17దేవా, నీ ఆలోచనలు నాకెంతో ప్రశస్తమైనవి. వాటి మొత్తం ఎంతో గొప్పది.
18వాటిని లెక్కపెడదామనుకుంటే అవి ఇసక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి. నిద్ర మేల్కొన్నప్పుడు నేనింకా నీ దగ్గరే ఉన్నాను.
19దేవా, దుష్టులను నువ్వు కచ్చితంగా హతమారుస్తావు. హింసించే వాళ్ళంతా నా దగ్గర నుండి వెళ్ళిపొండి.
20వాళ్ళు దుష్ట తలంపులు మనసులో ఉంచుకుని నీపై తిరగబడతారు. నీ శత్రువులు అబద్ధాలాడతారు.
21యెహోవా, నిన్ను ద్వేషించే వాళ్ళను నేను ద్వేషిస్తున్నాను గదా. నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళను నేను అసహ్యించుకుంటున్నాను గదా.
22వాళ్ళ మీద నాకు తీవ్రమైన ద్వేషం ఉంది. వాళ్ళు నాకు శత్రువులు.
23దేవా, నన్ను పరిశోధించు. నా హృదయంలో ఏమున్నదో పరిశీలించి చూడు. నన్ను పరీక్షించి నా ఆలోచనలు ఎలాంటివో తెలుసుకో.
24నీకు బాధ కలిగించే విధానాలు నేను అనుసరిస్తున్నానేమో నన్ను పరిశీలించు. శాశ్వత మార్గంలో నన్ను నడిపించు.