12అందరూ ఆశ్చర్యచకితులై ఎటూ తోచక, “ఇదేమిటో” అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు.
13కొందరైతే వీరు కొత్త సారా తాగి ఉన్నారని ఎగతాళి చేశారు.
14అయితే పేతురు ఆ పదకొండు మందితో లేచి నిలబడి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు, “యూదయ ప్రజలారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియాలి. నా మాటలు జాగ్రత్తగా వినండి.
15“మీరనుకున్నట్టు వీరు మద్యపానం చేయలేదు. ఇప్పుడు ఉదయం తొమ్మిదయినా కాలేదు.
16యోవేలు ప్రవక్త చెప్పిన సంగతి ఇదే,
17‘అంత్యదినాల్లో నేను మనుషులందరి మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులూ కుమార్తెలూ ప్రవచిస్తారు. మీ యువకులు దర్శనాలు చూస్తారు. మీ వృద్ధులు కలలు కంటారు,
18ఆ రోజుల్లో నా దాసుల మీదా దాసీల మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు.
19పైన ఆకాశంలో మహత్కార్యాలనూ కింద భూమ్మీద సూచకక్రియలనూ రక్తం, అగ్ని, పొగ, ఆవిరినీ చూపిస్తాను.
20ప్రభువు ప్రత్యక్షమయ్యే మహిమాయుక్తమైన ఆ మహాదినం రాక ముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారతారు.
21ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారంతా పాప విమోచన పొందుతారు’ అని దేవుడు చెబుతున్నాడు.
22“ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకే తెలుసు.