14అప్పుడు యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనను గురించిన సమాచారం ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
15ఆయన వారి సమాజ మందిరాల్లో బోధిస్తుంటే అందరూ ఆయనను మెచ్చుకున్నారు.
16ఒక రోజు తాను పెరిగిన నజరేతుకు ఆయన వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి చదవడానికి నిలబడ్డాడు.
17యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే,
18“ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ,
19ప్రభువు అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు” అని రాసిన చోటు ఆయనకు దొరికింది.
20ఆయన గ్రంథం మూసి సమాజ మందిర పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు.
21సమాజ మందిరంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూశారు. “మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అని ఆయన వారితో అన్నాడు.
22అందరూ ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడ్డారు. “ఈయన యోసేపు కొడుకు గదా?” అని చెప్పుకున్నారు.
23ఆయన వారితో, “వైద్యుడా, నిన్ను నీవే బాగు చేసుకో” అనే సామెత నాకు చెప్పి, కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, వాటిని ఈ నీ సొంత ఊరులో కూడా చేయమని మీరు తప్పకుండా నాతో అంటారు” అన్నాడు.
24ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వారు అంగీకరించరు.
25ఏలీయా ప్రవక్త రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులు ఉన్నారు. మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూసుకుపోయి దేశమంతా తీవ్రమైన కరువు రాగా,
26దేవుడు ఏలీయాను ఎవరి దగ్గరకీ పంపలేదు. సీదోను ప్రాంతంలో సారెపతు అనే ఊరిలో ఉన్న ఒక వితంతువు దగ్గరకే పంపాడు.
27ఎలీషా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలులో ఎందరో కుష్టురోగులున్నా, సిరియా వాడైన నయమాను తప్ప ఎవరూ బాగుపడలేదు.”
28సమాజ మందిరంలో ఉన్నవారంతా ఆ మాటలు విని
29ఆగ్రహంతో నిండిపోయి, లేచి ఆయనను ఊరి బయటకు తోసుకుపోయి కొండ కొమ్ము వరకూ తీసికెళ్ళారు. వారి ఊరు కొండ పైన ఉంది. ఆయనను అక్కడ నుండి పడదోయాలనుకున్నారు.
30అయితే ఆయన వారి మధ్యనుంచి తప్పుకుని తన దారిన వెళ్ళిపోయాడు.