1ప్రధాన సంగీతకారుడి కోసం. దావీదు కీర్తన యెహోవా కోసం నేను సహనంతో వేచి ఉన్నాను. ఆయన నా మాటలు విన్నాడు. నా మొర ఆలకించాడు.
2భీకరమైన గుంటలో నుండి, జారుడు మట్టితో నిండి ఉన్న ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. నా పాదాలను రాయిపై నిలబెట్టాడు. నా అడుగులు స్థిరం చేశాడు.
3తనకు స్తుతులు చెల్లించే ఒక కొత్త పాటను మన దేవుడు నా నోట్లో ఉంచాడు. అనేకమంది దాన్ని చూసి ఆయన్ని కీర్తిస్తారు. యెహోవాలో నమ్మకముంచుతారు.
4యెహోవాను నమ్ముకోకుండా అబద్దాలను నమ్మేవాళ్ళనూ అహంకారులనూ పట్టించుకోకుండా యెహోవానే తన ఆధారంగా చేసుకున్న వాడు ధన్యజీవి.
5యెహోవా నా దేవా, నువ్వు చేసిన ఆశ్చర్యకరమైన పనులు అసంఖ్యాకంగా ఉన్నాయి. మా కోసం నీకున్న ఆలోచనలు లెక్కించడానికి వీల్లేనంత ఉన్నాయి. ఒకవేళ నేను వాటి గురించి చెప్పాలనుకుంటే అవి లెక్కకు అందనంత ఎక్కువ ఉన్నాయి.