4సమాధిలోకి దిగిపోయే వాడిగా ప్రజలు నన్ను ఎంచుతున్నారు. నేను నిస్సహాయుడిలాగా ఉన్నాను.
5చచ్చినవాళ్ళ మధ్య నన్ను వదిలేశారు. మృతుడు సమాధిలో పడి ఉన్నట్టు నేనున్నాను. నువ్విక పట్టించుకోని వాడిలాగా అయ్యాను. వాళ్ళు నీ ప్రభావం నుంచి తెగతెంపులు చేసుకున్నారు.
6నువ్వు నన్ను లోతైన గుంటలో, చీకటి తావుల్లో అగాధాల్లో ఉంచావు.
7నీ ఉగ్రత నా మీద భారంగా ఉంది. నీ అలలన్నీ నన్ను ముంచుతున్నాయి. సెలా.
8నీ మూలంగా నా సన్నిహితులు నన్ను దూరంగా ఉంచుతున్నారు. వాళ్ళ దృష్టిలో నువ్వు నన్ను నీచునిగా చేశావు. నేను ఇరుక్కు పోయాను, తప్పించుకోలేను.
9బాధతో నా కళ్ళు అలసిపోయాయి. యెహోవా, రోజంతా నేను నీకు మొరపెడుతున్నాను, నీవైపు నా చేతులు చాపాను.
10మృతులకోసం నువ్వు అద్భుతాలు చేస్తావా? చచ్చిన వాళ్ళు లేచి నిన్ను స్తుతిస్తారా? సెలా.
11సమాధిలో నీ కృపను ఎవరైనా చాటిస్తారా? శ్మశానంలో నీ విశ్వసనీయతను ఎవరైనా వివరిస్తారా?
12చీకట్లో నీ అద్భుతాలు తెలుస్తాయా? మరుభూమిలో నీ నీతి తెలుస్తుందా?
13అయితే యెహోవా, నేను నీకు మొరపెడతాను. ఉదయాన నా ప్రార్థన నీ దగ్గరికి వస్తుంది.
14యెహోవా, నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? నీ ముఖాన్ని నాకెందుకు దాస్తున్నావు?
15చిన్నప్పటి నుంచి నేను కష్టాల్లో ఉన్నాను, మరణం అంచుల్లో ఉన్నాను. నీ భయాందోళనలను నేను అనుభవించాను. నేను నిస్సహాయుణ్ణి.
16నీ కోపాగ్ని నన్ను ముంచెత్తింది. భయపెట్టే నీ పనులు నన్ను హతమార్చాయి.