1యొర్దాను నదికి తూర్పున ఉన్న ఎడారిలో, అంటే పారాను, తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబు అనే ప్రదేశాల మధ్య సూపుకు ఎదురుగా ఉన్న ఆరాబా ఎడారిలో మోషే, ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు.
2హోరేబు నుండి శేయీరు ఎడారి దారిలో కాదేషు బర్నేయ వరకూ ప్రయాణ సమయం 11 రోజులు.
3హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజు సీహోనునూ అష్తారోతులో నివసించిన బాషాను రాజు ఓగునూ ఎద్రెయీలో చంపిన తరువాత 40 వ సంవత్సరంలో 11 వ నెల మొదటి రోజున మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు.
5యొర్దాను ఇవతల ఉన్న మోయాబు దేశంలో మోషే ఈ ధర్మశాస్త్రాన్ని ప్రకటించడం మొదలుపెట్టి ఇలా అన్నాడు,
6“మన దేవుడు యెహోవా హోరేబులో మనకిలా చెప్పాడు, ఈ కొండ దగ్గర మీరు నివసించింది చాలు.
7మీరు బయలుదేరి అమోరీయుల కొండ ప్రాంతానికీ అరాబా లోయలో దక్షిణ దిక్కున సముద్రతీరంలో ఉన్న స్థలాలన్నిటికీ కనాను దేశానికీ లెబానోనుకూ యూఫ్రటీసు మహానది వరకూ వెళ్ళండి.
8ఇదిగో, ఆ దేశాన్ని మీకు అప్పగించాను. మీరు వెళ్లి, యెహోవా మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకూ, వారి సంతానానికీ ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.”
9ఆ సమయంలో, నేను మీతో “నేను ఒక్కడినే మిమ్మల్ని మోయలేను.
10యెహోవా దేవుడు మిమ్మల్ని విస్తరింపజేశాడు కనుక ఈ రోజు మీరు ఆకాశంలో నక్షత్రాల్లాగా విస్తరించారు.
11మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి, తాను మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక.
12నేనొక్కడినే మీ కష్టాన్ని, భారాన్ని, మీ వివాదాలను ఎలా తీర్చగలను?
13జ్ఞానం, తెలివి కలిగి మీ గోత్రాల్లో పేరు పొందిన మనుషులను ఎన్నుకోండి. వారిని మీకు నాయకులుగా నియమిస్తాను” అని చెప్పాను.
14అప్పుడు మీరు “నీ మాట ప్రకారం చేయడం మంచిది” అని నాకు జవాబిచ్చారు.
15కాబట్టి నేను మీ గోత్రాల్లో పేరు పొంది, తెలివీ జ్ఞానమూ కలిగిన వారిని పిలిచి, మీ గోత్రాలకు వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున వారిని మీ మీద న్యాయాధికారులుగా నియమించాను.
16అప్పుడు నేను వారితో “మీ సోదరుల వివాదాలు తీర్చి, ప్రతివాడికీ వాడి సోదరుడికీ వాడి దగ్గర ఉన్న పరదేశికీ న్యాయం ప్రకారం తీర్పు తీర్చండి.
17అలా చేసేటప్పుడు తక్కువ, ఎక్కువ అనే పక్షపాతం లేకుండా వినాలి. న్యాయపు తీర్పు దేవునిది కాబట్టి మీరు మనుషుల ముఖం చూసి భయపడవద్దు. మీకు కష్టమైన వివాదాన్ని నా దగ్గరికి తీసుకు రండి. దాన్ని నేను విచారిస్తాను” అని ఆజ్ఞాపించాను.
18అలాగే మీరు చేయాల్సిన పనులన్నిటిని గూర్చి మీకు ఆజ్ఞాపించాను.
19మనం హోరేబు నుండి ప్రయాణించి యెహోవా దేవుడు మనకి ఆజ్ఞాపించినట్టు మీరు చూసిన ఘోరమైన ఎడారి ప్రాంతం నుండి వచ్చి, అమోరీయుల కొండ ప్రాంతం మార్గంలో కాదేషు బర్నేయ చేరాం.
20అప్పుడు నేను “మన దేవుడైన యెహోవా మనకిస్తున్న అమోరీయుల కొండ ప్రాంతానికి వచ్చాం.
21ఇదిగో, మీ దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకు అప్పగించాడు. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీతో చెప్పినట్టు దాన్ని స్వాధీనం చేసుకోండి. భయపడవద్దు, నిరుత్సాహం వద్దు” అని మీతో చెప్పాను.
22అప్పుడు మీరంతా నా దగ్గరికి వచ్చి “ముందుగా మన మనుషులను పంపుదాం, వాళ్ళు మన కోసం ఈ దేశాన్ని పరిశీలించి తిరిగి వచ్చి దానిలో మనం వెళ్ళాల్సిన మార్గం గురించీ మనం చేరాల్సిన పట్టణాలను గురించీ మనకు సమాచారం తెస్తారు” అన్నారు.
23ఆ మాట అంగీకరించి ఒక్కొక్క గోత్రానికి ఒక్కరు చొప్పున పన్నెండు మందిని పంపాను.
