Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - 1 రాజులు - 1 రాజులు 22

1 రాజులు 22:18-35

Help us?
Click on verse(s) to share them!
18అప్పుడు ఇశ్రాయేలు రాజు, యెహోషాపాతుతో “ఇతడు నా గురించి మంచి జరుగుతుందని ప్రవచించకుండా కేవలం చెడే జరుగుతుందని ప్రవచిస్తాడని నేను నీతో చెప్పలేదా” అన్నాడు.
19అప్పుడు మీకాయా ఇలా అన్నాడు. “యెహోవా చెప్పే మాట ఇప్పుడు వినండి, యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. పరలోక సమూహమంతా ఆయన కుడి వైపు, ఎడమ వైపు, నిలబడి ఉన్నారు.
20‘అహాబు రామోత్గిలాదు మీదికి వెళ్లి అక్కడ ఓడిపోయేలా అతన్ని ఎవడు ప్రేరేపిస్తాడు’ అని యెహోవా అడిగాడు. ఒకడు ఒక రకంగా ఇంకొకడు ఇంకొక రకంగా చెబుతున్నారు.
21అప్పుడు ఒక ఆత్మ ముందుకు వచ్చి యెహోవా ఎదుట నిలబడి ‘నేనతన్ని ప్రేరేపిస్తాను’ అన్నాడు. యెహోవా, ‘ఎలా’ అని అతన్ని అడిగాడు.
22అందుకతడు ‘నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మగా ఉంటాను’ అని చెప్పాడు. ఆయన, ‘నీవు అతన్ని ప్రేరేపిస్తావు, నీ ప్రయత్నం సఫలమవుతుంది. వెళ్లి అలా చెయ్యి’ అన్నాడు.
23చూడండి, నీకు చెడు జరుగుతుందని యెహోవా నిర్ణయించి ఈ నీ ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మను ఉంచాడు.”
24కెనయనా కొడుకు సిద్కియా అతని దగ్గరికి వచ్చి “నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా దగ్గర నుంచి ఏ వైపు పోయాడు” అని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టాడు.
25అందుకు మీకాయా “దాక్కోడానికి నీవు లోపలి గదుల్లోకి చొరబడే రోజున తెలుసుకుంటావు” అన్నాడు.
26అప్పుడు ఇశ్రాయేలు రాజు “మీకాయాను పట్టుకుని తీసికెళ్లి పట్టాణాధికారి ఆమోనుకూ, నా కొడుకు యోవాషుకూ అప్పచెప్పండి.
27వాళ్ళతో ఇలా చెప్పండి రాజు ఇలా అంటున్నాడు. ఇతన్ని చెరసాలలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకూ అతనికి కేవలం కొద్దిగా రొట్టె, కొంచెం మంచినీళ్లు ఇవ్వండి.”
28అప్పుడు మీకాయా “నీవు క్షేమంగా తిరిగి వస్తే యెహోవా నాద్వారా మాట్లాడలేదన్నట్టే. ఓ ప్రజలారా, ఈ విషయం వినండి” అన్నాడు.
29ఇశ్రాయేలు రాజు, యూదారాజు యెహోషాపాతు, రామోత్గిలాదు మీదికి వెళ్ళారు.
30ఇశ్రాయేలురాజు “నేను మారువేషం వేసుకుని యుద్ధానికి వెళ్తాను. నువ్వైతే నీ రాజ వస్త్రాలు ధరించుకో” అని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకుని యుద్ధానికి వెళ్ళాడు.
31సిరియారాజు తన రథాల మీద అధికారులైన ముప్ఫై రెండు మందిని పిలిపించి “సాధారణ సైనికులతో గానీ ప్రధాన సైనికులతో గానీ మీరు యుద్ధం చేయొద్దు. ఇశ్రాయేలు రాజుతో మాత్రమే యుద్ధం చేయండి” అన్నాడు.
32రథాధిపతులు యెహోషాపాతును చూసి “కచ్చితంగా ఇతడే ఇశ్రాయేలు రాజు” అనుకుని అతనితో యుద్ధం చేయడానికి అతని మీదికొచ్చారు. యెహోషాపాతు పెద్దగా కేకలు పెట్టాడు.
33రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతన్ని తరమడం మానేశారు.
34అయితే ఒకడు తన విల్లు తీసి గురి చూడకుండానే బాణం వేస్తే అది ఇశ్రాయేలు రాజు కవచం అతుకు మధ్య తగిలింది. కాబట్టి అతడు “నాకు పెద్ద గాయమైంది. రథం తిప్పి ఇక్కడనుంచి నన్ను అవతలకు తీసుకు పో” అని తన సారథితో చెప్పాడు.
35ఆరోజు యుద్ధం తీవ్రంగా జరుగుతుంటే, సిరియనులకు ఎదురుగా, రాజు తన రథంలో ఉండిపోయాడు. సాయంకాలానికి అతడు చనిపోయాడు. అతని గాయం నుంచి రక్తం కారి రథం అడుగున నిలిచింది.

Read 1 రాజులు 221 రాజులు 22
Compare 1 రాజులు 22:18-351 రాజులు 22:18-35