11యెహోవా ప్రణాళికలు నిత్యమూ అమలవుతాయి. ఆయన తన హృదయంలో అన్ని తరాల కోసం ఆలోచనలు చేస్తాడు.
12యెహోవా ఏ ప్రజలకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజలు ధన్యజీవులు. తనకు సొత్తుగా ఆయన ఎంచుకున్న జనం ధన్యజీవులు.
13ఆకాశం నుండి యెహోవా చూస్తున్నాడు. ఆయన మనుషులందర్నీ పరికించి చూస్తున్నాడు.
14తాను నివాసమున్న చోటు నుండి ఆయన భూమిపై నివసిస్తున్న వాళ్ళందర్నీ చూస్తున్నాడు.
15అందరి హృదయాలనూ మలచిన వాడు వాళ్ళు చేసే పనులన్నిటినీ గమనిస్తున్నాడు.
16ఏ రాజూ తనకున్న అపారమైన సైన్యం వల్ల రక్షణ పొందలేడు. యోధుడు తనకున్న గొప్ప శక్తి వల్ల తనను తాను రక్షించుకోలేడు.
17గుర్రం విజయానికి పూచీ కాదు. దానికి గొప్ప శక్తి ఉన్నప్పటికీ అది ఎవర్నీ రక్షించలేదు.
18చూడండి, వాళ్ళ ప్రాణాలను మరణం నుండి తప్పించడానికీ, కరువులో వాళ్ళను సజీవులుగా నిలబెట్టడానికీ,
19యెహోవా పట్ల భయభక్తులుగల వాళ్ళ పైనా నిబంధన పట్ల ఆయనకున్న నిబద్ధతపై ఆధారపడే వాళ్ల పైనా ఆయన కనుచూపు నిలిచి ఉంది.
20మనం యెహోవా కోసం వేచి చూస్తున్నాం. మన సహాయమూ భద్రతా ఆయనే.
21మన హృదయాలు ఆయనలో ఆనందిస్తున్నాయి. ఆయన పవిత్ర నామంపై మన నమ్మకం ఉంది.