Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - 1 రాజులు - 1 రాజులు 22

1 రాజులు 22:3-28

Help us?
Click on verse(s) to share them!
3ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి “రామోత్గిలాదు మనదని మీకు తెలుసు. అయితే మనం దాన్ని సిరియా రాజు చేతిలోనుంచి తీసుకోడానికి ప్రయత్నమేమీ చేయడం లేదు” అన్నాడు.
4అతడు “యుద్ధానికి నాతో పాటు నీవు రామోత్గిలాదు వస్తావా?” అని యెహోషాపాతును అడిగాడు. అందుకు యెహోషాపాతు “నువ్వేదంటే అదే. మా వాళ్ళు నీవాళ్ళే. నా గుర్రాలు నీ గుర్రాలే” అని ఇశ్రాయేలు రాజుతో అన్నాడు.
5యెహోషాపాతు “ముందు యెహోవా ఇష్టాన్ని తెలుసుకుందాం” అన్నాడు.
6ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి “యుద్ధానికి రామోత్గిలాదు మీదికి వెళ్ళాలా, వద్దా?” అని వారినడిగాడు. వాళ్ళు “వెళ్ళండి, దాన్ని యెహోవా రాజైన మీ వశం చేస్తాడు” అన్నారు.
7అయితే యెహోషాపాతు “మనం సలహా తీసుకోడానికి వీళ్ళు తప్ప, యెహోవా ప్రవక్తల్లో ఒక్కడు కూడా ఇక్కడ లేడా?” అని అడిగాడు.
8అందుకు ఇశ్రాయేలు రాజు “ఇమ్లా కొడుకు మీకాయా అనే ఒకడున్నాడు. అతని ద్వారా మనం యెహోవా దగ్గర సలహా తీసుకోవచ్చు గాని అతడు ఎప్పుడూ నాకు మంచి జరుగుతుందని ప్రవచించకుండా కేవలం చెడు జరుగుతుందననే ప్రవచిస్తాడు. అందుకే అతడంటే నాకు ద్వేషం” అని యెహోషాపాతుతో అన్నాడు. అయితే యెహోషాపాతు “రాజైన మీరు అలా అనొద్దు” అన్నాడు.
9అప్పుడు ఇశ్రాయేలు రాజు ఒక అధికారిని పిలిచి “ఇమ్లా కొడుకు మీకాయాను వెంటనే ఇక్కడికి తీసుకురండి” అని ఆదేశించాడు.
10ఇశ్రాయేలు రాజు అహాబు, యూదారాజు యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకుని, సమరయ ముఖద్వారం దగ్గరున్న బహిరంగ స్థలం లో తమ సింహాసనాల మీద కూర్చున్నారు. ప్రవక్తలంతా వారి ఎదుట ప్రవచిస్తూ ఉన్నారు.
11కెనయనా కొడుకు సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి “యెహోవా చెప్పేదేమిటంటే వీటితో నీవు సిరియా వారిని పొడిచి నిర్మూలిస్తావు” అన్నాడు.
12ప్రవక్తలంతా అలాగే ప్రవచిస్తూ “యెహోవా రామోత్గిలాదును రాజువైన నీ వశం చేస్తాడు. కాబట్టి నీవు దాని మీదికి వెళ్లి గెలువు” అన్నారు.
13మీకాయాను పిలవడానికి వెళ్ళిన వార్తాహరుడు అతనితో “ప్రవక్తలంతా ఏకంగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు కాబట్టి నీవు కూడా వాళ్ళలాగే మంచి మాటలు చెప్పు” అన్నాడు.
14మీకాయా “యెహోవా జీవం తోడు, యెహోవా నాకు చెప్పిందే నేను చెబుతాను” అన్నాడు.
