19యెహోవా యూదావంశం వారికి తోడుగా ఉన్నాడు కనుక వాళ్ళు కొండ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మైదాన ప్రాంతాల్లో ఉంటున్నవాళ్లకు ఇనుప రథాలు ఉన్న కారణంగా వాళ్ళను తరిమివేయలేక పోయారు.
20మోషే మాట ప్రకారం హెబ్రోనును కాలేబుకు ఇచ్చినప్పుడు, అతడు ముగ్గురు అనాకు వంశీకులను అక్కడనుంచి పారద్రోలి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
21కాని, బెన్యామీనీయులు యెరూషలేములో ఉంటున్న యెబూసీయులను వెళ్లగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో నేటివరకూ యెరూషలేములో కలిసి నివసిస్తున్నారు.
22యోసేపు సంతతివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.
23పూర్వకాలంలో లూజు అనే పేరుగల బేతేలును వేగు చూడడానికి యోసేపు గోత్రికులు దూతలను పంపినప్పుడు
24ఆ గూఢచారులు, ఆ పట్టణంలోనుంచి ఒకడు రావడం చూసి “దయచేసి ఈ పట్టణంలోకి వెళ్ళే దారి మాకు చూపిస్తే మేము నీకు ఉపకారం చేస్తాం” అని చెప్పారు.
25అతడు ఆ పట్టణంలోకి వెళ్ళే దారి వాళ్లకు చూపించినప్పుడు, వాళ్ళు ఆ పట్టణంలోని వారిని కత్తివాత హతం చేశారు. అయితే, ఆ వ్యక్తిని, అతని కుటుంబంలోని వాళ్ళందరినీ వదిలేశారు.
26ఆ వ్యక్తి, హిత్తీయ దేశానికి వెళ్లి ఒక పట్టణం కట్టించి దానికి లూజు అనే పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ దాని పేరు అదే.
27మనష్షె గోత్రంవారు బేత్షెయానును, తయినాకును, దోరును, ఇబ్లెయామును, మెగిద్దో పట్టణాలను, వాటి పల్లెలను వశం చేసుకోలేదు. ఎందుకంటే కనానీయులు ఆ ప్రదేశంలోనే ఉండాలని తెగించి పోరాడారు.
28ఇశ్రాయేలీయులు బలం పుంజుకున్న తరువాత కనానీయులతో వెట్టిపనులు చేయించుకున్నారు గాని వాళ్ళను పూర్తిగా వెళ్ళగొట్టలేదు.
29ఎఫ్రాయిమీయులు గెజెరులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు. గెజెరులో కనానీయులు వాళ్ళ మధ్యే నివాసం ఉన్నారు.
30జెబూలూనీయులు కిత్రోనులో ఉన్నవాళ్ళను, నహలోలు నివాసులను వెళ్లగొట్ట లేదు. కనానీయులు వారి మధ్యే ఉంటూ వాళ్లకు వెట్టిపనులు చేసేవాళ్ళుగా ఉన్నారు.
31ఆషేరీయులు అక్కోలో ఉన్నవాళ్ళను, సీదోనులో ఉన్నవాళ్ళను, అహ్లాబు వారిని, అక్జీబు వారిని, హెల్బావారిని, అఫెకు వారిని, రెహోబు వారిని,
32ఆ ప్రదేశంలో ఉన్న కనానీయులను వెళ్లగొట్టకుండా వాళ్ళ మధ్యనే నివాసం ఉండనిచ్చారు. నఫ్తాలీయులు బేత్షెమెషు వారిని బేతనాతు వారిని వెళ్లగొట్ట లేదు,
33బేత్షెమెషులో ఉన్న వాళ్ళ చేత, బేతనాతులో ఉన్నవాళ్ళ చేత వెట్టి పనులు చేయించుకున్నారు.
34అమోరీయులు దానీయులను మైదాన ప్రాంతానికి రానివ్వకుండా కొండ ప్రదేశానికి వెళ్ళగొట్టారు.