Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - లూకా - లూకా 8

లూకా 8:3-18

Help us?
Click on verse(s) to share them!
3హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా అనే అతని భార్య యోహన్నా, సూసన్నా ఇంకా అనేకమంది ఇతర స్త్రీలూ ఆయనతో కూడా ఉన్నారు. వారంతా తమ స్వంత ధనం, సామగ్రిని వెచ్చించి ఆయనకు, ఆయన శిష్యులకు సహాయం చేసేవారు.
4ఒకసారి ప్రతి పట్టణం నుండీ ప్రజలు పెద్ద గుంపులుగా యేసు దగ్గరికి వస్తున్నారు. అప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు.
5“విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. అతడు చల్లుతూ ఉండగా కొన్ని విత్తనాలు దారి పక్కన పడి మనుషుల కాళ్ళ కింద నలిగిపోయాయి. కాబట్టి గాలిలో ఎగిరే పక్షులు వాటిని మింగివేశాయి.
6మరి కొన్ని రాతి నేల మీద పడ్డాయి. అవి మొలిచాయి కానీ లోపల తడి లేకపోవడంతో ఎండిపోయాయి.
7మరి కొన్ని ముళ్ళపొదల మధ్యలో పడ్డాయి. ముళ్ళపొదలు వాటితో కూడా మొలిచి వాటిని అణచి వేశాయి.
8మరి కొన్ని మంచి నేలపై పడ్డాయి. అవి మొలిచి నూరు రెట్లుగా ఫలించాయి.” ఆయన ఇలా చెప్పి, “వినడానికి చెవులున్నవాడు విను గాక” అని బిగ్గరగా అన్నాడు.
9ఆయన శిష్యులు, “ఈ ఉపమానం అర్థం ఏమిటి?” అని అడిగారు
10ఆయన, “దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే ఆధిక్యత మీరు పొందారు. ఇతరులైతే చూస్తూ ఉన్నా నిజంగా చూడకుండా, వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉంటారు గనక వారికి ఉపమానాల్లోనే బోధిస్తున్నాను.
11ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం.
12దారి పక్కన పడిన విత్తనాలు ఎవరంటే వీరు వాక్కును వింటారు గానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని తీసివేస్తాడు.
13రాతి నేలపై పడిన విత్తనాలు ఎవరంటే వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే వారు. కానీ వారిలో వేరు లేదు కాబట్టి కొంతకాలం నమ్మి తరువాత విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు.
14ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు.
15మంచి నేలపై పడే విత్తనాలు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్కును విని, భద్రంగా చేపట్టి ఓపికతో ఫలించేవారు.
16“ఎవరూ దీపాన్ని వెలిగించి బుట్టతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు. ఇంట్లోకి వచ్చే వారికి వెలుగు కనిపించేలా దీపస్తంభంపై ఉంచుతాడు.
17తేటతెల్లం కాని రహస్యమేదీ లేదు. తెలియకుండా, బయట పడకుండా, దాగి ఉండిపోయేది ఏదీ లేదు.
18కలిగిన వ్యక్తికే ఇస్తారు, లేని వ్యక్తి నుండి తనకు ఉంది అనుకున్నది కూడా తీసివేస్తారు. కాబట్టి మీరు ఎలా వింటున్నారో చూసుకోండి” అన్నాడు.

Read లూకా 8లూకా 8
Compare లూకా 8:3-18లూకా 8:3-18