15అతడు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు “మీకాయా, యుద్ధం చేయడానికి మేము రామోత్గిలాదు మీదికి వెళ్ళాలా వద్దా” అని అడిగాడు. మీకాయా “యెహోవా దాన్ని రాజువైన నీ చేతికి అప్పగిస్తాడు, కాబట్టి దాని మీదికి వెళ్లి గెలువు” అని జవాబిచ్చాడు.
16అందుకు రాజు “నీతో ప్రమాణం చేయించి యెహోవా పేరును బట్టి, సత్యమే చెప్పాలని నేనెన్నిసార్లు నీతో చెప్పాలి?” అన్నాడు.
17మీకాయా “ఇశ్రాయేలీయులంతా కాపరిలేని గొర్రెల్లాగా కొండల మీద చెదరి పోవడం నేను చూశాను. వారికి కాపరి లేడు. అందరూ ఎవరింటికి వాళ్ళు ప్రశాంతంగా వెళ్లిపోవచ్చు అని యెహోవా చెబుతున్నాడు” అన్నాడు.
18అప్పుడు ఇశ్రాయేలు రాజు, యెహోషాపాతుతో “ఇతడు నా గురించి మంచి జరుగుతుందని ప్రవచించకుండా కేవలం చెడే జరుగుతుందని ప్రవచిస్తాడని నేను నీతో చెప్పలేదా” అన్నాడు.
19అప్పుడు మీకాయా ఇలా అన్నాడు. “యెహోవా చెప్పే మాట ఇప్పుడు వినండి, యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. పరలోక సమూహమంతా ఆయన కుడి వైపు, ఎడమ వైపు, నిలబడి ఉన్నారు.
20‘అహాబు రామోత్గిలాదు మీదికి వెళ్లి అక్కడ ఓడిపోయేలా అతన్ని ఎవడు ప్రేరేపిస్తాడు’ అని యెహోవా అడిగాడు. ఒకడు ఒక రకంగా ఇంకొకడు ఇంకొక రకంగా చెబుతున్నారు.
21అప్పుడు ఒక ఆత్మ ముందుకు వచ్చి యెహోవా ఎదుట నిలబడి ‘నేనతన్ని ప్రేరేపిస్తాను’ అన్నాడు. యెహోవా, ‘ఎలా’ అని అతన్ని అడిగాడు.
22అందుకతడు ‘నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మగా ఉంటాను’ అని చెప్పాడు. ఆయన, ‘నీవు అతన్ని ప్రేరేపిస్తావు, నీ ప్రయత్నం సఫలమవుతుంది. వెళ్లి అలా చెయ్యి’ అన్నాడు.
23చూడండి, నీకు చెడు జరుగుతుందని యెహోవా నిర్ణయించి ఈ నీ ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మను ఉంచాడు.”
24కెనయనా కొడుకు సిద్కియా అతని దగ్గరికి వచ్చి “నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా దగ్గర నుంచి ఏ వైపు పోయాడు” అని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టాడు.
25అందుకు మీకాయా “దాక్కోడానికి నీవు లోపలి గదుల్లోకి చొరబడే రోజున తెలుసుకుంటావు” అన్నాడు.
26అప్పుడు ఇశ్రాయేలు రాజు “మీకాయాను పట్టుకుని తీసికెళ్లి పట్టాణాధికారి ఆమోనుకూ, నా కొడుకు యోవాషుకూ అప్పచెప్పండి.
27వాళ్ళతో ఇలా చెప్పండి రాజు ఇలా అంటున్నాడు. ఇతన్ని చెరసాలలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకూ అతనికి కేవలం కొద్దిగా రొట్టె, కొంచెం మంచినీళ్లు ఇవ్వండి.”
28అప్పుడు మీకాయా “నీవు క్షేమంగా తిరిగి వస్తే యెహోవా నాద్వారా మాట్లాడలేదన్నట్టే. ఓ ప్రజలారా, ఈ విషయం వినండి” అన్నాడు.

Read 1 రాజులు 221 రాజులు 22
Compare 1 రాజులు 22:3-281 రాజులు 22:3-28