16ఇతడు నా నామం కోసం ఎన్ని బాధలు అనుభవించాలో నేనతనికి చూపిస్తాను” అని అతనితో చెప్పాడు.
17అననీయ వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి, అతని మీద చేతులుంచి, “సౌలా, సోదరా, నీవు వచ్చిన దారిలో నీకు కనబడిన ప్రభు యేసు, నీవు చూపు పొంది, పరిశుద్ధాత్మతో నిండేలా నన్ను నీ దగ్గరకి పంపాడు” అని చెప్పాడు.
18వెంటనే అతని కళ్ళ నుండి పొరల్లాంటివి రాలిపోగా అతడు చూపు పొంది, లేచి బాప్తిసం పొందాడు. తరువాత భోజనం చేసి బలం పుంజుకున్నాడు.
19అతడు దమస్కులో ఉన్న శిష్యులతో చాలా రోజులు గడిపాడు.
20వెంటనే సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ వచ్చాడు.
21విన్నవారంతా ఆశ్చర్యపడి, ‘యెరూషలేములో ఈ పేరుతో ప్రార్థన చేసే వారిని నాశనం చేసింది ఇతడే కదా? వారిని బందీలుగా ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుపోడానికి ఇక్కడికి కూడా వచ్చాడు కదా’ అని చెప్పుకున్నారు.
22అయితే సౌలు మరింతగా బలపడి ‘యేసే క్రీస్తు’ అని రుజువు పరుస్తూ దమస్కులో నివసిస్తున్న యూదులను కలవరపరచాడు.
23చాలా రోజులు గడిచిన తరువాత యూదులు అతనిని చంపాలని ఆలోచించారు.
24వారి కుతంత్రం సౌలుకు తెలిసింది. వారు అతనిని చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాల దగ్గర కాపు కాశారు.