61భక్తిహీనుల పాశాలు నన్ను చుట్టుకుని ఉన్నా నీ ధర్మశాస్త్రాన్ని నేను విస్మరించ లేదు.
62న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్థరాత్రివేళ నేను నిద్ర లేస్తున్నాను.
63నీపట్ల భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశాలను అనుసరించే వారికీ నేను నెచ్చెలిని.
64తేత్ యెహోవా, భూమి నీ నిబంధన విశ్వాస్యతతో నిండి ఉంది. నీ కట్టడలను నాకు బోధించు.
65యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేశావు.
66నేను నీ ఆజ్ఞలపై నమ్మిక ఉంచాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్చు.
67బాధ కలగక మునుపు నేను దారి విడిచాను. ఇప్పుడు నీ వాక్కు ననుసరించి నడుచుకుంటున్నాను.
68నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు. నీ కట్టడలను నాకు బోధించు.
69గర్విష్ఠులు నా మీద అబద్ధాలు అల్లుతున్నారు. అయితే పూర్ణహృదయంతో నేను నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
70వారి హృదయం కొవ్వెక్కి బండబారిపోయింది. నేను నీ ధర్మశాస్త్రాన్నిబట్టి ఆనందిస్తున్నాను.
71బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను.
72వేవేల వెండి బంగారు నాణాలకంటే నీ విచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు.
73యోద్ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచాయి. నేను నీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు బుద్ధి దయ చెయ్యి.
74నీ వాక్కు మీద నేను ఆశపెట్టుకున్నాను. నీపట్ల భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు.
75యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనీ నీవు నన్ను బాధపరచింది నీ నమ్మకత్వం వల్లనే అనీ నాకు తెలుసు.
76నీ సేవకుడికి నీవిచ్చిన మాట చొప్పున నీ నిబంధన విశ్వాస్యత నన్ను ఆదరించు గాక.
77నీ ధర్మశాస్త్రం నాకు సంతోషదాయకం. నేను బ్రతికేలా నీ కరుణాకటాక్షాలు నాకు కలుగు గాక.
78నేను నీ ఉపదేశాలను ధ్యానిస్తున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధాలాడినందుకు వారు సిగ్గుపడతారు గాక.
79నీపట్ల భయభక్తులుగలవారూ నీ శాసనాలను తెలుసుకునే వారూ నా పక్షంగా ఉంటారు గాక.
80నేను సిగ్గుపడకుండేలా నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉండు గాక.
81కఫ్ నీ రక్షణ కోసం నా ప్రాణం సొమ్మసిల్లిపోతున్నది. నేను నీ వాక్కు మీద ఆశపెట్టుకున్నాను.
82నన్ను ఎప్పుడు ఆదరిస్తావా అని నా కళ్ళు నీవిచ్చిన మాట కోసం కనిపెట్టి క్షీణించిపోతున్నాయి.
83నేను పొగ పట్టిన ద్రాక్ష తిత్తిలాగా అయిపోయాను. అయినా నీ కట్టడలను నేను మరచిపోవడం లేదు.
84నీ సేవకుడి దినాలు ఎంత తగ్గిపోయాయి! నన్ను తరిమే వారికి నీవు తీర్పు తీర్చడం ఎప్పుడు?
85నీ ధర్మశాస్త్రాన్ని లెక్క చెయ్యని గర్విష్ఠులు నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు.
86నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు అకారణంగా నన్ను తరుముతున్నారు. నాకు సహాయం చెయ్యి.
87భూమి మీద ఉండకుండా వారు నన్ను దాదాపుగా నాశనం చేసేశారు. అయితే నీ ఉపదేశాలను నేను విడిచిపెట్టడం లేదు.
88నీవు నియమించిన శాసనాన్ని నేను అనుసరించేలా నీ నిబంధన విశ్వాస్యత చేత నన్ను బ్రతికించు.