాలని కోరిక ఉందా?” అని అడిగాడు.
7అప్పుడు ఆ రోగి, “అయ్యా, దేవదూత నీటిని కదిలించినప్పుడు నన్ను కోనేటిలో దించడానికి ఎవరూ లేరు. నేను సర్దుకుని దిగేంతలో నాకంటే ముందు మరొకడు దిగుతాడు” అని జవాబిచ్చాడు.
8యేసు, “నువ్వు లేచి నీ చాప తీసుకుని నడిచి వెళ్ళు” అని అతనితో చెప్పాడు.
9వెంటనే ఆ వ్యక్తి బాగుపడి తన పడక తీసుకుని నడవడం మొదలు పెట్టాడు. ఆ రోజు విశ్రాంతి దినం.
10అందుకని యూదా మత నాయకులు ఆ వ్యక్తితో, “ఈ రోజు విశ్రాంతి దినం. నువ్వు పరుపును మోయకూడదు కదా!” అన్నారు.
11అందుకు ఆ వ్యక్తి, “నన్ను బాగుచేసిన వాడు ‘నీ చాప ఎత్తుకుని నడువు’ అని నాకు చెప్పాడు” అన్నాడు.
12అప్పుడు వారు, “నీకసలు నీ పరుపెత్తుకుని నడవమని చెప్పిందెవరు?” అని అతణ్ణి అడిగారు.
13అయితే తనని బాగు చేసినదెవరో అతనికి తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రజలంతా గుంపు కూడి ఉండడం వలన యేసు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
14ఆ తరువాత యేసు దేవాలయంలో అతణ్ణి చూశాడు. “చూడు, నీవు స్వస్థత పొందావు. ఇప్పుడు పాపం చేస్తే నీకు ఎక్కువ కీడు కలుగుతుంది. అందుకని ఇక పాపం చేయవద్దు.” అని అతడితో చెప్పాడు.
15వాడు యూదా నాయకుల దగ్గరికి వెళ్ళి తనను బాగు చేసింది యేసు అని చెప్పేశాడు.
16ఈ పనులను యేసు విశ్రాంతి దినాన చేశాడు కాబట్టి యూదులు ఆయనను బాధించారు.
17యేసు వారితో, “నా తండ్రి ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. నేను కూడా చేస్తున్నాను” అన్నాడు.
18ఆయన విశ్రాంతి దినాచారాన్ని భంగం చేయడం మాత్రమే కాక దేవుణ్ణి తండ్రి అని సంబోధించి తనను దేవునికి సమానుడిగా చేసుకున్నందుకు వారు ఆయనను చంపాలని మరింత గట్టి ప్రయత్నం చేశారు.
19కాబట్టి యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. కుమారుడు తనంతట తానుగా ఏదీ చేయడు. తండ్రి దేనిని చేయడం చూస్తాడో దానినే కుమారుడు కూడా చేస్తాడు. ఎందుకంటే తండ్రి ఏది చేస్తాడో అదే కుమారుడు కూడా చేస్తాడు.
20తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడు కాబట్టి తాను చేసే పనులన్నిటినీ కుమారుడికి చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు. ఆయన మీకందరికీ విభ్రాంతి కలిగేలా ఇంతకంటే గొప్ప సంగతులను కుమారుడికి చూపిస్తాడు.
21“తండ్రి చనిపోయిన వారిని లేపి ఎలా ప్రాణం ఇస్తాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టం అయిన వారిని బతికిస్తాడు.
22తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు కానీ అందరికీ తీర్పు తీర్చే సమస్త అధికారాన్ని ఆయన కుమారుడికి ఇచ్చాడు.
23దీని వల్ల తండ్రిని గౌరవించే అందరూ అదే విధంగా కుమారుణ్ణి కూడా గౌరవించాలి. కుమారుణ్ణి గౌరవించని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవించడు.
24కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు.
25మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బతుకుతారు.
26తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు.
27అలాగే ఆయన కుమారుడికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఈ అధికారం ఇచ్చాడు.
28“దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది.
29అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వారు జీవపు పునరుత్థానానికీ చెడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికీ బయటకు వస్తారు.
30“నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను విన్న దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది.
31నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యం కాదు.
32నా గురించి సాక్షమిచ్చేవాడు మరొకడున్నాడు. నా గురించి ఆయన ఇచ్చే సాక్ష్యం సత్యమని నాకు తెలుసు.
33“మీరు యోహాను దగ్గరికి కొందరిని పంపారు. అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు.
34కానీ నేను పొందిన సాక్ష్యం మనుషులు ఇచ్చినది కాదు. మీ రక్షణ కోసం ఈ మాటలు చెబుతున్నాను.
35యోహాను మండుతూ ప్రకాశించే దీపంలా ఉండే వాడు. మీరు అతని వెలుగులో కొంతకాలం సంతోషించడానికి ఇష్టపడ్డారు.
36అయితే యోహాను నా గురించి చెప్పిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకుంది. నేను చేయడానికి నా తండ్రి నాకిచ్చిన పనులే ఆ సాక్ష్యం. ప్రస్తుతం నేను చేస్తున్న ఈ కార్యాలే తండ్రి నన్ను పంపాడని నా గురించి సాక్ష్యం చెబుతున్నాయి.
37నన్ను పంపిన తండ్రి తానే నాగురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన స్వరాన్ని మీరు ఏనాడూ వినలేదు. ఆయన స్వరూపాన్నీ ఏనాడూ చూడలేదు.
38ఆయన పంపించిన వ్యక్తిని మీరు నమ్మలేదు కాబట్టి ఆయన వాక్కు మీలో నిలిచి లేదు.
39లేఖనాల్లో మీకు నిత్య జీవం ఉందనుకుని మీరు వాటిని పరిశోధిస్తున్నారు. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
40అయితే మీకు జీవం కలిగేలా నా దగ్గరికి రావడానికి మీరు ఇష్టపడడం లేదు.
41మనుషులు ఇచ్చే గౌరవాన్ని నేను స్వీకరించను.
42ఎందుకంటే దేవుని ప్రేమ మీలో లేదని నాకు తెలుసు.
43“నేను నా తండ్రి పేరిట వచ్చాను. మీరు నన్ను అంగీకరించలేదు. మరొకడు తన స్వంత పేరు ప్రతిష్టలతో మీ దగ్గరికి వస్తే మీరు వాణ్ణి అంగీకరిస్తారు.
44ఇతరుల నుండి కలిగే మెప్పును అంగీకరిస్తూ ఏకైక దేవుని నుండి కలిగే మెప్పును వెదకని మీరు ఎలా విశ్వసిస్తారు?
45నేను తండ్రి ముందు మీమీద నేరం మోపుతానని అనుకోవద్దు. మీ మీద నేరం మోపడానికి మరో వ్యక్తీ ఉన్నాడు. మీరు మీ ఆశలన్నీ పెట్టుకున్న మోషేయే మీ మీద నేరం మోపుతాడు.
46మీరు మోషేను నమ్మినట్టయితే నన్ను కూడా నమ్ముతారు. ఎందుకంటే మోషే నా గురించే రాశాడు.
47మీరు అతడు రాసిందే నమ్మకపోతే ఇక నా మాటలు ఎలా నమ్ముతారు?”