17దానికి ఆ యజమాని, ‘భలే, మంచి సేవకా! నువ్వు ఈ చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు.
18ఇక రెండవ పనివాడు వచ్చాడు. ‘అయ్యా, మీరిచ్చిన నాణెంతో మరో ఐదు నాణాలు సంపాదించాను’ అన్నాడు.
19యజమాని వాడితో, ‘నువ్వు ఐదు పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు.
20అప్పుడు మరో పనివాడు వచ్చాడు. వాడిలా అన్నాడు, ‘అయ్యా, ఇదిగో నువ్వు ఇచ్చిన నాణెం.
21దీన్ని జాగ్రత్తగా గుడ్డలో కట్టి దాచిపెట్టాను. నువ్వు కఠినుడివని నాకు తెలుసు. నువ్వు పెట్టని చోట తీసుకుంటావు, నాటని చోట పంట కోస్తావు,’ అన్నాడు.
22అందుకా యజమాని, ‘చెడ్డ సేవకా, నీ నోటి మాట పైనే నీకు తీర్పు తీరుస్తాను. నేను పెట్టని చోట తీసుకుంటాను, నాటని చోట పంట కోస్తాను, కఠినుడినని నీకు తెలుసు కదా,
23అలాంటప్పుడు నా డబ్బుని వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు? అలా చేస్తే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునే వాణ్ణి కదా’ అని వాడితో చెప్పి,
24తన దగ్గర ఉన్న వారితో, “వీడి దగ్గర ఉన్న నాణెం తీసేసుకుని పది నాణాలు ఉన్న వాడికివ్వండి’ అన్నాడు.
25దానికి వారు, ‘అయ్యా అతని దగ్గర పది నాణాలు ఉన్నాయి కదా’ అన్నారు.
26అందుకు అతడు, ‘ఉన్న ప్రతి వాడికీ ఇవ్వడం, లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుందని మీకు చెబుతున్నాను.’
27మరోమాట, ‘నేను తమని పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా కళ్ళెదుట వారిని వధించండి’ అన్నాడు.”
28యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు ప్రయాణమై సాగిపోయాడు.
29ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనీ అనే గ్రామాల సమీపానికి వచ్చినపుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు.
30“మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి. దానిలో మీరు ప్రవేశించగానే కట్టి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దాని మీద ఇంతవరకూ ఎవ్వరూ కూర్చోలేదు. దాన్ని విప్పి తోలుకు రండి.
31ఎవరైనా ‘దీన్ని ఎందుకు విప్పుతున్నారు’ అని మిమ్మల్ని అడిగితే ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి” అని చెప్పి వారిని పంపించాడు.
32ఆయన పంపిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే దాన్ని చూశారు.
33ఆ గాడిద పిల్లను విప్పుతుంటే దాని యజమానులు, “మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని వారినడిగారు.
34దానికి వారు, “ఇది ప్రభువుకు కావాలి” అన్నారు.
35తరువాత యేసు దగ్గరికి దాన్ని తోలుకు వచ్చారు. దానిపై తమ బట్టలు వేసి ఆయనను దానిపై కూర్చోబెట్టారు.