Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - న్యాయా

న్యాయా 12

Help us?
Click on verse(s) to share them!
1ఎఫ్రాయిమీయులు సమకూడి “నువ్వు ఉత్తరదిక్కుకు వెళ్లి అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి బయలుదేరినప్పుడు నీతో కలిసి వెళ్ళడానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నువ్వు కాపురముంటున్న నీ ఇంటిని అగ్నితో కాల్చేస్తాం” అని యెఫ్తాతో అన్నారు.
2యెఫ్తా “నాకు, నా ప్రజలకు అమ్మోనీయులతో పెద్ద కలహం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను గాని మీరు వాళ్ళ చేతుల్లోనుంచి నన్ను రక్షించలేదు. మీరు నన్ను రక్షించకపోవడం చూసి
3నా ప్రాణం అరచేతిలో పెట్టుకుని అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళాను. అప్పుడు యెహోవా నాకు వాళ్ళ మీద జయం ఇచ్చాడు. అయితే నాతో పోట్లాడటానికి ఈ రోజు మీరెందుకు వచ్చారు?” అన్నాడు.
4అప్పుడు యెఫ్తా గిలాదు వారందర్నీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేశాడు. గిలాదువాళ్ళు ఎఫ్రాయిమీయుల మీద దాడి చేశారు. ఎందుకంటే వాళ్ళు “ఎఫ్రాయిమీయులకు మనష్శే గోత్రికులకు మధ్య గిలాదువారైన మీరు-ఎఫ్రాయిమీయులకు మొహం చాటేసి పారిపోయారు” అన్నారు.
5ఎఫ్రాయిమీయులతో యుద్ధం చెయ్యడానికి గిలాదువాళ్ళు యొర్దాను దాటే రేవులను పట్టుకొన్నప్పుడు, పారిపోతున్న ఎఫ్రాయిమీయుల్లో ఎవరన్నా “నన్ను దాటనివ్వండి” అని అడిగితే గిలాదువాళ్ళు “నువ్వు ఎఫ్రాయిమీయుడవా” అని అతన్ని అడిగారు.
6అందుకతను “కాదు” అంటే, వాళ్ళు అతన్ని చూసి “షిబ్బోలెత్” అనే మాట పలకమన్నారు. అతడు పలకలేక “సిబ్బోలెత్” అని పలికితే, వాళ్ళు అతన్ని పట్టుకుని యొర్దాను రేవుల దగ్గర చంపేశారు. ఆ సమయంలో ఎఫ్రాయిమీయుల్లో నలభై రెండు వేల మంది చనిపోయారు.
7యెఫ్తా ఆరు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. గిలాదువాడైన యెఫ్తా చనిపోయినప్పుడు, గిలాదు పట్టణాల్లో ఒక దానిలో అతన్ని పాతిపెట్టారు.
8అతని తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు.
9అతనికి ముప్ఫైమంది కొడుకులు, ముప్ఫైమంది కూతుళ్ళు ఉన్నారు. అతడు ఆ కూతుళ్ళను తన వంశంలో చేరనివారికిచ్చి, తన వంశంలో చేరని ముప్ఫైమంది కన్యలను తన కొడుకులకు పెళ్లి చేశాడు. అతడు ఏడు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు.
10ఇబ్సాను చనిపోయినప్పుడు అతణ్ణి బేత్లెహేములో పాతిపెట్టారు.
11అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు. అతడు పది సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు.
12జెబూలూనీయుడైన ఏలోను చనిపోయినప్పుడు జెబూలూను దేశంలోని అయ్యాలోనులో అతన్ని పాతిపెట్టారు.
13అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కొడుకు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు.
14అతనికి నలభైమంది కొడుకులు, ముప్ఫై మంది మనుమలు ఉన్నారు. వాళ్ళు డెబ్భై గాడిదపిల్లలు ఎక్కి తిరిగేవాళ్ళు. అతడు ఎనిమిది సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు.
15పిరాతోనీయుడైన హిల్లేలు కొడుకు అబ్దోను చనిపోయినప్పుడు ఎఫ్రాయిము దేశంలో అమాలేకీయుల మన్యంలో ఉన్న పిరాతోనులో పాతిపెట్టారు.