6నల్లగా ఉన్నానని నన్ను అలా చూడొద్దు. ఎండ తగిలి అలా అయ్యాను. నా సోదరులు నా మీద కోపంగా ఉన్నారు. నన్ను ద్రాక్షతోటలకు కావలిగా ఉంచారు. అయితే నా సొంత ద్రాక్షతోటను నేను కాయలేదు.
7(ఆ యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నా ప్రాణ ప్రియా! నీ మందను నీవెక్కడ మేపుతావో నాకు చెప్పు. మధ్యాహ్నం నీ మందను నీడలో ఎక్కడ ఉంచుతావు? నీ స్నేహితుల మందల దగ్గర అటూ ఇటూ తిరిగే దానిగా నేనెందుకుండాలి?
8(తన ప్రియుడు ఆమెకు జవాబిస్తున్నాడు) జగదేక సుందరీ, నీకు తెలియకపోతే నా మందల అడుగుజాడలను అనుసరించు. కాపరుల డేరాల దగ్గర నీ మేకపిల్లలను మేపుకో.
9నా ప్రేయసీ, ఫరో రథపు గుర్రాల్లోని ఆడ గుర్రంతో నిన్ను పోలుస్తాను.
10ఆభరణాలతో నీ చెక్కిళ్లు, హారాలతో నీ మెడ ఎంత అందంగా ఉంది!
11నీకు వెండి పూలతో బంగారు గొలుసులు చేయిస్తాను.
12(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) రాజు విందుకు కూర్చుని ఉంటే నా పరిమళం వ్యాపించింది.
13నా ప్రియుడు నా స్తనాల మధ్య రాత్రంతా ఉండే బోళం సంచిలా ఉన్నాడు.
14ఏన్గెదీ ద్రాక్షాతోటల్లో కర్పూరపు పూగుత్తుల్లాగా నాకు నా ప్రియుడున్నాడు.
15(ఆమె ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు) ప్రేయసీ, నువ్వు సుందరివి. చాలా అందంగా ఉన్నావు. నీ కళ్ళు అచ్చం గువ్వ కళ్ళే.
16(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నన్ను ప్రేమిస్తున్న నువ్వు అతిమనోహరుడివి. అందగాడివి. పచ్చిక మనకు పాన్పు.