Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - సంఖ్యా

సంఖ్యా 1

Help us?
Click on verse(s) to share them!
1యెహోవా సీనాయి అరణ్యంలో ఉన్న సన్నిధి గుడారంలో నుండి మోషేతో మాట్లాడాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం రెండో నెల మొదటి తేదీన జరిగింది. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.
2“ఇశ్రాయేలు ప్రజల జనాభా లెక్కలు వారి వారి వంశాల ప్రకారం, పూర్వీకుల కుటుంబాల ప్రకారం రాయించు. వారి పేర్లు రాయించు.
3ఇశ్రాయేలు రాజ్యం కోసం సైనికులుగా యుద్ధానికి వెళ్ళగలిగిన వారు, ఇరవై ఇంకా ఆ పై వయసున్న పురుషులందరినీ లెక్కపెట్టు. ఒక్కో దళంలో ఎంతమంది పురుషులున్నారో నువ్వూ, అహరోనూ కలసి నమోదు చేయాలి.
4మీతో కలసి సేవ చేయడానికి ఒక్కో గోత్రం నుండి ఒక వ్యక్తి గోత్ర నాయకుడిగా ఉండాలి. అతడు తన తెగలో ప్రముఖుడై ఉండాలి.
5మీతో కలసి పోరాటాల్లో పాల్గొనే నాయకులు వీరు. రూబేను గోత్రం నుండి షెదేయూరు కొడుకు ఏలీసూరు,
6షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు,
7యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను,
8ఇశ్శాఖారు గోత్రం నుండి సూయారు కొడుకు నెతనేలు
9జెబూలూను గోత్రం నుండి హేలోను కొడుకు ఏలీయాబు.
10యోసేపు సంతానమైన ఎఫ్రాయిము గోత్రం నుండి అమీహూదు కొడుకు ఎలీషామాయు, మనష్షే గోత్రం నుండి పెదాసూరు కొడుకు గమలీయేలు,
11బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను,
12దాను గోత్రం నుండి అమీషద్దాయి కొడుకు అహీయెజెరు,
13ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కొడుకు పగీయేలు,
14గాదు గోత్రం నుండి దెయూవేలు కొడుకు ఎలాసాపు
15నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కొడుకు అహీర.”
16వీళ్ళంతా ప్రజల్లోనుండి నియమితులయ్యారు. వీరు తమ పూర్వీకుల గోత్రాలకు నాయకులుగానూ, ఇశ్రాయేలు ప్రజల తెగలకు పెద్దలుగానూ ఉన్నారు.
17ఈ పేర్లతో ఉన్న వ్యక్తులను మోషే అహరోనులు పిలిచారు.
18వీళ్ళతో పాటు ఇశ్రాయేలు ప్రజల్లో పురుషులందరినీ రెండో నెల మొదటి రోజున సమావేశపర్చారు. ఇరవై ఏళ్ళూ ఆ పై వయసున్న వారు తమ తమ వంశాలనూ, పూర్వీకుల కుటుంబాలనూ తమ తెగల పెద్దల పేర్లనూ తెలియజేసారు.
19అప్పుడు యెహోవా తనకాజ్ఞాపించినట్టుగా సీనాయి అరణ్యంలో మోషే వారి సంఖ్య నమోదు చేశాడు.
20ఇశ్రాయేలు మొదటి కొడుకు రూబేను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
21అలా రూబేను గోత్రం నుండి 46, 500 మందిని లెక్కించారు.
22షిమ్యోను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
23అలా షిమ్యోను గోత్రం నుండి 59, 300 మందిని లెక్కించారు.
24గాదు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
25అలా గాదు గోత్రం నుండి 45, 650 మందిని లెక్కించారు.
26యూదా సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
27అలా యూదా గోత్రం నుండి 74, 600 మందిని లెక్కించారు.
28ఇశ్శాఖారు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
29అలా ఇశ్శాఖారు గోత్రం నుండి 54, 400 మందిని లెక్కించారు.
30జెబూలూను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
31అలా జెబూలూను గోత్రం నుండి 57, 400 మందిని లెక్కించారు.
32యోసేపు కొడుకుల్లో ఒకడైన ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
33అలా ఎఫ్రాయిము గోత్రం నుండి 40, 500 మందిని లెక్కించారు.
34మనష్షే సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
35అలా మనష్షే గోత్రం నుండి 32, 200 మందిని లెక్కించారు.
36బెన్యామీను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
37అలా బెన్యామీను గోత్రం నుండి 35, 400 మందిని లెక్కించారు.
38దాను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
39అలా దాను గోత్రం నుండి 62, 700 మందిని లెక్కించారు.
40ఆషేరు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
41అలా ఆషేరు గోత్రం నుండి 41, 500 మందిని లెక్కించారు.
42నఫ్తాలి సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
43అలా నఫ్తాలి గోత్రం నుండి 53, 400 మందిని లెక్కించారు.
44ఇశ్రాయేలులోని పన్నెండు గోత్రాలకు నాయకత్వం వహించిన వారితో పాటు వీరందర్నీ మోషే అహరోనులు లెక్కించారు.
45ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధాలకు వెళ్ళగలిగే వారిందర్నీ వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించారు.
46వారింతా కలసి 6,03,550 మంది అయ్యారు.
47కాని లేవీ వారసులను వారు లెక్కించలేదు.
48ఎందుకంటే యెహోవా మోషేకి ఇంతకు ముందే ఆజ్ఞాపించాడు.
49“లేవీ గోత్రికులను ఇశ్రాయేలు జనసంఖ్యలో చేర్చకూడదు. వారిని నమోదు చేయవద్దు.
50వాళ్లకు నిబంధన శాసనాల గుడారం బాధ్యతలు అప్పగించు. శాసనాల గుడారం లోని అలంకరణలూ, వస్తువులన్నిటినీ వారు చూసుకోవాలి. లేవీయులే గుడారాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. దానిలో ఉన్న వస్తువులను వారే మోయాలి. దాని చుట్టూ వారు తమ గుడారాలు వేసుకోవాలి.
51గుడారాన్ని మరో స్థలానికి తరలించాల్సి వస్తే లేవీయులే దాన్ని ఊడదీయాలి. తిరిగి గుడారాన్ని నిలపాలన్నా లేవీయులే దాన్ని నిలపాలి. ఎవరన్నా పరాయి వ్యక్తి గుడారాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.
52ఇశ్రాయేలు ప్రజలు వారి వారి సైనిక దళానికి చెందిన జెండా ఎక్కడ నాటారో అక్కడే తమ గుడారాలు వేసుకోవాలి.
53నా కోపం ఇశ్రాయేలు ప్రజలపైకి రాకుండా ఉండాలంటే లేవీయులు నిబంధన శాసనాల గుడారం చుట్టూ తమ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధన శాసనాల గుడారాన్ని వారే జాగ్రత్తగా చూసుకోవాలి.”
54ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞల ప్రకారం అన్నీ చేసారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చారు.