Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 78

కీర్తన 78:32-55

Help us?
Click on verse(s) to share them!
32ఇంత జరిగినా వారు ఇంకా పాపం చేస్తూ వచ్చారు. ఆయన ఆశ్చర్యకార్యాలను చూసి ఆయన్ని నమ్మలేదు.
33కాబట్టి ఆయన వారి రోజులు తక్కువ చేశాడు. వారి సంవత్సరాలు భయంతో నింపాడు.
34ఆయన వారిని బాధలకు గురి చేసినప్పుడల్లా వారు ఆయన వైపు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకున్నారు.
35దేవుడు తమ ఆశ్రయదుర్గమనీ మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనీ వారు జ్ఞాపకం చేసుకున్నారు.
36అయితే వారు తమ నోటితో పైపైనే ఆయన్ని స్తుతించారు. తమ నాలుకలతో ఆయన ఎదుట అబద్ధాలు పలికారు.
37ఎందుకంటే వారి హృదయం ఆయన మీద నిలుపుకోలేదు. ఆయన నిబంధనను నమ్మకంగా పాటించలేదు.
38అయితే ఆయన తన కనికరాన్ని బట్టి వారిని నాశనానికి గురి చేయకుండా వారి దోషాన్ని క్షమించాడు. చాలాసార్లు తన ఉగ్రతను రేపుకోకుండా దాన్ని అణచుకున్నాడు.
39ఎందుకంటే వారు కేవలం మానవమాత్రులనీ, వీచిన తరవాత తిరిగిరాని గాలిలాంటి వారనీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు.
40అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఎడారిలో ఆయనను ఎన్నోసార్లు దుఃఖపెట్టారు.
41మాటిమాటికీ దేవుణ్ణి శోధించారు. మాటిమాటికీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి దుఃఖం పుట్టించారు.
42ఆయన బాహుబలాన్నీ, ఏ విధంగా ఆయన తమ శత్రువుల చేతిలో నుండి తమను విమోచించాడో దానినీ,
43ఈజిప్టులో ఆయన చూపిన సూచక క్రియలనూ సోయను ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతాలనూ వారు జ్ఞాపకం చేసుకోలేదు.
44నైలునది కాలవలను, వారి ప్రవాహాలను ఆయన రక్తంగా మార్చినప్పుడు ఐగుప్తీయులు తాగలేక పోయారు.
45ఆయన వారి మీదికి ఈగల గుంపులను పంపించాడు. అవి వారిని ముంచివేశాయి, కప్పలను పంపాడు. అవి వారి నేలంతటినీ కప్పివేశాయి.
46ఆయన వారి పంటలను చీడపురుగులకిచ్చాడు. వారి కష్టఫలాన్ని మిడతలకు అప్పగించాడు.
47వడగండ్ల చేత వారి ద్రాక్షతీగెలను, మంచు చేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేశాడు.
48వారి పశువులపై వడగళ్ళు కురిపించాడు. వారి మందలపై పిడుగులు రాలాయి.
49ఆయన విపత్తును కలిగించే దూతలుగా తన ఉగ్రతను, మహోగ్రతను, బాధను వారి మీదికి పంపించాడు.
50తన కోపానికి దారి చదునుగా చేశాడు. వారిని మరణం నుండి తప్పించకుండా వారి ప్రాణాన్ని తెగులుకు అప్పగించాడు.
51ఈజిప్టులోని పెద్ద కొడుకులందరినీ హాము గుడారాల్లో వారి బలానికి గుర్తుగా ఉన్న ప్రథమ సంతానాన్ని ఆయన చంపాడు.
52ఆ తరవాత ఆయన తన ప్రజలను గొర్రెలను తోలినట్టుగా నడిపించాడు. ఒకడు తన మందను ఎలా నడిపిస్తాడో అరణ్యంలో ఆయన వారిని అలా నడిపించాడు.
53వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాడు. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాడు.
54తన పరిశుద్ధ భూమి సరిహద్దు దగ్గరికి, తన కుడిచెయ్యి సంపాదించిన ఈ పర్వతం దగ్గరికి ఆయన వారిని రప్పించాడు.
55వారి ఎదుట నుండి అన్య జాతులను వెళ్లగొట్టాడు. ఆ ప్రజల వారసత్వాన్ని వారికి పంచి ఇచ్చాడు. ఇశ్రాయేలు గోత్రాలను వారి గుడారాల్లో స్థిరపరిచాడు.

Read కీర్తన 78కీర్తన 78
Compare కీర్తన 78:32-55కీర్తన 78:32-55