Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - లూకా - లూకా 6

లూకా 6:27-44

Help us?
Click on verse(s) to share them!
27“వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి.
28మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి.
29నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండవ చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు.
30అడిగే ప్రతివాడికీ ఇవ్వు. నీ వస్తువులను తీసుకున్న వాణ్ణి వాటి కోసం తిరిగి అడగవద్దు.
31మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి.
32మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపాత్ములు కూడా తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు కదా.
33మీకు మేలు చేసే వారికే మీరు మేలు చేస్తూ ఉంటే మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా అలాగే చేస్తారు కదా!
34మీ అప్పు తిరిగి తీరుస్తారు అనుకున్న వారికే మీరు అప్పిస్తూ ఉంటే దాంట్లో మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా మళ్లీ వసూలు చేసుకోవచ్చనుకుని పాపాత్ములకే అప్పులిస్తూ ఉంటారు కదా.
35మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు.
36మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి.
37ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు. ఎవరి మీదా నేరారోపణ చేయవద్దు. అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు. ఇతరులను క్షమించండి. అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది.
38ఇవ్వండి. అప్పుడు మీకూ ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి, కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకూ కొలవడం జరుగుతుంది.”
39తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు, “ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి ఎలా చూపిస్తాడు? వారిద్దరూ గుంటలో పడరా?
40శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. అయితే సంపూర్ణమైన శిక్షణ పొందినవాడు తన గురువులా ఉంటాడు.
41నువ్వు నీ కంట్లో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సోదరుడి కంట్లో నలుసును చూడడమెందుకు?
42నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోకుండా నీ సోదరుడితో, ‘సోదరా, నీ కంట్లో నలుసు తీసివేయనియ్యి’ అని నువ్వెలా చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివెయ్యి. అప్పుడు నీ సోదరుడి కంట్లో నలుసు తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది.
43మంచి చెట్టుకు పనికిమాలిన కాయలు కాయవు. అలాగే పనికిమాలిన చెట్టుకు మంచి కాయలు కాయవు.
44ఏ చెట్టయినా దాని పండ్లను బట్టి తెలిసిపోతుంది. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకోరు. రక్కెస పొదలో ద్రాక్షపళ్ళు కోయరు.

Read లూకా 6లూకా 6
Compare లూకా 6:27-44లూకా 6:27-44