Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - ద్వితీ

ద్వితీ 15

Help us?
Click on verse(s) to share them!
1ప్రతి ఏడవ సంవత్సరం అంతంలో అప్పులన్నీ రద్దు చేయాలి. అది ఎలాగంటే,
2తన పొరుగువాడికి అప్పు ఇచ్చిన ప్రతివాడూ దాన్ని రద్దు చేసి వారిని విడిచిపెట్టాలి. అది యెహోవా ప్రకటించిన గడువు కాబట్టి అప్పు ఇచ్చినవాడు తన పొరుగువాడిపై లేక తన సోదరునిపై ఒత్తిడి తేకూడదు.
3ఇశ్రాయేలీయుడు కాని వ్యక్తి పై ఒత్తిడి తేవచ్చు గాని మీ సోదరుని దగ్గర ఉన్న మీ సొమ్మును విడిచిపెట్టాలి.
4మీరు స్వాధీనం చేసుకోడానికి యెహోవా దేవుడు మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో యెహోవా మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు.
5కాబట్టి ఈ రోజు నేను మీకు ఆదేశించే యెహోవా దేవుని ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా విని పాటిస్తే మీలో పేదవాళ్ళు ఉండనే ఉండరు.
6ఎందుకంటే ఆయన మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి మీరు ఇతరులు అనేకులకు అప్పిస్తారు గాని అప్పు చెయ్యరు. అనేక రాజ్యాలను పాలిస్తారు గాని ఎవరూ మిమ్మల్ని పరిపాలించరు.
7మీ దేవుడు యెహోవా మీకిస్తున్న దేశంలోని మీ పట్టణాల్లో ఎక్కడైనా మీ సోదరుల్లో ఒక బీదవాడు ఉంటే అతనిపై దయ చూపాలి. మీ హృదయాలను కఠినపరచుకోకూడదు.
8మీ చెయ్యి ముడుచుకోకుండా తప్పక వాడి వైపు చాచి, వాడి అక్కరకు చాలినంతగా వాడికి అప్పు ఇవ్వాలి.
9అప్పు రద్దు చేయాల్సిన “ఏడో సంవత్సరం దగ్గర పడింది” అనే చెడ్డ తలంపు మీ మనస్సులో కలగనీయవద్దు. బీదవాడైన మీ సోదరునిపై మీరు దయ చూపి అతనికేమీ ఇవ్వకపోతే వాడొకవేళ మిమ్మల్ని గూర్చి యెహోవాకు మొరపెడితే అది మీకు పాపం అవుతుంది.
10కాబట్టి మీరు తప్పకుండా అతనికి ఇవ్వాలి. అతనికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన యెహోవా దేవుడు మీ పనులన్నిటిలో, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
11పేదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను మీ దేశంలో దీనులు, “పేదలు అయిన మీ సోదరులకు తప్పకుండా సహాయం చేయాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
12మీ సోదరుల్లో మీరు కొన్న హెబ్రీయుడు, లేక హెబ్రీయురాలు ఆరు సంవత్సరాలు మీకు దాస్యం చేసిన తరవాత ఏడో సంవత్సరం వారికి విడుదలనిచ్చి నీ దగ్గర నుండి పంపివేయాలి.
13అయితే ఆ విధంగా పంపేటప్పుడు మీరు వారిని వట్టి చేతులతో పంపకూడదు.
14వారికి మీ మందలో, ధాన్యంలో, మీ ద్రాక్ష గానుగలో నుండి ఉదారంగా ఇవ్వాలి. మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకిచ్చిన కొలదీ వారికి ఇవ్వాలి.”
15మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మీ యెహోవా దేవుడు మిమ్మల్ని విమోచించాడని జ్ఞాపకం చేసుకోండి. అందుకే నేను ఈ సంగతి ఈ రోజు మీకు ఆజ్ఞాపించాను.
16అయితే వారు నీ దగ్గర పొందిన మేలును బట్టి మిమ్మల్ని, మీ ఇంటివారిని ప్రేమించి “నేను మీ దగ్గర నుండి వెళ్లిపోను” అని మీతో చెబితే,
17మీరు ఒక లోహపు ఊచ తీసుకుని, తలుపులోకి దిగేలా వాడి చెవికి దాన్ని గుచ్చాలి. ఆ తరువాత అతడు ఎన్నటికీ మీకు దాసుడుగా ఉంటాడు. అదే విధంగా మీరు మీ దాసికి కూడా చేయాలి.
18మీ దాసులను స్వతంత్రులుగా విడిచిపెట్టడాన్ని కష్టంగా భావించకూడదు. ఎందుకంటే వారు ఆరు సంవత్సరాలు మీకు దాస్యం చేయడం ద్వారా జీతగాడికి మీరు చెల్లించే జీతానికి రెండు రెట్లు లాభం మీకు కలిగింది. మీ యెహోవా దేవుడు మీరు చేసే వాటన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

19మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో ప్రతి తొలి చూలు మగపిల్లను యెహోవా దేవునికి ప్రతిష్ఠించాలి. మీ కోడెల్లో తొలిచూలు దానితో పనిచేయకూడదు. మీ గొర్రెలు, మేకల్లో తొలిచూలు దాని బొచ్చు కత్తిరించకూడదు.
20మీ యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో మీరు, మీ ఇంటివారు ఆయన సన్నిధిలో ప్రతి సంవత్సరం దాన్ని తినాలి.
21దానిలో లోపం, అంటే కుంటితనం గాని, గుడ్డితనం గాని, మరే లోపమైనా ఉంటే మీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పించకూడదు.
22జింకను, దుప్పిని తినే విధంగానే, పట్టణాల్లోని మీ ఆవరణల్లో పవిత్రులు, అపవిత్రులు కూడా దాన్ని తినవచ్చు.
23వాటి రక్తాన్ని మాత్రం మీరు తినకూడదు. నీళ్లలాగా భూమి మీద దాన్ని పారబోయాలి.