4యెహోవా చేసిన గొప్ప కార్యాలను, ఆయన బలాన్ని, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను దాచకుండా వారి పిల్లలకు మేము వినిపిస్తాం.
5రాబోయే తరాల్లో పుట్టే పిల్లలు దాన్ని తెలుసుకుని తమ పిల్లలకు దాన్ని వివరించాలి. వారు కూడా దేవునిలో నిరీక్షణ ఉంచి దేవుని కార్యాలు మరచిపోకూడదు.
6వారి పూర్వికులు యథార్థహృదయులు కారు. దేవుని విషయంలో స్థిర బుద్ధి లేనివారై ఆయనపై తిరగబడ్డారు.
7మీరు ఆ తరం వారిలాగా ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి.
8ఆయన యాకోబు సంతానానికి శాసనాలు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు సంతానానికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. తమ సంతానానికి దాన్ని నేర్పించాలని మన పూర్వీకులకు ఆజ్ఞాపించాడు.
9ఎఫ్రాయిము గోత్రం వారు విల్లంబులు పట్టుకుని యుద్ధానికి సిద్ధపడ్డారు కానీ యుద్ధం జరిగిన రోజు వెనక్కి తిరిగి పారిపోయారు.
10వారు దేవునితో నిబంధనను నెరవేర్చలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించ లేదు.
11ఆయన చేసిన కార్యాలూ ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలూ వారు మర్చి పోయారు.
12ఈజిప్టుదేశంలోని సోయను ప్రాంతంలో వారి పూర్వీకుల మధ్య ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు.
13ఆయన సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని అవతలికి దాటించాడు. నీటిని రెండు వైపులా గోడల్లాగా నిలబెట్టాడు.
14పగలు మేఘంలో నుండీ రాత్రి అగ్ని వెలుగులో నుండీ ఆయన వారిని నడిపించాడు.
15అరణ్యంలో బండరాయిని చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు అనుగ్రహించాడు.
16బండలోనుండి ఆయన నీటికాలువలు పారజేశాడు.
17అయినా వారు మహోన్నతుని మీద తిరుగుబాటు చేసి ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే వచ్చారు.
18వారు తమ ఆశకొద్దీ ఆహారం అడుగుతూ తమ హృదయాల్లో దేవుణ్ణి పరీక్షించారు.
19ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా?
20ఆయన గండ శిలను కొట్టినప్పుడు నీరు ఉబికి కాలువలై పారింది. ఆయన మనకు ఆహారం కూడా ఇవ్వగలడా? తన ప్రజలకు మాంసం సమకూర్చగలడా? అని వారు చెప్పుకుంటూ దేవునికి విరోధంగా మాట్లాడారు.