Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - ద్వితీ

ద్వితీ 16

Help us?
Click on verse(s) to share them!
1“మీరు ఆబీబు నెలలో పండగ ఆచరించి మీ యెహోవా దేవునికి పస్కా పండగ జరిగించాలి. ఎందుకంటే ఆబీబు నెలలో రాత్రివేళ మీ యెహోవా దేవుడు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించాడు.
2యెహోవా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే మీ యెహోవా దేవునికి పస్కా ఆచరించి, గొర్రెలను, మేకలను, ఆవులను బలి అర్పించాలి.
3పస్కా పండగలో కాల్చినప్పుడు పొంగకుండా ఉన్న రొట్టెలను తినాలి. మీరు ఐగుప్తు దేశం నుండి త్వరత్వరగా వచ్చారు గదా. మీరు వచ్చిన రోజును మీ జీవితం అంతటిలో జ్ఞాపకం ఉంచుకునేలా పొంగని రొట్టెలు ఏడు రోజులపాటు తినాలి.
4మీ పరిసరాల్లో ఏడు రోజులపాటు పొంగినది ఏదీ కనిపించకూడదు. అంతేకాదు, మీరు మొదటి రోజు సాయంత్రం వధించిన దాని మాంసంలో కొంచెం కూడా ఉదయం వరకూ మిగిలి ఉండకూడదు.
5మీ దేవుడు యెహోవా మీకిస్తున్న పట్టణాల్లో ఏదో ఒక దానిలో పస్కా పశువును వధించకూడదు.
6మీ దేవుడు యెహోవా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకునే స్థలం లోనే, మీరు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన సమయంలో, అంటే సూర్యుడు అస్తమించే సాయంత్రం వేళలో పస్కా పశువును వధించాలి.
7అదే స్థలం లో దాన్ని కాల్చి, తిని, ఉదయాన్నే తిరిగి మీ గుడారాలకు వెళ్ళాలి. ఆరు రోజులపాటు మీరు పొంగని రొట్టెలు తినాలి.
8ఏడవరోజు మీ దేవుడైన యెహోవాను ఆరాధించే రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఎలాంటి పనీ చేయకూడదు.
9మీరు ఏడు వారాలు లెక్కబెట్టండి. పంట చేను మీద కొడవలి వేసింది మొదలు ఏడు వారాలు లెక్కబెట్టండి.
10మీ యెహోవా దేవునికి వారాల పండగ ఆచరించడానికి మీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచాలి. మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొద్దీ దాన్ని ఇవ్వాలి.
11అప్పుడు మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ పట్టణాల్లో ఉన్న లేవీయులు, మీ మధ్య ఉన్న పరదేశులు, అనాథలు, వితంతువులు మీ యెహోవా దేవుడు తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలం లో ఆయన సన్నిధిలో సంతోషించాలి.
12మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకుని, ఈ కట్టడలను పాటించి అమలు జరపాలి.
13మీ కళ్ళంలో నుండి ధాన్యాన్ని, మీ తొట్టిలో నుండి ద్రాక్షరసాన్ని తీసినప్పుడు పర్ణశాలల పండగను ఏడు రోజులపాటు ఆచరించాలి.
14ఈ పండగలో మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ ఆవరణలో నివసించే లేవీయులు, పరదేశులు, అనాథలు, వితంతువులు సంతోషించాలి.
15మీ యెహోవా దేవుడు మీ రాబడి అంతటిలో, మీ చేతిపనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వస్తాడు. కనుక ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలం లో మీ యెహోవా దేవునికి ఏడురోజులు పండగ చేసుకుని మీరు అధికంగా సంతోషించాలి.
16సంవత్సరానికి మూడుసార్లు, అంటే పొంగని రొట్టెల పండగలో, వారాల పండగలో, పర్ణశాలల పండగలో మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలం లో మీలో ఉన్న పురుషులందరూ ఆయన సన్నిధిలో కనిపించాలి.
17వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిలో కనిపించకుండా, మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన ప్రకారం ప్రతివాడూ తన శక్తి కొలదీ ఇవ్వాలి.
18మీ యెహోవా దేవుడు మీకు ఇస్తున్న మీ పట్టణాలన్నిటిలో మీ గోత్రాలకు న్యాయాధిపతులనూ నాయకులనూ నియమించుకోవాలి. వారు న్యాయంగా ప్రజలకు తీర్పుతీర్చాలి.

19మీరు న్యాయం తప్పి తీర్పుతీర్చకూడదు, పక్షపాతం చూపకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఎందుకంటే లంచం జ్ఞానులను గుడ్డివారుగా చేసి, నీతిమంతుల మాటలను వక్రీకరిస్తుంది.
20మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుని జీవించగలిగేలా మీరు కేవలం న్యాయాన్నే జరిగించాలి.
21యెహోవా దేవునికి మీరు కట్టే బలిపీఠం దగ్గరగా ఏ విధమైన చెట్టును నాటకూడదు, దేవతా స్తంభాన్నీ నిలబెట్టకూడదు.
22మీ యెహోవా దేవుడు విగ్రహాన్ని ద్వేషించేవాడు కాబట్టి మీరు ఏ స్తంభాన్నీ నిలబెట్టకూడదు.”