Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - సంఖ్యా - సంఖ్యా 11

సంఖ్యా 11:20-34

Help us?
Click on verse(s) to share them!
20ఒక నెల రోజులు మీరు మాంసం తింటారు. అది మీ ముక్కు పుటాల్లోంచి బయటకు వచ్చి మీకు అసహ్యం పుట్టే వరకూ తింటారు. మీరు మీ మధ్య ఉన్న యెహోవాను తిరస్కరించారు కాబట్టి అది మీకు వెగటు పుట్టిస్తుంది. ఆయన ముందు మీరు ఏడ్చారు. ‘ఐగుప్తు నుండి ఎందుకు వచ్చాం?’ అన్నారు.”
21దానికి మోషే “నేను ఆరు లక్షలమంది జనంతో ఉన్నాను. నువ్వేమో ‘ఒక నెల అంతా వాళ్లకి మాంసం ఇస్తాను’ అంటున్నావు.
22ఇప్పుడు వారిని తృప్తి పరచడానికి గొర్రెలను, పశువులను చంపాలా? సముద్రంలో ఉన్న చేపలన్నిటినీ వారి కోసం పట్టాలా?” అన్నాడు.
23అప్పుడు యెహోవా మోషేతో “నా బాహుబలానికి శక్తి తగ్గిందా? నా మాట నిజమో కాదో నువ్వు ఇప్పుడే చూస్తావు” అన్నాడు.
24మోషే బయటికి వచ్చి యెహోవా మాటలు ప్రజలకు చెప్పాడు. ప్రజల్లోనుండి 70 మంది పెద్దలను గుడారం చుట్టూ నిలబెట్టాడు.
25అప్పుడు యెహోవా మేఘంలో దిగాడు. అతనితో మాట్లాడాడు. అతని పైన ఉన్న ఆత్మలో ఒక భాగాన్ని పెద్దల పైన ఉంచాడు. ఆత్మ వారిపై ఉన్నప్పుడు వారు ప్రవచనం చెప్పారు. వారంతా ఆ సందర్భంలోనే ప్రవచించారు, ఆ తరువాత ఎప్పుడూ ప్రవచనం చెప్పలేదు.
26ఆ మనుషుల్లో ఇద్దరు శిబిరంలో ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. ఆత్మ వారిపై కూడా నిలిచాడు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి కానీ వారు గుడారం దగ్గరకి వెళ్ళలేదు. అయినా వారి శిబిరంలోనే వారు ప్రవచించారు.
27అప్పుడు శిబిరంలో ఒక యువకుడు మోషే దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి “ఎల్దాదు, మేదాదులు శిబిరంలో ప్రవచిస్తున్నారు” అని చెప్పాడు.
28మోషే సహాయకుడూ, తాను ఎన్నుకున్న వారిలో ఒకడూ, నూను కొడుకూ అయిన యెహోషువ “మోషే, నా యజమానీ, వారిని ఆపు” అన్నాడు.
29దానికి మోషే “నా కోసం నీకు రోషం వచ్చిందా? అసలు యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలని కోరుకుంటున్నాను. దాని కోసం యెహోవా తన ఆత్మని అందరి పైనా ఉంచుతాడు గాక” అని అతనితో చెప్పాడు.
30అప్పుడు మోషే, ఇశ్రాయేలు పెద్దలంతా శిబిరంలోకి వెళ్ళారు.
31అప్పుడు యెహోవా దగ్గరనుండి వాయువు బయల్దేరింది. అది సముద్రం నుండి పూరేడు పిట్టలను తీసుకు వచ్చి శిబిరంలో అంతటా పడవేసింది. ఈ వైపునుండి ఆ వైపుకీ, ఆ వైపునుండి ఈ వైపుకీ ఒక రోజు ప్రయాణమంత దూరం వరకూ అవి వచ్చి పడ్డాయి. అవి భూమికి రెండు మూరల ఎత్తున పడ్డాయి.
32కాబట్టి ప్రజలు ఉదయాన్నే లేచి ఆ రోజంతా వాటిని సేకరించారు. ఆ రాత్రీ మరుసటి రోజు అంతా వాటిని సేకరించారు. నూరు తూముల పిట్టల కంటే తక్కువ సేకరించినవాడు లేడు. తరువాత వారు వాటిని శిబిరం చుట్టూ తమ కోసం పరచి ఉంచారు.
33ఆ మాంసం వారి పళ్ళ మధ్య ఉండగానే, వారు దాన్ని నములుతూ ఉన్నప్పుడే యెహోవా వారిపై ఆగ్రహించాడు. పెద్ద రోగంతో ఆయన వారిని బాధించాడు.
34మాంసం కోసం అతిగా ఆశ పడిన వారిని ప్రజలు ఒక స్థలంలో పాతిపెట్టారు. అందుకే ఆ స్థలానికి “కిబ్రోతు హత్తావా” అనే పేరు కలిగింది.

Read సంఖ్యా 11సంఖ్యా 11
Compare సంఖ్యా 11:20-34సంఖ్యా 11:20-34