Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన

కీర్తన 68

Help us?
Click on verse(s) to share them!
1ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. దేవుడు లేస్తాడు గాక, ఆయన శత్రువులు చెదరిపోతారు గాక. ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు గాక.
2పొగను చెదరగొట్టినట్టు నువ్వు వారిని చెదరగొట్టు. అగ్నికి మైనం కరిగిపోయేలా దుర్మార్గులు దేవుని సన్నిధిలో కరిగి నశించిపోతారు గాక.
3నీతిమంతులు సంతోషిస్తారు గాక. వారు దేవుని సన్నిధిలో సంతోషించి బహుగా ఆనందిస్తారు గాక.
4దేవుని గూర్చి పాడండి. ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానం చేయండి. యొర్దాను నదీ లోయ ప్రాంతంలో స్వారీ చేసే దేవుని కోసం, ఒక రాజమార్గం ఏర్పాటు చేయండి. ఆయన పేరు యెహోవా. ఆయన ఎదుట పండగ చేసుకోండి.
5తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు.
6దేవుడు ఒంటరి వారిని కుటుంబాలుగా చేస్తాడు. ఆయన బంధకాల్లో ఉన్న వారిని విడిపించి వారిని వృద్ధి చెందిస్తాడు. తిరుగుబాటు చేసే వారి భూములు బీడులైపోతాయి.
7దేవా, నీవు నీ ప్రజలకు ముందుగా బయలుదేరినప్పుడు అరణ్యంలో ప్రయాణించినప్పుడు
8దేవుని సన్నిధిలో ఆయన సీనాయి కొండకు వచ్చినపుడు, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో భూమి వణికింది, ఆకాశాలు వర్షించాయి.
9దేవా, నీ వారసత్వం మీద వర్షం సమృద్ధిగా కురిపించావు. అది అలసి ఉన్నప్పుడు నువ్వు దాన్ని బలపరచావు.
10నీ ప్రజలు దానిలో నివసిస్తారు. దేవా, నీ మంచితనంతో పేదలను అనుగ్రహించావు.
11ప్రభువు ఆజ్ఞాపించాడు. గొప్ప సైన్యం దాన్ని ప్రకటించింది.
12సైన్యాలున్న రాజులు పారిపోతారు. వారు పారిపోతారు. ఇళ్ళలో ఉండే స్త్రీలు దోపుడు సొమ్ము పంచుకుంటారు.
13గువ్వలను వెండితో కప్పినట్టు, వాటి రెక్కలకు పచ్చని బంగారు పూత పూసినట్టు ఉన్న సొమ్ము వారు పంచుకుంటారు. గొర్రెల దొడ్లలో మీలో కొందరు ఎందుకు పడుకుని ఉండిపోయారు?
14సర్వశక్తుడు అక్కడి రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను కొండ మీద మంచు కురిసినట్టు కనిపించింది.
15బాషాను చాలా ఉన్నతమైన పర్వతం. అది అనేక శిఖరాలు ఉన్న పర్వతం.
16శిఖరాలున్న పర్వతాల్లారా, దేవుడు తన నివాసంగా ఏర్పాటు చేసిన పర్వతాన్ని ఎందుకు అంత అసూయగా చూస్తున్నారు? యెహోవా శాశ్వతంగా దానిలో నివసిస్తాడు.
17దేవుని రథాలు వేలాదిగా ఉన్నాయి. సీనాయి కొండపై ఉన్నట్టుగా యెహోవా వాటి మధ్య తన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాడు.
18నీవు ఆరోహణమైపోయావు. బందీలను చెరపట్టుకుపోయావు. మనుషుల నుండి నువ్వు కానుకలు తీసుకున్నావు. యెహోవా, నువ్వు అక్కడ నివసించేలా నీపై తిరుగుబాటు చేసిన వారి నుండి కూడా నువ్వు కానుకలు తీసుకున్నావు.

19ప్రభువుకు స్తుతి కలుగు గాక. ఆయన ప్రతిరోజూ మా భారాలు మోస్తున్నాడు. దేవుడే మా రక్షణకర్త.
20మన దేవుడు మనలను రక్షించే దేవుడు. మన దేవుడైన యెహోవాయే మరణం నుండి తప్పించేవాడు.
21దేవుడు తన శత్రువుల తలలు తప్పక పగలగొడతాడు. ఎడతెగక తప్పులు చేసేవారి నడినెత్తిని ఆయన చితకగొడతాడు.
22ప్రభువు చెబుతున్నాడు, నేను బాషాను నుండి వారిని వెనక్కి రప్పిస్తాను. సముద్ర అగాధాల్లో నుండి వారిని రప్పిస్తాను.
23నువ్వు నీ శత్రువులను అణచివేసి వారి రక్తంలో నీ పాదాలు ముంచుతావు. వారు నీ కుక్కల నాలుకలకు ఆహారమౌతారు.
24దేవా, నీ యాత్రను, పరిశుద్ధ స్థలానికి పోయే నా రాజైన దేవుని యాత్రను వారు చూశారు.
25చుట్టూరా కన్యలు తంబురలు వాయిస్తుండగా పాటలు పాడేవారు ముందుగా నడిచారు. తంతివాద్యాలు వాయించేవారు వారిని వెంబడించారు.
26సమాజాల్లో దేవుణ్ణి స్తుతించండి. ఇశ్రాయేలు సంతానమా, యెహోవాను స్తుతించండి.
27మొదట కనిష్ఠుడైన బెన్యామీను గోత్రం, తరవాత యూదా అధిపతులు, వారి పరివారం ఉంది. జెబూలూను, నఫ్తాలి గోత్రాల అధిపతులు అక్కడ ఉన్నారు.
28నీ దేవుడు నీకు బలం ఇచ్చాడు. దేవా, గతంలో చేసినట్టు నీ శక్తిని మాకు కనపరచు.
29యెరూషలేములోని నీ ఆలయాన్నిబట్టి రాజులు నీ దగ్గరికి కానుకలు తెస్తారు.
30జమ్ముగడ్డిలోని మృగాన్ని, ఆబోతుల గుంపును, దూడల్లాంటి జాతులను ఖండించు. వారు నీకు లోబడి శిస్తుగా వెండి కడ్డీలు తెచ్చేలా వారిని గద్దించు. యుద్ధాలు కోరుకునే వారిని చెదరగొట్టు.
31ఈజిప్టు నుండి రాకుమారులు వస్తారు. ఇతియోపియా దేవుని వైపు తన చేతులు చాచి పరిగెత్తి వస్తుంది.
32భూరాజ్యాలన్నీ దేవుని గూర్చి పాడండి. ప్రభువును కీర్తించండి.
33అనాది కాలం నుండి ఆకాశాలపై స్వారీ చేసే ఆయనను కీర్తించండి. ఆయన తన స్వరం వినిపిస్తాడు. అది బలమైన స్వరం.
34దేవునికి బలాతిశయం ఆపాదించండి. ఆయన మహిమ ఇశ్రాయేలు మీద ఉంది. ఆయన బలం అంతరిక్షంలో ఉంది.
35దేవా, నీ పరిశుద్ధ స్థలాల్లో నువ్వు భీకరుడివి. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల ప్రభావాలను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగు గాక.