Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - దానియేలు

దానియేలు 10

Help us?
Click on verse(s) to share them!
1పారసీకరాజు కోరెషు పరిపాలన కాలంలో మూడవ సంవత్సరంలో బెల్తెషాజరు అనే దానియేలుకు ఒక సంగతి వెల్లడి అయింది. గొప్ప యుద్ధం జరుగుతుంది అనే ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించాడు. అది ఆ దర్శనం వలన అతనికి తెలిసింది.
2ఆ రోజుల్లో దానియేలు అనే నేను మూడు వారాలు దుఃఖంలో మునిగి పోయాను.
3మూడు వారాలు గడిచే దాకా నేను సంతోషంగా భోజనం చేయలేకపోయాను. మాంసం తినలేదు. ద్రాక్షారసం తాగ లేదు. స్నానం, నూనె రాసుకోవడం చేయలేదు.
4మొదటి నెల ఇరవై నాలుగవ తేది నేను హిద్దెకెలు అనే మహా నది తీరాన ఉన్నాను.
5నేను కళ్ళెత్తి చూడగా, నారబట్టలు ధరించుకున్న ఒకడు కనిపించాడు. అతడు నడుముకు మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు.
6అతని శరీరం కెంపు వర్ణంలో ఉంది. అతని ముఖం మెరుపులాగా ఉంది. అతని కళ్ళు జ్వాలామయమైన దీపాలు, అతని భుజాలు, పాదాలు తళతళలాడే ఇత్తడిలాగా ఉన్నాయి. అతని మాటల ధ్వని గొప్ప జనఘోష లాగా ఉంది.
7దానియేలు అనే నాకు ఈ దర్శనం కలిగినప్పుడు నాతో ఉన్న మనుషులు దాన్ని చూడలేదు గానీ భయంతో గడగడా వణుకుతూ దాక్కోవాలని పారిపోయారు.
8నేను ఒంటరిగా ఆ గొప్ప దర్శనాన్ని చూశాను. అందువల్ల నాలో బలమేమీ లేకపోయింది. నా సొగసు వికారమై పోయింది. నాలో బలమేమీ లేకపోయింది.
9నేను అతని మాటలు విన్నాను. నేను అతని మాటలు విని నేలపై సాష్టాంగపడి గాఢనిద్ర పోయాను.
10అప్పుడొకడు నన్ను చేత్తో తాకి నా మోకాళ్లను అరచేతులను నేలపై మోపి నన్ను నిలబెట్టి
11“దానియేలూ, నువ్వు చాలా ఇష్టమైన వాడివి గనక నేను నీ దగ్గరికి పంపబడ్డాను. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పే మాటలు తెలుసుకో” అన్నాడు. అతడీ మాటలు నాతో చెప్పగా నేను వణకుతూ నిలబడ్డాను.
12అప్పుడతడు “దానియేలూ, భయపడకు. నీవు తెలుసుకోవాలని నీ మనస్సు లగ్నం చేసి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి రోజు మొదలు నీవు చెప్పిన మాటలు వినబడినాయి గనక నీ మాటలను బట్టి నేను వచ్చాను.
13పారసీకుల రాజ్యాధిపతి 20 రోజులు నాకు అడ్డుపడ్డాడు. ఇంకా పారసీక రాజుల దగ్గర నేను ఆగిపోయి ఉండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలు అనే ఒకడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు.
14ఈ దర్శనం సంగతి ఇంక చాలా రోజుల వరకూ జరగదు. అయితే చివరి రోజుల్లో నీ ప్రజలకు సంభవించబోయే ఈ సంగతి నీకు తెలియజేయడానికి వచ్చాను” అని అతడు నాతో చెప్పాడు.
15అతడీ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖం నేలకు వంచుకుని మౌనంగా ఉండిపోయాను.
16అప్పుడు మనిషి ఆకారం గల ఒకడు నా పెదాలు ముట్టుకున్నాడు. నేను నోరు తెరిచి నా ఎదుట నిలబడి ఉన్నవాడితో ఇలా అన్నాను. “అయ్యా, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందువల్ల నా బలం ఉడిగి పోయింది.
17తమరి సేవకుడినైన నేను నా యజమాని ఎదుట ఎలా మాటలాడతాను? నా బలం ఉడిగి పోయింది. ఊపిరాడకుండా ఉంది” అని చెప్పగా
18అతడు మళ్ళీ నన్ను ముట్టి నన్ను బలపరచి “నీవు చాలా ఇష్టమైన వాడివి. భయపడకు.

19నీకు శుభం కలుగుతుంది. ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకో” అని నాతో అన్నాడు. అతడు నాతో ఇలా అన్నప్పుడు నేను ధైర్యం తెచ్చుకుని “నీవు నన్ను ధైర్యపరచావు గనక నా యజమానివైన నీవు ఆజ్ఞ ఇవ్వు” అని చెప్పాను.
20అతడు “నేనెందుకు నీ దగ్గరికి వచ్చానో నీకు తెలిసింది గదా. నేను పారసీక అధిపతితో యుద్ధం చేయడానికి మళ్ళీ వెళతాను. నేను బయలు దేరుతున్నప్పుడే గ్రీకుల అధిపతి వస్తాడు.
21అయితే సత్యగ్రంథంలో రాసినది నీతో చెప్తాను. మీ అధిపతి మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షంగా నిలబడడానికి తెగించిన వారెవరూ లేరు.”