Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన

కీర్తన 66

Help us?
Click on verse(s) to share them!
1ప్రధాన సంగీతకారుని కోసం సర్వలోకమా, దేవుని గూర్చి ఆనంద ధ్వనులు చెయ్యి. ఆయన బలమైన నామాన్ని కీర్తించండి.
2ఆయన నామానికి మహిమ ఆపాదించండి. ఆయనకు స్తోత్రాలు చెప్పండి.
3నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ మహా శక్తిని బట్టి నీ శత్రువులు నీకు లోబడతారు.
4లోకమంతా నీకు నమస్కరించి నిన్ను కీర్తిస్తుంది, నీ నామాన్నిబట్టి నిన్ను కీర్తిస్తుంది, అంటూ దేవుణ్ణి ఘనపరచండి. సెలా.
5దేవుని ఆశ్చర్యకార్యాలు వచ్చి చూడండి. మనుషులకు ఆయన చేసే కార్యాలు చూసినప్పుడు ఆయన భీకరుడుగా ఉన్నాడు.
6ఆయన సముద్రాన్ని ఎండిన భూమిగా చేశాడు. ప్రజలు కాలినడకన నదిని దాటారు. అక్కడ ఆయనలో మేము సంతోషించాము.
7ఆయన తన పరాక్రమంతో శాశ్వతంగా ఏలుతాడు. ఆయన కళ్ళు అన్యజాతులను పరిశీలిస్తాయి. తిరుగుబాటుచేసే ప్రజలు తమలో తాము గర్వించవద్దు.
8జనాల్లారా, మా దేవుణ్ణి సన్నుతించండి. స్వరమెత్తి ఆయన కీర్తిని వినిపించండి.
9మా ప్రాణాలను జీవంతో నింపేది ఆయనే. ఆయన మా నడకలు స్థిరంగా ఉంచుతాడు.
10దేవా, నువ్వు మమ్మల్ని పరీక్షించావు. వెండిని పరీక్షించి నిర్మలం చేసినట్టు మమ్మల్ని పరీక్షకు గురిచేశావు.
11మమ్మల్ని ఒక వలలో ఇరుక్కునేలా చేశావు. మా నడుముల మీద పెద్ద బరువు పెట్టావు.
12మనుషులు మా మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు. మేము నిప్పులగుండా నీళ్ళ గుండా నడిచి వెళ్ళాం. అయినా నువ్వు మమ్మల్ని విశాలమైన స్థలానికి రప్పించావు.
13దహనబలులతో నేను నీ మందిరంలోకి వస్తాను.
14నేను బాధల్లో ఉన్నప్పుడు నా పెదాలు, నా నోరు ప్రమాణం చేసిన మొక్కుబడులు నేను నీకు అర్పిస్తాను.
15పొట్టేళ్ల హోమం ఘుమఘుమలతో కొవ్విన జంతువులను నీకు దహనబలిగా అర్పిస్తాను. ఎద్దులను, పోతుమేకలను అర్పిస్తాను.
16దేవునిలో భయభక్తులు గలవారంతా వచ్చి వినండి, ఆయన నా కోసం చేసిన కార్యాలు నేను వినిపిస్తాను.
17ఆయనకు నేను మొరపెట్టాను. అప్పుడే నా నాలుక ఆయన్ని కీర్తించింది.
18నేను నా హృదయంలో పాపాన్ని ఉంచుకుంటే ప్రభువు నా మనవి అంగీకరించడు.

19కానీ దేవుడు నా మనవి అంగీకరించాడు. ఆయన నా విన్నపాన్ని ఆలకించాడు.
20దేవుడు నా ప్రార్థనను తోసిపుచ్చలేదు, నా నుండి తన కృపను తీసివేయలేదు. ఆయనకు స్తుతి కలుగు గాక.