128నీ ఉపదేశాలన్నీ యథార్థమని నేను వాటిని శిరసావహిస్తున్నాను. అబద్ధ మార్గాలన్నీ నాకు అసహ్యం.
129పే నీ శాసనాలు ఆశ్చర్యకరమైనవి. అందుకే నేను వాటిని పాటిస్తున్నాను.
130నీ వాక్కులు వెల్లడి కావడంతోనే వెలుగు ఉదయిస్తుంది. అవి తెలివిలేని వారికి తెలివినిస్తాయి.
131నీ ఆజ్ఞలపట్ల తీవ్ర వాంఛ చేత నేను నోరు తెరచి వగరుస్తూ ఉన్నాను.
132నీ నామాన్ని ప్రేమించేవారికి నీవు చేసే విధంగా నావైపు తిరిగి నన్ను కరుణించు.
133నీ వాక్కునుబట్టి నా అడుగులు స్థిరపరచు. ఏ పాపం నన్ను ఏలనియ్యకు.
134నీ ఉపదేశాలను నేను అనుసరించేలా మనుష్యుల బలాత్కారం నుండి నన్ను విడిపించు.
135నీ సేవకుడి పై నీ ముఖకాంతి ప్రకాశింపనియ్యి. నీ కట్టడలను నాకు బోధించు.
136ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించక పోవడం చూసి నేను కన్నీరుమున్నీరైపోతున్నాను.
137సాదె యెహోవా, నీవు నీతిమంతుడివి. నీ న్యాయవిధులు యథార్థం.
138నీతినిబట్టి, పూర్ణ విశ్వాస్యతనుబట్టి, నీ శాసనాలను నీవు నియమించావు.
139నా విరోధులు నీ వాక్కులు మరచిపోతారు. అందువలన నా ఆసక్తి నన్ను తినేస్తున్నది.
140నీ మాట ఎంతో స్వచ్ఛమైనది. అది నీ సేవకుడికి ప్రియమైనది.
141నేను అల్పుణ్ణి. నిరాకరణకు గురి అయిన వాణ్ణి. అయినా నీ ఉపదేశాలను నేను మరువను.
142నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం.
143బాధ, వేదన నన్ను పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
144నీ శాసనాలు శాశ్వత నీతిగలవి. నేను బ్రతికేలా నాకు తెలివి దయచెయ్యి.
145ఖొఫ్ యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్ర పెడుతున్నాను. నీ కట్టడలను నేను పాటించేలా నాకు జవాబు ఇవ్వు.
146నేను నీకు మొర్ర పెడుతున్నాను. నీ శాసనాల ప్రకారం నేను నడుచుకునేలా నన్ను రక్షించు.
147తెల్లవారకమునుపే మొర్రపెట్టాను. నీ మాటలపై నేను ఆశపెట్టుకున్నాను
148నీవిచ్చిన వాక్కును నేను ధ్యానించడానికి నాకళ్ళు రాత్రిజాములు గడవక ముందే తెరుస్తాను.
149నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించు. యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రతికించు.
150దుష్కార్యాలు చేసే వారు, నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నన్ను సమీపిస్తున్నారు.
151యెహోవా, నీవు దగ్గరగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి.
152నీ శాసనాలను నీవు శాశ్వతంగా స్థిరపరిచావు అని నేను పూర్వం నుండి వాటిమూలంగానే తెలుసుకున్నాను.
153రేష్ నేను నీ ధర్మశాస్త్రాన్ని మరిచిపోయేవాణ్ణి కాదు. నా బాధను గమనించి నన్ను విడిపించు.
154నా పక్షంగా వ్యాజ్యెమాడి నన్ను విమోచించు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు.
155భక్తిహీనులు నీ కట్టడలను వెదకడం లేదు గనక రక్షణ వారికి దూరంగా ఉంది.
156యెహోవా, నీ దయాదాక్షిణ్యాలు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించు.
157నన్ను తరిమేవారు, నా విరోధులు చాలా మంది. అయినా నీ న్యాయశాసనాలనుండి నేను తొలగకుండా ఉన్నాను.
158ద్రోహులను చూసి నేను అసహ్యించుకున్నాను. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.
159యెహోవా, చిత్తగించు. నీ ఉపదేశాలు నాకెంతో ప్రీతికరం. నీ కృపచొప్పున నన్ను బ్రతికించు.
160నీ వాక్య సారాంశం సత్యం. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యం నిలిచే ఉంటాయి.
161షీన్ అధికారులు వట్టి పుణ్యానికి నన్ను తరుముతారు. అయినా నీ వాక్యభయం నా హృదయంలో నిలిచి ఉంది.
162పుష్కలంగా దోపుడుసొమ్ము సంపాదించిన వాడిలాగా నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను.
163అబద్ధం నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.
164నీ న్యాయవిధులనుబట్టి రోజుకు ఏడు సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను.
165నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారికి ఎంతో నెమ్మది ఉంది. వారు తూలి తొట్రిల్లే కారణం ఏమీ లేదు
166యెహోవా, నీ రక్షణ కోసం నేను కనిపెడుతున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను.
167నేను నీ శాసనాలనుబట్టి ప్రవర్తిస్తున్నాను. అవి నాకు ఎంతో ఇష్టం.
168నా మార్గాలన్నీ నీ ఎదురుగా ఉన్నాయి. నీ ఉపదేశాలను నీ శాసనాలను నేను అనుసరిస్తున్నాను.