50తన కోపానికి దారి చదునుగా చేశాడు. వారిని మరణం నుండి తప్పించకుండా వారి ప్రాణాన్ని తెగులుకు అప్పగించాడు.
51ఈజిప్టులోని పెద్ద కొడుకులందరినీ హాము గుడారాల్లో వారి బలానికి గుర్తుగా ఉన్న ప్రథమ సంతానాన్ని ఆయన చంపాడు.
52ఆ తరవాత ఆయన తన ప్రజలను గొర్రెలను తోలినట్టుగా నడిపించాడు. ఒకడు తన మందను ఎలా నడిపిస్తాడో అరణ్యంలో ఆయన వారిని అలా నడిపించాడు.
53వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాడు. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాడు.
54తన పరిశుద్ధ భూమి సరిహద్దు దగ్గరికి, తన కుడిచెయ్యి సంపాదించిన ఈ పర్వతం దగ్గరికి ఆయన వారిని రప్పించాడు.
55వారి ఎదుట నుండి అన్య జాతులను వెళ్లగొట్టాడు. ఆ ప్రజల వారసత్వాన్ని వారికి పంచి ఇచ్చాడు. ఇశ్రాయేలు గోత్రాలను వారి గుడారాల్లో స్థిరపరిచాడు.
56అయినప్పటికీ వారు మహోన్నతుడైన దేవుణ్ణి పరీక్షించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనాలను పాటించలేదు.
57తమ పూర్వికుల్లాగా వారు అపనమ్మకస్తులై ద్రోహం చేశారు. పనికిరాని విల్లులాగా నిష్ప్రయోజకులయ్యారు.
58వారు ఉన్నత స్థలాల్లో దేవస్థానాలు నిలిపి ఆయనకు కోపం పుట్టించారు. విగ్రహాలు నిలబెట్టి ఆయనకు రోషం కలిగించారు.
59దాన్ని చూసిన దేవుడు ఆగ్రహించి ఇశ్రాయేలును పూర్తిగా తోసిపుచ్చాడు.
60షిలోహు పట్టణంలో మందిరాన్ని, తాను మనుషులతో కలిసి నివసించిన గుడారాన్ని విడిచిపెట్టాడు.