Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యోబు

యోబు 34

Help us?
Click on verse(s) to share them!
1అప్పుడు ఎలీహు మళ్ళీ ఇలా చెప్పసాగాడు.
2జ్ఞానులారా, నా మాటలు వినండి. అనుభవశాలులారా, వినండి.
3అంగిలి ఆహారాన్ని రుచి చూసినట్టు చెవి మాటలను పరీక్షిస్తుంది.
4న్యాయమైనదేదో విచారించి చూద్దాం రండి. మేలైనదేదో మనంతట మనం విచారించి తెలుసుకుందాము రండి.
5“నేను నీతిమంతుణ్ణి, దేవుడు నాకు అన్యాయం చేసాడు.
6నేను న్యాయవంతుడినైనా అబద్ధికునిగా చూస్తున్నారు. నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మానని గాయం కలిగింది” అని యోబు అంటున్నాడు.
7యోబులాంటి మానవుడెవరు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారాన్ని పానం చేస్తున్నాడు.
8అతడు చెడుతనం చేసే వారికి మిత్రుడయ్యాడు. భక్తిహీనుల చెలికాడు అయ్యాడు.
9మనుషులు దేవునితో సహవాసం చేయడం వారికేమాత్రం ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకుంటున్నాడు.
10విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించండి దేవుడు అన్యాయం చేయడం అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవం.
11మనుషుల క్రియలకు తగినట్టుగా ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడు అందరికీ ఎవరి మార్గాలను బట్టి వారికి ఫలమిస్తాడు.
12దేవుడు ఏ మాత్రం దుష్కార్యం చేయడు. సర్వశక్తుడు న్యాయం తప్పడు.
13ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టాడా? ఎవడైనా సర్వప్రపంచ భారాన్ని ఆయనకు అప్పగించాడా?
14ఆయన తన మనస్సు తన దగ్గరే ఉంచుకున్నట్టయితే, తన ఆత్మను, ఊపిరినీ తన దగ్గరికి తిరిగి తీసుకుంటే,
15శరీరులంతా ఒక్కపెట్టున నశిస్తారు. మనుషులు మళ్ళీ ధూళిగా మారిపోతారు.
16కాబట్టి దీన్ని విని వివేచించు, నా మాటలు ఆలకించు.
17న్యాయాన్ని ద్వేషించేవాడు లోకాన్ని ఏలుతాడా? న్యాయసంపన్నునిపై నేరం మోపుతావా?
18నువ్వు పనికిమాలిన వాడివని రాజుతోనైనా, మీరు దుష్టులని ప్రధానులతోనైనా అనవచ్చా?

19రాజుల పట్ల పక్షపాతం చూపని వాడితో పేదలకన్నా ధనికులను ఎక్కువగా చూడని వాడితో అలా పలకవచ్చా? వారందరూ ఆయన నిర్మించినవారు కారా?
20వారు నిమిషంలో చనిపోతారు. అర్థరాత్రి వేళ ప్రజలు కల్లోలం పాలై నాశనమౌతారు. బలవంతులను తీసుకు పోవడం జరుగుతుంది, అయితే అది మానవ హస్తాల వలన కాదు.
21ఆయన దృష్టి మనుషుల మార్గాల మీద ఉంది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు.
22చెడు కార్యాలు చేసే వారు దాక్కోడానికి చీకటైనా మరణాంధకారమైనా లేదు.
23ఒక మనిషిని న్యాయవిమర్శలోకి తీసుకు రాక ముందు అతణ్ణి ఎక్కువ కాలం విచారణ చేయడం దేవుడికి అవసరం లేదు.
24విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలం చేస్తున్నాడు. వారి స్థానంలో ఇతరులను నియమిస్తున్నాడు.
25వారి క్రియలను ఆయన తెలుసుకుంటున్నాడు. రాత్రివేళ ఇలాటి వారిని ఆయన కూలదోస్తాడు. వారు నాశనమై పోతారు.
26అందరూ చూస్తుండగానే దుష్టులను వారి దుర్మార్గాన్ని బట్టి నేరస్తులను శిక్షించినట్టు ఆయన శిక్షిస్తాడు.
27ఎందుకంటే వారు ఆయనను అనుసరించడం మానుకున్నారు. ఆయన ఆజ్ఞల్లో దేన్నీ లక్ష్య పెట్టలేదు.
28పేదల మొరను ఆయన దగ్గరికి వచ్చేలా చేశారు. దీనుల మొర ఆయనకు వినబడేలా చేశారు.
29ఆయన మౌనంగా ఉండిపోతే తీర్పు తీర్చగలవాడెవడు? ఆయన తన ముఖాన్ని దాచుకుంటే ఆయనను చూడగలవాడెవడు? ఆయన జాతులనైనా వ్యక్తులనైనా ఒకే విధంగా పరిపాలిస్తాడు.
30భక్తిహీనులు రాజ్యపాలన చేయకుండా, వారు ప్రజలను ఇకపై చిక్కించుకోకుండా ఆయన చేస్తాడు.
31ఒకడు “నేను దోషినే, కానీ ఇకపై పాపం చేయను.
32నాకు తెలియని దాన్ని నాకు నేర్పించు. నేను పాపం చేశాను. ఇకపై చేయను” అని దేవునితో చెప్పాడనుకో,
33దేవుడు చేస్తున్నది నీకు నచ్చడం లేదు గనక అలాటి మనిషిని దేవుడు శిక్షిస్తాడు అనుకుంటున్నావా? నేను కాదు, నువ్వే నిశ్చయించుకోవాలి. కాబట్టి నీకు తెలిసినది చెప్పు.
34వివేచన గలవారు, జ్ఞానంతో నా మాట వినేవారు నాతో ఇలా అంటారు.
35యోబు తెలివితక్కువ మాటలు పలుకుతున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి.
36యోబు దుష్టులవలె మాట్లాడుతున్నాడు గనక అతనిపై సునిశితమైన విచారణ జరిగితే ఎంత బాగుంటుంది!

37అతడు తన పాపానికి తోడుగా ద్రోహం సమకూర్చుకుంటున్నాడు. మన ఎదుట ఎగతాళిగా చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు కుప్పగా పోస్తున్నాడు.