Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - రూతు

రూతు 1

Help us?
Click on verse(s) to share them!
1న్యాయాధిపతులు పరిపాలించిన కాలంలో దేశంలో కరువు వచ్చింది. అప్పుడు యూదా దేశంలోని బేత్లెహేము నుండి ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు కొడుకులను తనతో తీసుకుని మోయాబు దేశానికి వలస వెళ్ళాడు.
2అతని పేరు ఎలీమెలెకు, అతని భార్య నయోమి. అతనికి మహ్లోను, కిల్యోను అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళు యూదా దేశపు బేత్లెహేములో నివసించే ఎఫ్రాతా ప్రాంతం వారు. వాళ్ళు మోయాబు దేశానికి వెళ్లి అక్కడ నివసించారు.
3నయోమి తన భర్త ఎలీమెలెకు చనిపోయిన తరువాత తన ఇద్దరు కొడుకులతో అక్కడే ఉండిపోయింది.
4వాళ్ళిద్దరూ మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. ఒకామె పేరు ఓర్పా, రెండవ ఆమె పేరు రూతు.
5సుమారు పదేళ్లు గడచిన తరువాత మహ్లోను, కిల్యోను కూడా చనిపోయారు. నయోమి భర్త, కొడుకులను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలింది.
6బేత్లెహేములో యెహోవా తన ప్రజలపై దయ చూపించి వారికి ఆహారం ఇస్తున్నాడని మోయాబు దేశంలో ఉన్న ఆమె విన్నది. కాబట్టి ఆమె మోయాబు దేశాన్ని విడిచి తన స్వదేశం వెళ్ళిపోవాలని తన కోడళ్ళతో సహా ప్రయాణం కట్టింది.
7ఆ దేశం నుండి ఆమె తన ఇద్దరు కోడళ్ళతో సహా కాలి నడకన యూదా దేశానికి బయలు దేరింది.
8అప్పుడు ఆమె తన ఇద్దరు కోడళ్ళతో ఇలా అంది. “మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్ళండి. చనిపోయిన నా కొడుకుల విషయంలో, నా విషయంలో మీరు నమ్మకంగా ఉన్నట్టే యెహోవా మీ పట్ల నమ్మకంగా ఉండి దయ చూపిస్తాడు గాక.
9మీరిద్దరూ చక్కగా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని మీ భర్తల ఇళ్ళల్లో సుఖంగా జీవించే స్థితి ప్రభువు దయచేస్తాడు గాక” అని చెప్పి ఆమె తన కోడళ్ళను ముద్దు పెట్టుకుంది.
10అప్పుడు వాళ్ళు గట్టిగా ఏడ్చి “మేము నీతో కూడా నీ ప్రజల దగ్గరకే వస్తాం” అన్నారు.
11అప్పుడు నయోమి “నా బిడ్డలారా, మీరు వెనక్కి మళ్ళండి. మిమ్మల్ని పెళ్ళి చేసుకోడానికి ఇప్పుడు నా కడుపున కొడుకులు పుట్టరు గదా.
12అమ్మాయిలూ, తిరిగి వెళ్ళండి. నేను ముసలిదాన్ని. మగ వాడితో ఇప్పుడు కాపురం చెయ్యలేను. ఒక వేళ నేను నమ్మకంతో ఈ రాత్రి నేను ఒక మగ వాడితో గడిపి కొడుకులను కనినప్పటికీ
13వాళ్ళు పెద్దవాళ్లయ్యే వరకూ మీరు వేచి ఉంటారా? పెళ్లి చేసుకోకుండా వాళ్ళకోసం ఎదురు చూస్తూ ఉంటారా? నా బిడ్డలారా, అలా వద్దు. అలాంటి పరిస్థితి మీకంటే నాకే ఎక్కువ వేదన కలిగిస్తుంది, ఎందుకంటే యెహోవా నాకు విరోధి అయ్యాడు” అని వాళ్ళతో అంది.
14వాళ్ళు మళ్ళీ గట్టిగా ఏడ్చారు. అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుంది, రూతు ఆమెను అంటి పెట్టుకునే ఉంది.
15అప్పుడు నయోమి “చూడు, నీ తోడికోడలు తిరిగి తన ప్రజల దగ్గరికీ తన దేవుళ్ళ దగ్గరికీ వెళ్ళిపోయింది. నువ్వు కూడా నీ తోడికోడలి వెంటే వెళ్ళు” అని రూతుతో చెప్పింది.
16అందుకు రూతు “నీతో రావద్దనీ, నిన్ను విడిచిపొమ్మనీ నాకు చెప్పొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేనూ అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో నేనూ అక్కడే ఉంటాను. ఇకనుండి నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే నా దేవుడు.
17నువ్వు ఎక్కడ చనిపోతావో నేనూ అక్కడే చనిపోతాను. అక్కడే నా సమాధి కూడా ఉంటుంది. చావు తప్ప ఇంకేదీ నన్ను నీ నుండి దూరం చేస్తే యెహోవా నన్ను శిక్షిస్తాడు గాక” అంది.
18తనతో రావడానికే ఆమె నిశ్చయించుకున్నదని నయోమి గ్రహించినప్పుడు ఇక ఆమెతో ఆ విషయం మాట్లాడటం మానుకుంది.

19కాబట్టి వాళ్ళిద్దరూ బేత్లెహేముకు ప్రయాణం సాగించారు. వాళ్ళు బేత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరు ఊరంతా ఎంతో ఆసక్తిగా గుమిగూడారు. ఊరి స్త్రీలు “ఈమె నయోమి కదా” అని చెప్పుకున్నారు.
20అప్పుడు నయోమి “నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి. అమిత శక్తిశాలి నాకు చాలా వేదన కలిగించాడు.
21నేను బాగా ఉన్న స్థితిలో ఇక్కడినుండి వెళ్ళాను. యెహోవా నన్ను ఖాళీ చేతులతో తిరిగి తీసుకువచ్చాడు. యెహోవా నాకు వ్యతిరేక సాక్షిగా నిలిచాడు. సర్వ శక్తిశాలి నన్ను బాధ పెట్టాడు. ఇదంతా చూసి కూడా నన్ను నయోమి అని పిలుస్తారెందుకు?” అని వారితో అంది.
22ఆ విధంగా నయోమి, మోయాబీయురాలైన ఆమె కోడలు రూతు తిరిగి వచ్చారు. వారిద్దరూ బార్లీ పంట కోసే కాలం ఆరంభంలో బేత్లెహేము చేరుకున్నారు.