Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - లూకా - లూకా 11

లూకా 11:10-27

Help us?
Click on verse(s) to share them!
10అడిగే ప్రతి వ్యక్తికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టేవాడికి తలుపు తెరుచుకుంటుందని మీకు చెబుతున్నాను.
11“మీలో ఎవరైనా ఒక తండ్రి తన కొడుకు చేపకోసం అడిగితే చేపకు బదులుగా పామును ఇస్తాడా?
12గుడ్డు అడిగితే తేలునిస్తాడా?
13కాబట్టి మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి విషయాలనే ఇవ్వాలని అనుకుంటుంటే పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను కచ్చితంగా అనుగ్రహిస్తాడు కదా” అని చెప్పాడు.
14ఒకసారి ఆయన ఒక మూగ దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఆ దయ్యం వదలిపోయిన తరవాత ఆ మూగవాడు మాట్లాడాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు.
15అయితే వారిలో కొందరు, “వీడు దయ్యాలకు నాయకుడైన బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అని చెప్పుకున్నారు.
16మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు.
17ఆయనకు వారి ఆలోచనలన్నీ తెలుసు. ఆయన వారితో ఇలా అన్నాడు, “తనకు తానే వ్యతిరేకంగా వేరైపోయిన ఏ రాజ్యమైనా నశించి పోతుంది. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోతుంది.
18సాతాను కూడా తనకు తానే వ్యతిరేకంగా వేరైపోతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది?
19నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని మీరు అంటున్నారే, మరి మీ అనుచరులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొడుతున్నారు? దీని వలన మీ సంతానమే మీకు తీర్పు తీరుస్తారు.
20అయితే నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొడుతుంటే దాని అర్థం, దేవుని రాజ్యం కచ్చితంగా మీ దగ్గరికి వచ్చిందనే.
21బలవంతుడు ఆయుధాలు ధరించుకుని, తన ఆవరణలో కాపలా కాస్తే అతని సొత్తు భద్రంగా ఉంటుంది.
22అయితే అతని కంటే బలవంతుడైన వాడు అతణ్ణి ఎదిరించి ఓడించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ బలవంతంగా తీసుకుని అతని ఆస్తినంతా దోచుకుంటాడు.
23నా వైపు ఉండని వాడు నాకు విరోధి. నాతో కలసి పోగుచెయ్యని వాడు చెదరగొట్టే వాడే.
24“అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరవాత విశ్రాంతి కోసం వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. దానికెక్కడా విశ్రాంతి దొరకదు. అందుకని అది ‘నా పాత ఇంటికే మళ్ళీ వెళతాను’ అనుకుంటుంది.
25అది వచ్చి, ఆ ఇల్లు ఊడ్చి, అమర్చి ఉండడం చూసి
26తిరిగి వెళ్ళి, తన కంటే చెడ్డవైన మరో ఏడు అపవిత్రాత్మలను వెంటబెట్టుకువస్తుంది. అవి ఆ ఇంట్లో చొరబడి ఇక అక్కడే నివాసముంటాయి. కాబట్టి ఆ వ్యక్తి చివరి దశ మొదటి దశ కంటే అధ్వాన్నంగా ఉంటుంది” అని చెప్పాడు.
27ఆయన ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం” అని కేకలు వేసి చెప్పింది.

Read లూకా 11లూకా 11
Compare లూకా 11:10-27లూకా 11:10-27