1ప్రధాన సంగీతకారుని కోసం. శోషన్నీము (కలువల రాగం) అనే రాగంలో పాడవలసినది. దావీదు కీర్తన దేవా, నన్ను కాపాడు. నా ప్రాణం మీద నీళ్ళు పొర్లి పారుతున్నాయి.
2లోతైన అగాధంలాంటి ఊబిలో నేను దిగబడిపోతున్నాను. నిలబడలేకుండా ఉన్నాను. లోతైన నీళ్ళలో నేను మునిగిపోయాను. వరదలు నన్ను ముంచెత్తుతున్నాయి.
3నేను కేకలు వేసి అలసిపోయాను, నా గొంతు ఎండిపోయింది. నా దేవుని కోసం కనిపెడుతూ ఉండగా నా కళ్ళు క్షీణించాయి.
4ఏ కారణం లేకుండా నా మీద పగబట్టిన వారు నా తలవెంట్రుకలకంటే ఎక్కువమంది ఉన్నారు. అకారణంగా నాకు శత్రువులై నన్ను చంపాలని చూసేవారు అనేకమంది. నేను దోచుకోని దాన్ని నేను తిరిగి ఇవ్వాల్సి వచ్చింది.
5దేవా, నా బుద్ధిహీనత నీకు తెలుసు. నా పాపాలు నీకు తెలియనివి కావు.
6దేవా, సేనల ప్రభువైన యెహోవా, నీ కోసం ఎదురు చూసే వారికి నా మూలంగా సిగ్గు కలగనీయవద్దు. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదికే వారు నా మూలంగా అవమానం పాలు కానీయకు.
7నీ కోసం నేను నిందలు పడ్డాను. నీ కోసమే నేను సిగ్గు పడాల్సి వచ్చింది.
8నా సోదరులకు నేను పరాయివాణ్ణి అయ్యాను. నా తల్లి కొడుకులకు పరదేశిని అయ్యాను.
9నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినివేసింది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి.
10నేను ఉపవాసముండి ఏడ్చినపుడు నా ఆత్మకు అది నింద కారణమైంది.
11నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు అపహాస్యం చేశారు.
12నగర ద్వారాల్లో కూర్చున్నవారు నన్ను గురించే మాట్లాడుకుంటున్నారు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడతారు.
13యెహోవా, నీకే నేను ప్రార్థన చేస్తున్నాను. అనుకూల సమయంలో జవాబివ్వు. దేవా, నమ్మదగిన నీ రక్షణ సత్యాన్ని బట్టి నాకు జవాబు దయచెయ్యి.
14ఊబిలోనుండి నన్ను తప్పించు. నన్ను మునిగి పోనీయకు. నన్ను ద్వేషించే వారి చేతినుండి, లోతైన జలాల నుండి నన్ను తప్పించు.