Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - లూకా - లూకా 7

లూకా 7:17-38

Help us?
Click on verse(s) to share them!
17ఆయనను గురించిన ఈ సమాచారం యూదయ ప్రాంతమంతటా ప్రాంతాల్లో వ్యాపించింది.
18యోహాను శిష్యులు ఈ సంగతులన్నటినీ యోహానుకు తెలియజేశారు.
19అప్పుడు యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, “రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం మేము ఎదురు చూడాలా?” అని అడగడానికి వారిని ప్రభువు దగ్గరికి పంపించాడు.
20వారు ఆయన దగ్గరికి వచ్చి, “‘రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం ఎదురు చూడాలా?’ అని అడగమని మమ్మల్ని బాప్తిసమిచ్చే యోహాను నీ దగ్గరికి పంపాడు” అని చెప్పారు.
21అదే సమయంలో ఆయన అనేకమంది రోగులనూ, బాధితులనూ, దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారికి చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు.
22అప్పుడాయన వారికి ఇలా జవాబిచ్చాడు, “వెళ్ళి మీరు చూసిన వాటినీ వినిన వాటినీ యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ట రోగులు బాగుపడుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయిన వారు తిరిగి ప్రాణంతో లేస్తున్నారు. పేదవాళ్ళకు సువార్త ప్రకటన జరుగుతూ ఉంది.
23నా విషయంలో అభ్యంతరాలేమీ లేని వాడు ధన్యుడు.”
24యోహాను దగ్గర నుండి వచ్చిన శిష్యులు వెళ్ళిపోయిన తరువాత యేసు యోహాను గురించి జన సమూహంతో ఇలా చెప్పాడు, “మీరు ఏం చూద్దామని అడవిలోకి వెళ్ళారు? గాలికి ఊగే రెల్లునా?
25అది కాకుంటే మరేం చూడ్డానికి వెళ్ళారు? సన్నని వస్త్రాలు ధరించుకున్నవాడినా? వినండి, విలువైన వస్త్రాలు ధరించుకుని సుఖంగా జీవించే వారు రాజ మందిరాల్లో ఉంటారు.
26అది కాకపోతే ఇంకేం చూద్దామని వెళ్ళారు? ప్రవక్తనా? అవును. కానీ యోహాను ఒక ప్రవక్త కంటే గొప్పవాడని మీకు చెబుతున్నాను.
27‘చూడు! నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీకు ముందుగా నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు’ అని ఎవరిని గురించి రాశారో అతడే ఈ యోహాను.
28స్త్రీ గర్భాన పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడూ లేడు. అయినా దేవుని రాజ్యంలో అల్పుడు అతని కంటే గొప్పవాడని మీతో చెబుతున్నాను.”
29ప్రజలందరూ, పన్ను వసూలుదారులూ యోహాను సందేశం విని, దేవుడు నీతిమంతుడని అంగీకరించారు. అతని ద్వారా బాప్తిసం పొందారు.
30కానీ పరిసయ్యులూ, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారూ అతని చేత బాప్తిసం పొందకుండా వారి జీవితాల్లో దేవుని సంకల్పాన్ని నిరాకరించారు.
31కాబట్టి ఈ తరం మనుషులను నేను దేనితో పోల్చాలి? వీళ్ళు దేనిలాగా ఉన్నారు?
32సంతవీధుల్లో కూర్చుని, ‘మేము వేణువు ఊదాం, మీరు నాట్యం చేయలేదు, ఏడుపు పాట పాడాం, మీరేమో ఏడవలేదు’ అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆటలాడుకునే చిన్న పిల్లల్లా ఉన్నారు.
33బాప్తిసమిచ్చే యోహాను రొట్టెలు తినకుండా ద్రాక్షారసం తాగకుండా ఉన్నాడని ‘వీడికి దయ్యం పట్టింది’ అని మీరు అంటున్నారు.
34మనుష్య కుమారుడు తింటూ తాగుతూ ఉన్నాడని ‘వీడు తిండిబోతూ, తాగుబోతూ, సుంకరులకూ పాపులకూ స్నేహితుడు’ అంటున్నారు.
35అయితే జ్ఞానం దాని పిల్లలను బట్టి జ్ఞానమని తీర్పు పొందుతుంది.”
36పరిసయ్యుల్లో ఒకడు తనతో భోజనం చేయాలని ఆయనను ఆహ్వానించాడు. ఆయన ఆ పరిసయ్యుడి ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు.
37ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, యేసు పరిసయ్యుడి ఇంట్లో భోజనానికి వచ్చాడని తెలుసుకుని, ఒక బుడ్డిలో అత్తరు తీసుకు వచ్చి
38ఆయనకు వెనుకగా ఆయన పాదాల దగ్గర ఏడుస్తూ నిలబడింది. ఆమె కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిసి పోయాయి. ఆమె తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి వాటిని ముద్దు పెట్టుకుని వాటికి అత్తరు పూసింది.

Read లూకా 7లూకా 7
Compare లూకా 7:17-38లూకా 7:17-38