Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన

కీర్తన 80

Help us?
Click on verse(s) to share them!
1ప్రధాన సంగీతకారుని కోసం, సోషన్నీము ఏదూత్ (ఒడంబడిక కలువలు) రాగంతో పాడేది. ఆసాపు కీర్తన. ఇశ్రాయేలు కాపరీ! మందలాగా యోసేపును నడిపించేవాడా, విను. కెరూబులకు పైగా ఆసీనుడవైనవాడా, మా మీద ప్రకాశించు.
2ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే గోత్రాల ఎదుట నీ బల ప్రభావాలను చూపించు. వచ్చి మమ్మల్ని కాపాడు.
3దేవా, చెరలోనుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు.
4యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీ ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వెంతకాలం కోపపడతావు?
5కన్నీళ్లు వారికి ఆహారంగా ఇస్తున్నావు. తాగడానికి కడివెడు కన్నీళ్లు వాళ్లకిచ్చావు.
6మా పొరుగువారు మా గురించి ఘర్షణ పడేలా చేస్తున్నావు, మా శత్రువులు తమలోతాము మమ్మల్ని చూసి నవ్వుతున్నారు.
7సేనల ప్రభువైన దేవా, చెరలోనుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు.
8నువ్వు ఈజిప్టులోనుంచి ఒక ద్రాక్షాతీగె తెచ్చావు, ఇతర రాజ్యాలను వెళ్లగొట్టి దాన్ని నాటావు.
9దాని కోసం నేల సిద్ధం చేశావు. అది లోతుగా వేరు పారి దేశమంతా వ్యాపించింది.
10దాని నీడ కొండలను కప్పింది. దాని తీగెలు దేవుని దేవదారు చెట్లను కమ్మేశాయి,
11దాని తీగెలు సముద్రం వరకూ దాని రెమ్మలు యూఫ్రటీసు నది వరకూ వ్యాపించాయి.
12దారిన పోయేవాళ్ళంతా దాని పళ్ళు కోసేలా దాని కంచెలను నువ్వెందుకు పడగొట్టావు?
13అడవిపందులు దాన్ని పాడు చేస్తున్నాయి, పొలంలోని పశువులు దాన్ని మేస్తున్నాయి.
14సేనల ప్రభువైన దేవా, వెనక్కి చూడు. ఆకాశం నుంచి చూచి ఈ ద్రాక్షావల్లిని గమనించు.
15నీ కుడిచెయ్యి నాటింది ఈ వేరునే. ఈ కొమ్మనే నువ్వు పెంచావు.
16దాన్ని నరికి కాల్చివేశారు, నీ గద్దింపుతో నీ శత్రువులు నశించుదురు గాక.
17నీ కుడిచెయ్యి మనిషి మీద ఉంచు. నువ్వు బలపరచిన మానవ పుత్రుని మీద నీ చెయ్యి ఉంచు.
18అప్పుడు మేము నీ దగ్గరనుంచి వెనక్కి వెళ్ళం, మమ్మల్ని బతికించు. అప్పుడు నీ పేరునే ప్రార్థన చేస్తాం.

19యెహోవా, సేనల ప్రభువైన దేవా, చెరలో నుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశించ నివ్వు.