1రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి,
2కుమారా, నేనేమంటాను? నేను కన్న కుమారా, నేనేమంటాను? నా మొక్కులు మొక్కి కనిన కుమారా, నేనే మంటాను?
3నీ బలాన్ని స్త్రీలకియ్యకు. రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసం చేయ వద్దు.
4ద్రాక్షారసం తాగడం రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. అధికారులు “ద్రాక్ష మద్యం ఏది?” అని అడగడం తగదు.
5తాగితే వారు చట్టాలను విస్మరిస్తారు. దీనులందరి హక్కులనూ కాలరాస్తారు.
6ప్రాణం పోతున్నవాడికి మద్యం ఇవ్వండి. మనోవేదన గలవారికి ద్రాక్షారసం ఇవ్వండి.
7వారు తాగి తమ పేదరికాన్ని మర్చిపోతారు. తమ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోరు.
8మూగవారి పక్షంగా మాట్లాడు. దిక్కులేని వారికి న్యాయం జరిగేలా నీ నోరు తెరువు.