24వాళ్ళు ఆ కొండ ప్రదేశానికి వెళ్ళి ఎష్కోలు లోయకు వచ్చి దాన్ని పరిశీలించారు. ఆ దేశంలో దొరికే పండ్లు కొన్నిటిని మన దగ్గరికి తెచ్చి,
25“మన దేవుడు యెహోవా మనకిస్తున్న దేశం మంచిది” అని మనకు చెప్పారు.
26అయితే మీరు వెళ్లడానికి ఇష్టపడలేదు. మీ దేవుడైన యెహోవా మాటకు తిరగబడ్డారు.
27మీ గుడారాల్లో సణుక్కుంటూ “యెహోవా మన మీద పగబట్టి మనలను చంపడానికి, అమోరీయులకు అప్పగించడానికి ఐగుప్తు దేశం నుండి మనలను రప్పించాడు.
28మనమెక్కడికి వెళ్లగలం? అక్కడి ప్రజలు మన కంటే బలిష్ఠులు, ఎత్తయినవారు. ఆ పట్టణాలు గొప్పవి, ఆకాశాన్నంటే ప్రాకారాలతో ఉన్నాయి. అక్కడ అనాకీయులను చూశాం” అని మన సోదరులు చెప్పి మా హృదయాలు కరిగిపోయేలా చేశారు అని అన్నారు.
29అప్పుడు నేను మీతో “దిగులు పడొద్దు, భయపడొద్దు.
30మీకు ముందు నడుస్తున్న మీ యెహోవా దేవుడు మీరు చూస్తుండగా
31ఐగుప్తులో, అరణ్యంలో చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మీరు ఇక్కడికి వచ్చేవరకూ దారిలో మీ యెహోవా దేవుడు ఒక తండ్రి తన కొడుకుని ఎత్తుకున్నట్టు మిమ్మల్ని ఎత్తుకుని వచ్చాడని మీకు తెలుసు” అన్నాను.
32అయితే మీకు దారి చూపించి మీ గుడారాలకు స్థలం సిద్ధపరిచేలా
33రాత్రి అగ్నిలో, పగలు మేఘంలో మీ ముందు నడిచిన మీ యెహోవా దేవుని మీద మీరు విశ్వాసముంచలేదు.
34కాబట్టి యెహోవా మీ మాటలు విని,
35బాగా కోపం తెచ్చుకుని “నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన ఈ మంచి దేశాన్ని ఈ చెడ్డతరంలో
36యెఫున్నె కొడుకు కాలేబు తప్ప మరెవరూ చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించాడు కాబట్టి కేవలం అతడు మాత్రమే దాన్ని చూస్తాడు. అతడు అడుగుపెట్టిన భూమిని నేను అతనికీ అతని సంతానానికీ ఇస్తాను” అని ప్రమాణం చేశాడు.
37అంతేగాక యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి “నీ సేవకుడు, నూను కొడుకు యెహోషువ దానిలో అడుగు పెడతాడు గాని నువ్వు అడుగు పెట్టవు.
38అతడే దాన్ని ఇశ్రాయేలీయులకు స్వాధీనం చేస్తాడు. కాబట్టి అతణ్ణి ప్రోత్సహించు.
39అయితే మంచీ చెడూ తెలియని మీ కొడుకులు, అంటే అన్యాయానికి గురౌతారు అని మీరు చెప్పే మీ పిల్లలు దానిలో అడుగు పెడతారు. దాన్ని వారికిస్తాను. వారు దాన్ని స్వాధీనం చేసుకుంటారు.
40మీరు మాత్రం వెనక్కి ఎర్రసముద్రం వైపుకు తిరిగి ఎడారిలోకి ప్రయాణించండి” అని చెప్పాడు.
41అందుకు మీరు “మేము యెహోవాకు విరోధంగా పాపం చేశాం. మా యెహోవా దేవుడు మాకాజ్ఞాపించిన ప్రకారం మేము వెళ్ళి యుద్ధం చేస్తాం” అని నాతో చెప్పి, మీ ఆయుధాలతో ఆ కొండ ప్రాంతానికి బయలుదేరారు.
42అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు “యుద్ధానికి వెళ్లొద్దు. నేను మీతో ఉండను కాబట్టి మీరు వెళ్లినా మీ శత్రువుల చేతిలో ఓడిపోతారని వారితో చెప్పు.”
43ఆ మాటలు నేను మీతో చెప్పినా మీరు వినకుండా యెహోవా మాటకు ఎదురు తిరిగి మూర్ఖంగా ఆ కొండ ప్రాంతానికి వెళ్ళారు.
44అప్పుడు అక్కడ ఉన్న అమోరీయులు మీకెదురు వచ్చి, కందిరీగల్లాగా మిమ్మల్ని హోర్మా వరకూ తరిమి శేయీరులో మిమ్మల్ని హతం చేశారు.
45తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిలో ఏడ్చారు. అయినా యెహోవా మిమ్మల్ని లెక్కచేయలేదు, మీ మాట వినలేదు.
46కాబట్టి మీరు కాదేషులో చాలా రోజులు ఉండిపోయారు. అక్కడ ఎన్ని రోజులు నివసించారో మీకు తెలుసు.