1జ్ఞానం కేకలు పెడుతూ ఉంది. వివేకం పెద్దగా తన స్వరం వినిపిస్తూ ఉంది.
2రహదారుల్లో, ప్రధాన వీధుల్లో, పట్టణ దారులు కలిసే కూడలిలో అది నిలబడి ఉంది.
3నగర ప్రధాన ద్వారం దగ్గర, ఇంటి గుమ్మాల దగ్గర, పట్టణపు కేంద్రాల దగ్గర నిలబడి జ్ఞానం బిగ్గరగా ఇలా ప్రకటిస్తూ ఉంది.
4“మనుషులారా, ఈ మాటలు మీకోసమే. మనుషులైన మీకే నా మాటలు వినిపిస్తున్నాను.
5జ్ఞానం లేని మనుషులారా, జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోండి. బుద్ధిహీనులారా, బుద్ధి అంటే ఎలాంటిదో ఆలోచించి గ్రహించండి.
6వినండి, నేను అతి ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను. నా పెదవులు యథార్థమైన మాటలు మాట్లాడతాయి.
7నేను నిజమైన మాటలు చెబుతాను. చెడుతనం అంటే నాకు అసహ్యం.
8న్యాయమైన మాటలే నేను చెబుతాను. నేను చెప్పే మాటల్లో కపటం, మూర్ఖత్వం ఏమీ ఉండదు.
9నా మాటలన్నీ వివేకం గలవాడికి తేటగా అర్థం అవుతాయి. తెలివి గలవాడు న్యాయం గ్రహిస్తాడు.
10వెండి కోసం, స్వచ్ఛమైన బంగారం కోసం ఆశ పడకుండా నా ఉపదేశం అంగీకరించి, తెలివితేటలు సంపాదించుకోండి.
11విలువైన ముత్యాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. జ్ఞానంతో అత్యంత విలువైన ధన సంపదలు సాటిరావు.
12నాలో జ్ఞానం, వివేకం నివసిస్తున్నాయి. మంచి చెడ్డలు ఏమిటో నేను గ్రహించగలను.
13దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం.
14అమితమైన జ్ఞానం, వివేకంతో కూడిన ఆలోచనలు నేనే అనుగ్రహిస్తాను. జ్ఞానానికి బల ప్రభావాలకు ఆధారం నేనే.
15నా మూలంగా రాజులు పరిపాలిస్తారు. అధికారులు న్యాయమైన చట్టాలు నియమిస్తారు.