66ఆయన తన విరోధులను వెనక్కి తరిమికొట్టాడు. వారిని నిత్యమైన అవమానానికి గురి చేశాడు.
67తరవాత ఆయన యోసేపు గుడారాన్ని అసహ్యించుకున్నాడు. ఎఫ్రాయిము గోత్రాన్ని కోరుకోలేదు.
68యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సీయోను పర్వతాన్ని ఆయన ఎన్నుకున్నాడు.
69అంతరిక్షంలాగా, తాను శాశ్వతంగా స్థిరపరచిన భూమిలాగా ఆయన తన మందిరాన్ని కట్టించాడు.
70తన సేవకుడు దావీదును ఎన్నుకుని గొర్రెల మందల మధ్య నుండి అతణ్ణి పిలిపించాడు.
71పాలిచ్చే గొర్రెల వెంట నడవడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన వారసత్వమైన ఇశ్రాయేలును మేపడానికి ఆయన అతణ్ణి రప్పించాడు.
72అతడు యథార్థ హృదయంతో వారిని పాలించాడు. నైపుణ్యంతో వారిని నడిపించాడు.