1ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. సర్వ ప్రజలారా! ఈ సంగతి వినండి. ప్రపంచంలో నివసించే వాళ్ళంతా ధ్యాస పెట్టి వినండి.
2అల్పులూ అధికులూ సంపన్నులూ పేదలూ మీరంతా వినండి.
3నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. నా హృదయం వివేకం గూర్చి ధ్యానిస్తుంది.
4ఒక ఉపమానం నా చెవికి వినిపిస్తుంది. సితారాతో ఆ ఉపమానాన్ని ప్రారంభిస్తాను.
5నా చుట్టూ ఉన్నవాళ్ళ దోషాలు నా కాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు చెడ్డ రోజులకు నేనెందుకు భయపడాలి?
6వాళ్ళు విస్తరించిన తమ సంపదలను గూర్చి చెప్పుకుంటారు. తమ ఆస్తులనే నమ్ముకుంటారు.
7వాళ్ళలో ఎవడూ తన సోదరుణ్ణి రక్షించుకోలేడు. తన సోదరుడి కోసం ఎవడూ దేవునికి బంధ విముక్తి వెల చెల్లించలేడు.
8ఎందుకంటే ఒక వ్యక్తి జీవిత విమోచనకు చాలా వ్యయం అవుతుంది. అది ఎప్పుడైనా ఎంతో వ్యయంతో కూడుకున్నది.
9ఎవరూ తన శరీరం కుళ్ళిపోకుండా కలకాలం జీవించరు.
10వాడు తన క్షయాన్ని చూస్తాడు. జ్ఞానులు చనిపోతారు. మూర్ఖుడూ, క్రూరుడూ ఒక్కలాగే నశించిపోతారు. తమ సంపదలను ఇతరులకు విడిచిపెట్టి పోతారు.
11వాళ్ళు తమ కుటుంబాలు నిరంతరం నిలిచి ఉంటాయనీ, తాము కాపురమున్న ఇళ్ళు అన్ని తరాలకీ ఉంటాయనీ తమ అంతరంగంలో ఆలోచిస్తారు. తాము ఉంటున్న స్థలాలకు తమ స్వంత పేర్లు పెట్టుకుంటారు.
12కానీ మనిషన్నవాడు ఎంత సంపన్నుడైనా శాశ్వతంగా సజీవంగా ఉండడు. మృగాల్లాగానే వాడూ నశించిపోతాడు.
13ఈ మార్గం వాళ్ళ మార్గం. అవివేక మార్గం. అయినా మనుషులు వాళ్ళ వాదనలను ఆమోదిస్తూ ఉంటారు.