3నువ్వు పవిత్రుడవు. ఇశ్రాయేలు చేసే స్తుతులతో రాజుగా సింహాసనం మీద కూర్చుని ఉంటావు.
4మా పితరులు నీలో నమ్మకం ఉంచారు. నువ్వు వాళ్ళను రక్షించావు.
5వాళ్ళు నీకు మొరపెట్టినప్పుడు విడుదల పొందారు. వాళ్ళు నీలో నమ్మకం ఉంచి నిరుత్సాహపడలేదు.
6కాని నేను మనిషిని కాదు. పురుగును. మనుషుల ద్వేషం అనుభవించాను, మానవాళికి అవమానంగా ఉన్నాను.
7నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను ఆక్షేపిస్తున్నారు. నన్ను వెక్కిరిస్తూ, నన్ను చూసి తలలు ఆడిస్తున్నారు.
8అతడు యెహోవాలో నమ్మకం పెట్టుకున్నాడు, యెహోవా అతన్ని రక్షించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తున్నాడు గనక యెహోవా అతన్ని రక్షించనివ్వండి, అని వాళ్ళు అంటున్నారు.
9ఎందుకంటే గర్భంలోనుంచి నన్ను తీసిన వాడివి నువ్వే. నేను నా తల్లి రొమ్ములపై ఉన్నప్పుడే నీపై నమ్మకం పుట్టించావు.
10గర్భంలో ఉండగానే నేను నీ మీద ఆధారపడ్డాను. నేను నా తల్లి కడుపులో ఉన్నప్పటినుంచి నువ్వే నా దేవుడివి.
11ఆపద ముంచుకు వచ్చింది. నాకు దూరంగా ఉండకు. నాకు సహాయం చేసేవాళ్ళు లేరు.
12చాలా ఎద్దులు, బలమైన బాషాను దేశపు వృషభాలు నన్ను చుట్టుముట్టాయి.
13వేటను చీలుస్తూ, గర్జిస్తూ ఉన్న సింహంలాగా వాళ్ళు తమ నోళ్లు పెద్దగా తెరిచారు.
14నన్ను నీళ్ళలా పారబోస్తున్నారు. నా ఎముకలన్నీ స్థానం తప్పాయి. నా హృదయం మైనంలా ఉంది. నా అంతర్భాగాల్లో అది కరిగిపోతూ ఉంది.
15నా బలం చిల్లపెంకులా ఎండిపోయింది. నా నాలుక నా దవడకు అంటుకుంటూ ఉంది. మరణ ధూళిలో నువ్వు నన్ను పడుకోబెట్టావు.