1రండి, యెహోవాకు పాట పాడదాం, మన రక్షణకు ఆధారశిలకు ఆనందంగా పాడదాం.
2కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం.
3యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరికీ పైగా ఉన్న గొప్ప రాజు.
4భూమి అగాధస్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరాలు ఆయనవే.
5సముద్రం ఆయనది. ఆయనే దాన్ని చేశాడు. ఆయన చేతులు పొడి నేలను చేశాయి.
6రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం.
7ఆయన మన దేవుడు. మనం ఆయన పోషించే ప్రజలం. ఆయన చేతికింది గొర్రెలం. ఈ రోజున మీరు ఆయన స్వరం వింటే ఎంత బాగుండు!
8మెరీబా దగ్గర, ఎడారిలో మస్సా దగ్గర ఉన్న సమయంలో మీ పూర్వీకుల్లాగా మీ గుండె కఠినం చేసుకోవద్దు.
9అక్కడ వాళ్ళు నా అధికారాన్ని సవాలు చేశారు నా కార్య కలాపాలు చూసి కూడా నా ఓపికను పరీక్షించారు.